Share News

ఎన్నికల ప్రచారానికి తెర

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:59 AM

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది. ప్రచారం ముగింపు సందర్భంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు, మద్దతుదారులు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీతోపాటు విశాఖ మహా నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్‌లో ఆదివారం పోలింగ్‌ జరగనున్నది. ఎన్నికల సిబ్బందికి శనివారం ఉదయం ఆయా డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రాల్లో పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేస్తారు. అనంతరం వారికి కేటాయించిన వార్డులకు వాహనాల్లో బయలుదేరి వెళతారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఎన్నికల ప్రచారానికి తెర
అనకాపల్లిలో పోలింగ్‌ సామగ్రి పంపిణీకి రావు గోపాలరావు కళా కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు

పది రోజులపాటు పార్టీలు, అభ్యర్థుల హోరు

నర్సీపట్నం, ఎలమంచిలి చైర్‌పర్సన్‌ పదవులకు కూటమి, వైసీపీ మధ్యనే ప్రధాన పోటీ

నర్సీపట్నంలో 40 వార్డులకుగాను రెండు వార్డులు టీడీపీకి ఏకగ్రీవం

మిగిలిన 38 వార్డులకు 84 మంది పోటీ

ఎలమంచిలిలో 32 వార్డులకు 77 మంది..

ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరతీసిన అభ్యర్థులు

అనకాపల్లి/ నర్సీపట్నం/ ఎలమంచిలి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది. ప్రచారం ముగింపు సందర్భంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు, మద్దతుదారులు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీతోపాటు విశాఖ మహా నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్‌లో ఆదివారం పోలింగ్‌ జరగనున్నది. ఎన్నికల సిబ్బందికి శనివారం ఉదయం ఆయా డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రాల్లో పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేస్తారు. అనంతరం వారికి కేటాయించిన వార్డులకు వాహనాల్లో బయలుదేరి వెళతారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 14వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అదే రోజు నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరిగింది. ఉపసంహరణల అనంతరం 21వ తేదీన పోటీలో వున్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేయాల్సి వుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తుది జాబితాను ఈ నెల 25వ తేదీన విడుదల చేశారు. దీంతో పోలింగ్‌ తేదీని అక్టోబరు 28 నుంచి నవంబరు ఒకటికి, ఓట్ల లెక్కింపును అక్టోబరు 30 నుంచి నవంబరు మూడో తేదీకి వాయిదా వేశారు. గత వారం రోజుల్లో చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌/ కార్పొరేటర్‌ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి, తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థులు గత రెండున్నరన సంవత్సరాల్లో వార్డుల్లో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమిని గెలిపిస్తే.. మరింత అభివృద్ధి జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అభ్యర్థులు.. స్థానిక సమస్యలను ఎత్తిచూపుతూ, తమను గెలిపించాలని ఓటర్లను కోరారు.

నర్సీపట్నంలో...

స్థానిక మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌గా కూటమి బలపర్చిన టీడీపీ అభ్యర్థి చింతకాయల పద్మావతి, వైసీపీ అభ్యర్థి చింతకాయల అనిత, ఇండిపెండెంట్‌గా బైపురెడ్డి చిట్టి సంధ్యారాణి పోటీ చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థి తరపున రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌ అన్నీ తానై ప్రచారాన్ని ముందుకు నడిపించారు. వార్డుల్లో సభలు, యువతీ యువకులతో సమావేశాలు నిర్వహించి, మునిసిపాలిటీలో అభివృద్ధి కొనసాగాలంటే పద్మావతికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.. వైసీపీ అభ్యర్థిని అనితకు మద్దతుగా ఆమె భర్త సన్యాసిపాత్రుడు, మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేశ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి, వైసీపీతోపాటు మరో ఇండిపెండెంట్‌ అభ్యర్థి బరిలో వున్నప్పటికీ ప్రధానంగా టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్యనే సాగింది. 40 వార్డులకుగాను 26, 27 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 38 వార్డులో 84 మంది పోటీలో ఉన్నారు.

ఎలమంచిలిలో

ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవికి కూటమి తరపున (బీజేపీ) పిల్లా రమాకుమారి, వైసీపీ నుంచి బొద్దపు తులసీ, కాంగ్రెస్‌ పార్టీ దొడ్డి శాంతి పోటీ పడుతున్నారు. అయితే ప్రధానంగా కూటమి, వైసీపీ మధ్యనే పోటీ నెలకొందని రాజకీయ విశ్లేషకులకు చెబుతున్నారు. మొత్తం 32 వార్డుల కౌన్సిలర్‌ పదవులకు 77 మంది పోటీ పడుతున్నారు. మునిసిపాలిటీలో 36,526 మంది ఓటర్లు వుండగా, వీరిలో పురుషులు 17,450, మహిళలు 19,068, ఇతరులు 8 మంది ఉన్నారు.

జీవీఎంసీ అనకాపల్లి జోన్‌లో...

జీవీఎంసీ అనకాపల్లి జోన్లలోని ఆరు వార్డుల్లో (107 నుంచి 112 వార్డుల వరకు) కార్పొరేటర్‌ పదవులకు 20 మంది పోటీ పడుతున్నారు. 107వ వార్డులో ముఖాముఖి, 108, 109, 112 వార్డుల్లో త్రిముఖ, 110వ వార్డులో చతుర్ముఖ పోటీ నెలకొంది. 111వ వార్డులో ఐదుగురు పోటీ చేస్తున్నారు. కూటమి, వైసీపీ అన్ని వార్డుల్లో పోటీ చేస్తున్నాయి.

ఓటర్లకు మద్యం, డబ్బులు, బహుమతులు పంపిణీ

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగియడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఓటర్ల మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. పలుచోట్ల పురుషులకు డబ్బులు, మద్యం సీసాలు, మహిళలకు చీరలు, ముక్కుపుడకలు వంటివి పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. నర్సీపట్నంలో అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్‌ అభ్యర్థులు ఒక్కో ఓటుకి రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్పులతోపాటు రూ.500 నోట్లు రెండేసి చొప్పున మడతపెట్టి ఓటర్ల చేతిలో పెడుతున్నారు. దీంతోపాటు పురుషులకు మద్యం క్వార్టర్‌ బాటిళ్లు ఇస్తున్నట్టు చెబుతున్నారు. శారదానగర్‌లో ఓ ఇండిపెండెంట్‌ అభ్యర్థి వెండి ఉంగరాలు పంపిణీ చేసినట్టు ప్రచారం జరుగుత్నుది.

Updated Date - Oct 31 , 2026 | 12:59 AM