Share News

గూడు లేని బడులు

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:50 AM

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడమనేది సహజం. కానీ గిరిజన ప్రాంతమైన అల్లూరి జిల్లాలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నేటికీ వందల సంఖ్యలోని ప్రాథమిక పాఠశాలలకు భవనాలు లేని దుస్థితి చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రాథమిక పాఠశాలలకు వసతి సదుపాయం కలగని దుస్థితి నెలకొంది. దీంతో స్థానిక గిరిజనులే తమ పిల్లల కోసం శ్రమదానంతో పాకలు, రేకుల షెడ్లు నిర్మించుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో నేటికీ జిల్లాలో 11 మండలాల్లో 254 గిరిజన పల్లెల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు కనీస గూడు లేని దుస్థితి నెలకొంది.

 గూడు లేని బడులు
గ్రామస్థులు వేసిన షెడ్డులో నిర్వహిస్తున్న లక్కవరం పాఠశాల

అల్లూరి జిల్లాలో 254 స్కూళ్లకు భవనాలే లేవు

నేటికీ పాకలు, షెడ్లలోనే విద్యాబోధన

వైసీపీ ఐదేళ్ల పాలనలో

ఒక్క బడికి భవనం కట్టని వైనం

రెండేళ్ల కూటమి పాలనలోనూ అదే దుస్థితి

పాఠశాలల వసతి సమస్యను

పరిష్కరించాలని తల్లిదండ్రుల వేడుకోలు

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడమనేది సహజం. కానీ గిరిజన ప్రాంతమైన అల్లూరి జిల్లాలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నేటికీ వందల సంఖ్యలోని ప్రాథమిక పాఠశాలలకు భవనాలు లేని దుస్థితి చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రాథమిక పాఠశాలలకు వసతి సదుపాయం కలగని దుస్థితి నెలకొంది. దీంతో స్థానిక గిరిజనులే తమ పిల్లల కోసం శ్రమదానంతో పాకలు, రేకుల షెడ్లు నిర్మించుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో నేటికీ జిల్లాలో 11 మండలాల్లో 254 గిరిజన పల్లెల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు కనీస గూడు లేని దుస్థితి నెలకొంది.

భవనాలకు తల్లిదండ్రుల అభ్యర్థనలు

గత కొన్నాళ్లుగా ఏజెన్సీలోని పాఠశాలలకు భవనాలను నిర్మించాలని కోరుతూ అనేక ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేపడుతూ తమ సమస్యను పాలకుల దృష్టికి తీసుకు వస్తున్నారు. జిల్లా, మండల స్థాయిల్లో అధికారులు నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాల్లో వీటిపైనే అధిక సంఖ్యలో వినతులు అందుతున్నాయి. పదేళ్లుగా ఏజెన్సీలోని ప్రాథమిక పాఠశాలలకు భవనాలు నిర్మించని పరిస్థితి కొనసాగుతున్నది. గిరిజనులకు సైతం విద్య ప్రాముఖ్యత తెలియడంతో వారి పిల్లలను విధిగా పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలతోపాటు ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, గురుకులాల్లోని సైతం శతశాతం సీట్లు భర్తీ అవుతున్నాయి.

వైసీపీ పాలనలో ఒక్క భవనం కట్టలేదు

విద్యారంగంలో విశేష సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పే గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో జిల్లాలోని ఒక్క పాఠశాలకు భవనం కట్టలేదు. ‘నాడు- నేడు’ కార్యక్రమంలో కేవలం 15 నుంచి 20 శాతం పాఠశాలలను మాత్రమే ఎంపిక చేసుకుని, వాటికే కోట్లాది రూపాయాలు వ్యయం చేసి అనవసర హంగులు చేయడం మినహా క్షేత్ర స్థాయిలో గూడు లేని బడుల గురించి పట్టించుకోలేదు. గిరిజన పల్లెల్లోని ఈ సమస్యను గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాలకుల దృష్టికి వెళ్లినప్పటికీ పట్టించుకోవడంలేదు. దీంతో చేసేది లేక కొన్నిచోట్ల గిరిజనులు తమకున్న అవకాశం మేరకు శ్రమదానంతో పాఠశాలలకు వసతి ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వాటిలోనే ప్రస్తుతం పాఠశాలల నిర్వహణ కొనసాగుతున్నది. జిల్లాలో చింతపల్లి మండలంలో అత్యధికంగా 46 పాఠశాలలకు భవనాలు లేకపోగా.. అత్యల్పంగా పాడేరు, డుంబ్రిగుడ మండలాల్లో అత్యల్పంగా 8 పాఠశాలలకు ఎటువంటి భవనాలు లేవు.

అమలు కాని కూటమి మంత్రుల హామీలు

గిరిజన ప్రాంతంలోని వసతి లేని ప్రాథమిక పాఠశాలలకు భవనాలను నిర్మిస్తామని 2024 జూలైలోనే రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ముంచంగిపుట్టు మండలం కెందుగూడ గ్రామంలోని గిరిజనులు శ్రమదానంతో పాఠశాలకు షెడ్‌ నిర్మాణం చేసుకున్న వైనం మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి వెళ్లడడంతో ఆయన ఆ పాఠశాల భవన నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతంలో భవనాలు లేని 408 పాఠశాలలకు భవనాలను నిర్మించేందుకు రూ.56 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే 2024 జూలై నెలలో పాడేరు వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సైతం ఇదే విషయాన్ని అప్పట్లో ప్రస్తావించారు. నేటికి రెండేళ్లయినా గిరిజన ప్రాంతంలో పాఠశాలలకు భవనాల నిర్మాణంపై ఇద్దరు మంత్రులు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి పాఠశాల భవనాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

వ.సం మండలం భవనాలు లేని స్కూళ్లు విద్యార్థుల సంఖ్య

1. అనంతగిరి 16 480

2. అరకులోయ 9 174

3. చింతపల్లి 46 950

4. జీకేవీధి 22 220

5. జి.మాడుగుల 25 208

6. హుకుంపేట 26 190

7. కొయ్యూరు 14 216

8. ముంచంగిపుట్టు 43 865

9. పాడేరు 8 86

10. పెదబయలు 37 260

11. డుంబ్రిగుడ 8 117

------------------------------------------------------------------------

మొత్తం 254 3,766

------------------------------------------------------------------------

Updated Date - Jul 12 , 2026 | 12:50 AM