సీట్ల సర్దుబాటు కొలిక్కి...
ABN , Publish Date - Oct 20 , 2026 | 12:37 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు సోమవారం రాత్రికి ఒక కొలిక్కి వచ్చింది.
తెలుగుదేశం పార్టీకి 77, జనసేనకు 32 వార్డులు, బీజేపీకి 11 ఖరారు
మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం
విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు సోమవారం రాత్రికి ఒక కొలిక్కి వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య చర్చలు రోజుకొకచోట జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ వేదిక ఎంపీ శ్రీభరత్ ఇంటికి మారింది. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయానికి జనసేనతో చర్చలు పూర్తయ్యాయి. మొత్తం 120 స్థానాల్లో వారికి 32 ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. 20 శాతం వాటాగా 24 సీట్లు ఇవ్వాల్సి ఉండగా, వారు 34 కోరారు. దీనిపై అనేక తర్జనభర్జనలు జరిగిన తరువాత 32 వార్డులు ఇవ్వడానికి అంగీకరించారు. జనసేనకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్న దక్షిణ నియోజకవర్గంలో 8 వార్డులు, పంచకర్ల రమేశ్‌బాబు ఎమ్మెల్యేగా ఉన్న పెందుర్తిలో 4, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు ఉన్న గాజువాక నియోజక వర్గంలో 6, అనకాపల్లి నియోజకవర్గంలో 3, తూర్పులో 2, ఉత్తరంలో 3, పశ్చిమలో 3, భీమిలిలో 3...కలిపి మొత్తం 32 కేటాయించారు. అవి ఏయే వార్డులు అనేది మళ్లీ అక్కడి కూటమి పార్టీల నేతలతో చర్చించుకుని మంగళవారం పూర్తి అవగాహనకు వచ్చి ఖరారు చేసుకుంటారు.
బీజేపీకి 11...
జనసేనతో చర్యలు పూర్తయ్యాక బీజేపీతో సాయంత్రం 6.30 గంటలకు చర్చలు ప్రారంభించారు. ఈ భేటీలో మొదటి నుంచి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పరశురామరాజు పాల్గొంటున్నారు. తొలుత వీరికి సింగిల్ డిజిట్‌లో స్థానాలు ఇస్తామని ప్రతిపాదించారు. కానీ విష్ణుకుమార్‌రాజు కనీసం 14 అయినా ఇవ్వాలని పట్టుబట్టారు. సోమవారం సాయంత్రానికి 11 ఖరారు చేశారు. బీజేపీకి ఉత్తరంలో 4, గాజువాకలో 2, పెందుర్తి, అనకాపల్లి, పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ఖరారు చేశారు. మరో సీటు ఏ నియోజకవర్గంలో ఇస్తారనే దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.
టీడీపీకి 77 స్థానాలు
మొత్తం 120 స్థానాల్లో జనసేనకు 32, బీజేపీకి 11 ఇవ్వగా టీడీపీకి 76 స్థానాలు మిగిలాయి. వాటినే ఆశావహులకు సర్దుబాటు చేయాల్సి ఉంది. ఎవరికి సీటు వస్తుందో స్పష్టత లేకపోవడంతో ఒక్కో వార్డు నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున నామినేషన్లు వేసేశారు. ఇప్పుడు బీఫారం ఎవరికి పార్టీ ఇస్తుందో వారే అభ్యర్థులుగా బరిలో ఉండి మిగిలిన వారు తప్పుకోవలసి ఉంటుంది.