త్వరలో ఎగరనున్న సీ ప్లేన్
ABN , Publish Date - May 22 , 2026 | 12:01 AM
ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న గిరిజన ప్రాంతంలో సీప్లేన్ సేవలు త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలిగించే సీప్లేన్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్నది. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం ద్వారా నిధులు ఇచ్చేందుకు అంగీకారం తెలపడంతో పనులు వేగవంతమయ్యాయి.
- జోలాపుట్టు, సీలేరు జలాశయాల్లో ఏరోడ్రోమ్‌ల నిర్మాణం
- ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి
- పరిశీలనలో తాజంగి జలాశయం
- ఉడాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు
- పర్యాటకాభివృదికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
- ఆదివాసీలకు మెరుగుపడనున్న ఉపాధి
చింతపల్లి, మే 21 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న గిరిజన ప్రాంతంలో సీప్లేన్ సేవలు త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలిగించే సీప్లేన్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్నది. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం ద్వారా నిధులు ఇచ్చేందుకు అంగీకారం తెలపడంతో పనులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే అరకు రీజియన్ జోలాపుట్టు, లంబసింగి రీజియన్ సీలేరు జలాశయాల్లో ఏరోడ్రోమ్‌లు(నీటి విమానాశ్రయాలు), ఫ్లోటింగ్ జెట్టీలు(నీటిపై తేలియాడే ప్లాట్‌ఫారమ్) నిర్మాణాలకు ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. లంబసింగికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజంగి జలాశయంలోనూ ఏరోడ్రోమ్ నిర్మాణాన్ని పర్యాటకశాఖ పరిశీలిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు రాగానే సీప్లేన్ సేవలు పర్యాటకులకు చేరువకానున్నాయి.
రాష్ట్ర వ్యాప్తగా నదులు, జలాశయాలు, సముద్రతీరాలను అనుసంధానం చేస్తూ పర్యాటకశాఖ పది ప్రాంతాల్లో సీప్లేన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ పది ప్రాంతాల్లోనూ ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఏరోడ్రోమ్‌ల నిర్మాణాలకు భూసేకరణ కార్యక్రమం చేపడుతున్నారు. తొలిసారిగా సీలేరు, జోలాపుట్టు ప్రాంతాల్లో ఏరోడ్రోమ్ నిర్మాణాలకు ప్రజాభిప్రాయ సేకరణ సైతం పూర్తి చేశారు.
గిరిజన ప్రాంతంలో పెరగనున్న సందర్శనలు
సీప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తే గిరిజన ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటికే ప్రతి ఏడా సీజన్‌లో అరకు, లంబసింగి ప్రాంతాలకు వేల సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ప్రకృతి అందాలు, జలపాతాలను సందర్శించి పర్యాటకులు వెళ్లిపోతున్నారు. మరో రెండు నెలల్లో లంబసింగిలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం అందుబాటులోకి రానున్నది. జోలాపుట్టు, సీలేరు జలాశయాల్లో సీప్లేన్ ల్యాండింగ్, టేకాఫ్ జరిగే భారీ సంఖ్యలో పర్యాటకులు ఈ సేవలను ఉపయోగించుకుంటారని పర్యాటకశాఖ భావిస్తోంది. తాజంగి జలాశయంలోనూ ఏరోడ్రోమ్ నిర్మించి సీప్లేన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సాఽధ్యాసాధ్యాలను పర్యాటకశాఖ పరిశీలిస్తున్నది.
మెరుగుపడనున్న ఉపాధి
గిరిజన ప్రాంతం పర్యాటకపరంగా అభివృద్ధిచెందుతుండడంతో స్థానిక ఆదివాసీలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇప్పటికే అరకు, లంబసింగి ప్రాంతాల్లో గిరిజన యువత వ్యాపారం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. సీప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు ప్రాధాన్యం పెరుగుతుంది. పర్యాటకులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ గిరిజనులు ఉపాధి పొందనున్నారు. ఆదివాసీలు పండించిన వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను నేరుగా పర్యాటకులకు విక్రయించుకునే వెసులుబాటు కలుగుతుంది. పర్యాటకాభివృద్ధి ద్వారా ఆదివాసీల జీవన విధానంలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నది.