Share News

కేజీబీవీల్లో సీట్లు ఫుల్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:33 AM

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) అంటే ఒకప్పుడు కేవలం డ్రాపవుట్‌ బాలికల కోసం ఏర్పాటు చేసినవనే భావన ఉండేది. కానీ అందులో సకల సదుపాయాలు కల్పిస్తూ ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన బోధన అందుతుండడంతో నేడు కేజీవీబీల్లో చేరేందుకు బాలికలు ఆసక్తి చూపుతున్నారు.

కేజీబీవీల్లో సీట్లు ఫుల్‌
ముంచంగిపుట్టు మండలం కిలగాడలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం

- కార్పొరేట్‌ స్థాయి విద్యను అందిస్తుండడంతో డిమాండ్‌

- ఆరు నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఆంగ్ల మాధ్యమంలో బాలికలకు ఉచిత విద్య

- అదనపు సీట్లు మంజూరు చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) అంటే ఒకప్పుడు కేవలం డ్రాపవుట్‌ బాలికల కోసం ఏర్పాటు చేసినవనే భావన ఉండేది. కానీ అందులో సకల సదుపాయాలు కల్పిస్తూ ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన బోధన అందుతుండడంతో నేడు కేజీవీబీల్లో చేరేందుకు బాలికలు ఆసక్తి చూపుతున్నారు.

జిల్లాలో ఈ ఏడాది కేజీబీవీల్లో ఆరవ తరగతి, తొలి ఏడాది ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించగా, మొత్తం సీట్లు భర్తీ అయ్యాయి. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగానే నేడు కేజీబీవీల్లో ప్రవేశాలకు బాలికలు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో జిల్లాలోని పదకొండు కేజీబీవీల్లోనూ అదనపు సీట్లు మంజూరు చేయాలని బాలికల తల్లిదండ్రులు కోరుతున్నారు.

కార్పొరేట్‌ స్థాయి విద్య

ఎక్కడైనా విద్యాలయాల్లో చేర్పిస్తే కేవలం విద్య మాత్రమే అందుతుంది. కానీ కేజీబీవీల్లో అందుకు భిన్నంగా కార్పొరేట్‌ స్థాయిలో ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఉచిత విద్యను ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. అలాగే మెరుగైన ఆధునిక సదుపాయాలతో పాటు పోషకాహారం, ఆర్యోగ సేవలు అందిస్తుంటారు. బాలికలకు విద్యతో పాటు శారీరక, మానసిక వికాసానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి రోజు ఉదయం యోగ, సాయంత్రం క్రీడలతో పాటు ఆత్మరక్షణకు కరాటేలో శిక్షణ ఇస్తున్నారు. సృజనాత్మకతను పెంచేందుకు సంగీతం, నృత్యం, చిత్రలేఖనంలోనూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీంతో కేజీబీవీల్లో ఆరవ తరగతిలో ప్రవేశం పొందితే, ఇంటర్‌ పూర్తి చేసే వరకు ఎటువంటి ఖర్చు లేకుండా కార్పొరేట్‌ స్థాయి సదుపాయాలతో విద్యను పొందవచ్చుననే ఆలోచనతో తల్లిదండ్రులు తమ పిల్లలను కేజీబీవీల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది పదవ తరగతిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రాకపోగా, అన్ని కేజీవీబీల్లో చక్కని ఫలితాలు సాధించారు. దీంతో కేజీబీవీల్లో ప్రవేశాలకు ఈ ఏడాది మరింత డిమాండ్‌ పెరిగింది. అయితే ఆరు నుంచి ఇంటర్‌ వరకు ఒక్కో తరగతిలో 40 సీట్లు మాత్రమే ఉండడం, ప్రవేశాలకు డిమాండ్‌ పెరగడంతో అదనపు సీట్లు మంజూరు చేయాలని బాలికల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - Jul 03 , 2026 | 12:33 AM