ఠారెత్తిస్తున్న ఎండలు
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:38 AM
ఇది ఎండ కాలమా? వర్షా కాలమా? అన్న సందేహం వ్యక్తం అవుతున్నది. గత కొద్ది రోజుల నుంచి వేసవిని తలపించేలా ఎండ తీక్షణంగా కాస్తున్నది. మంగళవారం ఈ పరిస్థితి మరింత అధికంగా కనిపింది. తీవ్ర ఎండకుతోడు మధ్యాహ్నం వడగాడ్పులు వీచాయి.
వేసవిని తలపిస్తున్న ఉష్ణోగ్రతలు
వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం
(ఆంధ్రజ్యోతి- న్యూస్ నెట్‌వర్క్)
ఇది ఎండ కాలమా? వర్షా కాలమా? అన్న సందేహం వ్యక్తం అవుతున్నది. గత కొద్ది రోజుల నుంచి వేసవిని తలపించేలా ఎండ తీక్షణంగా కాస్తున్నది. మంగళవారం ఈ పరిస్థితి మరింత అధికంగా కనిపింది. తీవ్ర ఎండకుతోడు మధ్యాహ్నం వడగాడ్పులు వీచాయి. జోరున వర్షాలు కురవాల్సిన సమయంలో మాడు పగిలేలా ఎండలు కాస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ చుర్రుమంటున్నది. మంగళవారం అనకాపల్లిలో 37.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడికితోడు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్న సమయంలో రహదారులపై జన సంచారం తగ్గిపోతున్నది. కాగా లోడ్ రిలీఫ్ పేరుతో ఈపీడీసీఎల్ అధికారులు అప్రకటిత విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. పలు గ్రామాల్లో రాత్రిపూట విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంతో ఉక్కపోత, దోమల మోతతో జనం నిద్రపోకుండా జాగారం చేయాల్సి వస్తున్నది. కొన్నిచోట్ల సీజనల్ నిర్వహణ పనుల పేరుతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరాను నిలిపేస్తున్నారు.