Share News

కూటమిలో సీట్ల సర్దుపాట్లు

ABN , Publish Date - Oct 16 , 2026 | 01:04 AM

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎంతమంది బరిలో ఉండాలనే దానిపై కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మొత్తం సీట్లలో జనసేనకు 20 శాతం, బీజేపీకి ఆరు శాతం సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది.

కూటమిలో సీట్ల సర్దుపాట్లు

జనసేనకు 20 శాతం, బీజేపీకి 6 శాతం వార్డులు

కేటాయించేందుకు ముందుకొచ్చిన టీడీపీ

40 వార్డులు అడిగిన జనసేన ఎమ్మెల్యే

కుదరని ఏకాభిప్రాయం...

బీజేపీకి ఏడు వార్డులు

విశాఖపట్నం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి):

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎంతమంది బరిలో ఉండాలనే దానిపై కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మొత్తం సీట్లలో జనసేనకు 20 శాతం, బీజేపీకి ఆరు శాతం సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది.

జీవీఎంసీలో 120 వార్డులు ఉండగా వాటిలో 20 శాతం అంటే 25 వార్డులు జనసేనకు, ఆరు శాతం లెక్కన బీజేపీకి ఏడెనిమిది వార్డులు కేటాయిస్తామని గురువారం రాత్రి నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ నాయకులు ప్రతిపాదించారు. అయితే తమకు 40 వార్డులు కావాలని జనసేనకు చెందిన ఒక ఎమ్మెల్యే తన మనసులో మాట బయటపెట్టారు. అందుకు తెలుగుదేశం నాయకులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే సమావేశం నుంచి వెళ్లిపోయారు. బీజేపీకి ఏడు వార్డులు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు తెలిసింది.

ఏ పార్టీకి ఏ వార్డు అనేది శుక్రవారం చర్చించనున్నట్టు నేతలు చెబుతున్నారు. ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో వారు కోరుకున్న సీట్లు ఇవ్వాలనేది ప్రాథమిక ఒప్పందం. ఉదాహరణకు జనసేనకు విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలుగా వంశీకృష్ణ శ్రీనివాస్‌, పంచకర్ల రమేశ్‌బాబు ఉన్నారు. వారి ప్రాంతంలో మిగిలిన పార్టీల కంటే ఎక్కువ స్థానాలు కోరుకునే అవకాశం ఉంది. అదేవిధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్‌రాజు ఉన్నారు. ఆ నియోజకవర్గంలో బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, పంచకర్ల రమేశ్‌బాబు, నాయకులు సీతంరాజు సుధాకర్‌, కోన తాతారావు, పసుపులేటి ఉషాకిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 01:04 AM