Share News

జడ్పీ హైస్కూల్‌లో సీట్లు ఫుల్‌

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:14 PM

స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఈ ఏడాది పాఠశాల పునఃప్రారంభమైన రెండు రోజుల వ్యవధిలోనే సీట్లు నిండిపోయాయి. ప్రైవేటు పాఠశాలల నుంచి 21 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.

జడ్పీ హైస్కూల్‌లో సీట్లు ఫుల్‌
విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్న ఉపాధ్యాయులు

భారీగా పెరిగిన ప్రవేశాలు

ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థుల చేరిక

600 దాటనున్న విద్యార్థుల సంఖ్య

చింతపల్లి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఈ ఏడాది పాఠశాల పునఃప్రారంభమైన రెండు రోజుల వ్యవధిలోనే సీట్లు నిండిపోయాయి. ప్రైవేటు పాఠశాలల నుంచి 21 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 530కి చేరింది. మరో 70మంది విద్యార్థులు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరిమితికి మించి విద్యార్థులు పాఠశాలలో చేరడం వల్ల అదనపు సెక్షన్లు ఏర్పాటు చేసేందుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు.

చింతపల్లి మండల కేంద్రంలో సుమారు యాభై ఏళ్ల క్రితం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాలలు అందుబాటులోకి రావడం, గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల సంఖ్య పెరగడంతో ఈ పాఠశాలలో ప్రవేశాలు తగ్గాయి. ప్రతి ఏడాది 250- 300 మంది విద్యార్థులతో పాఠశాల నడుస్తున్నది. విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు బదిలీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, నారా లోకేశ్‌ విద్యాశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు నూతన సంస్కరణలకు తెరతీశారు. పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు వంద రోజుల ప్రణాళిక, విద్యార్థులకు బలమైన పునాది వేసేందుకు సంసిద్ధత కార్యక్రమాలను అమలు చేశారు. పాఠశాల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలుతో పాటు విద్యార్థి మిత్ర కిట్‌లను అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో నమ్మకం పెరిగింది. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2024-25విద్యాసంత్సరంలో విద్యార్థుల సంఖ్య 450కి చేరింది. పదవ తరగతి ఫలితాల్లోనూ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ ఏడాది పాఠశాల పునఃప్రారంభం నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఆరు నుంచి పదవ తరగతి వరకు ప్రవేశాలు పొందారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 530కి చేరింది. మరో 70మంది విద్యార్థులు ప్రవేశాలు కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈమేరకు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 600కి చేరుకోనుంది. దీంతో 8, 9, 10 తరగతుల్లో ‘డీ’ సెక్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయినితో పాటు 21 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక్కో తరగతిలో 30 మంది విద్యార్థుల చొప్పున మూడు(ఏ, బీ, సీ) సెక్షన్లు ఉన్నాయి. హిందీ మినహా ప్రతి పాఠ్యాంశానికి ముగ్గురు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలో ప్రవేశాల సంఖ్య భారీగా పెరగడంతో విద్యాశాఖ అధికారులు పీబీవీవీ ప్రసాద్‌, గెమ్మెలి బోడంనాయుడు ఉపాధ్యాయులను అభినందించారు.

Updated Date - Jun 25 , 2026 | 11:14 PM