Share News

గండి వెతలకు తెర

ABN , Publish Date - Aug 01 , 2026 | 01:03 AM

మండలంలో మేజర్‌ శారదా నది గట్ల పటిష్ఠానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పరిపాలన పరమైన ఆమోదం లభించిందని, అధికారులు త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

గండి వెతలకు తెర
రాంబిల్లి మండలం రజాల వద్ద శారదా నది గట్టుకు గండి పడిన దృశ్యం (ఫైల్‌ ఫొటో)

శారదా నది గట్టుకు శాశ్వత మరమ్మతులు

రూ.2 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

రాంబిల్లి మండలం రాజాల వద్ద 140 మీటర్ల మేర వరద నివారణ పనులు

రాంబిల్లి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మండలంలో మేజర్‌ శారదా నది గట్ల పటిష్ఠానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పరిపాలన పరమైన ఆమోదం లభించిందని, అధికారులు త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

గత ఏడాది అక్టోబరులో సంభవించిన ‘మొంథా’ తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు కురవడంతో శారదా నది వరదతో ఉగ్రరూపం దాల్చింది. దీంతో మండలంలోని రజాల గ్రామం వద్ద భారీ గండి పడింది. సమీపంలో వున్న వందలాది ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. అధికారులు అప్పట్లో ఇసుక బస్తాలు వేసి గండిని తాత్కాలికంగా పూడ్చారు. అయితే ఇక్కడ శాశ్వత పనులు చేపట్టకపోతే ఈ ఏడాది వర్షా కాలంలో శారదా నదిలో వరద పోటెత్తితే మళ్లీ గండి పడే ప్రమాదం వుందని అప్పట్లోనే రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జలవనరుల శాఖ అధికారులు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. తరువాత ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ పలుమార్లు సీఎం చంద్రబాబునాయుడు, జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి శారదా నది గట్లకు శాశ్వత మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి రూ.2 కోట్లు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నిధులతో రజాల గ్రామం వద్ద గత ఏడాది గండి పడిన శారదా నది గట్టును సుమారు 140 మీటర్ల మేర పటిష్ఠపరుస్తారు. అవసరమైన చోట కాంక్రీట్‌ గోడ నిర్మిస్తారు. త్వరలో టెండర్ల ప్రక్రియ ముగించి, పనులు చేపడతారని ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ వెల్లడించారు.

Updated Date - Aug 01 , 2026 | 01:03 AM