పచ్చని వనాలుగా పాఠశాలలు
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:50 PM
పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థులకు స్వచ్ఛమైన గాలి అందించేందుకు వీలుగా అలా్ట్ర హైడెన్సిటీ పద్ధతిలో మొక్కలు నాటేందుకు ‘అనంత అరణ్య’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
జిల్లాలో 50 స్కూళ్ల ఎంపిక
‘అనంత అరణ్య’ పేరిట ఒక్కో బడి ఆవరణలో 1,675 మొక్కలు నాటాలని లక్ష్యం
ఉపాధి హామీ పథకంలో పనులు
ప్రస్తుతం గోతులు తవ్వే ప్రక్రియ వేగవంతం
21న మొక్కలు నాటేందుకు చర్యలు
కొయ్యూరు, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థులకు స్వచ్ఛమైన గాలి అందించేందుకు వీలుగా అలా్ట్ర హైడెన్సిటీ పద్ధతిలో మొక్కలు నాటేందుకు ‘అనంత అరణ్య’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో నిపుణుల బృందం పర్యటించి 50 పాఠశాలలను ఎంపిక చేసింది. ఒక్కొక్క పాఠశాలలో 25 సెంట్ల స్థలంలో రూ.4.99 లక్షల వ్యయంతో 1,675 మొక్కలు నాటి సరికొత్త పద్ధతిలో పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. ఉపాధి హామీ పథకంలో గోతులు తవ్వే ప్రక్రియ వేగవంతం చేయగా, మొక్కలు నాటే కార్యక్రమం ఈ నెల 21న ఘనంగా నిర్వహించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా అనతి కాలంలో అవి దట్టమైన వనంగా మారేందుకు వీలుగా ఉండే మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఇందుకు గాను పాఠశాలకు 932 ఔషద మొక్కలు, గుబురుగా తుప్పలుగా పెరిగే 396 మొక్కలు, మధ్య రకం చెట్లుగా విస్తరించే 160 మొక్కలు, చిన్నపాటి గుబురుగా పెరిగే 56 మొక్కలతో పాటు ఆక్సిజన్ ఎక్కువగా వెలువరించే 40 మొక్కలు, వృక్షాలుగా విస్తరించే మరో 40 మొక్కలు కలిపి.. మొత్తం 1,675 మొక్కలు ఎంపిక చేసిన పాఠశాలల్లో గల 25 సెంట్ల విస్తీర్ణంలో నాటనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాల ప్రహరీ గోడ నుంచి మీటరు వదిలి మూడు వరుసలుగా గుబురుగా, పెద్ద చెట్లుగా పెరిగే మొక్కలు వేయనున్నారు. అలాగే ఐదు మీటర్లు పొడవు, వెడల్పుతో బ్లాక్‌ల్లా తయారు చేసి బ్లాక్ ఒక్కింటికి పెద్ద, మధ్యమ, చిన్నగా పెరిగే గుబురైన ఔషధ మొక్కలతో పాటు ఇతర మొక్కలు నాటుతారు.
జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలు
అనంతగిరి మండలంలో 4, అరకులోయలో 10, చింతపల్లిలో 5, డుంబ్రిగుడలో 2, జీకే వీధిలో 4, జి.మాడుగులలో 6, హుకుంపేటలో 3, ముంచంగిపుట్టులో 2, పాడేరులో 4, పెదబయలులో 4, కొయ్యూరులో 5తో పాటు జిల్లాలో మరో పాఠశాలతో కలిసి మొత్తం 50 స్కూళ్లను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో ఈ పథకం అమలుకు సోషల్ వెల్ఫేర్, ఫారెస్టు, హార్ట్‌ఫుల్‌నెస్ నెట్ సంస్థ ఆధ్వర్యంలో నిపుణుల బృందం ఇప్పటికే పరిశీలన జరిపింది. ఆయా పాఠశాలల్లో మొక్కలు నాటేందుకు వీలుగా ఉపాధి హామీ పథకంలో గోతులు తవ్వే కార్యక్రమాన్ని ఈ నెల 6న ప్రారంభించారు. ఈ పథకం అమలుకు గాను ఉపాధి హామీ పథకంలో పాఠశాల ఒక్కింటికి రూ.4,99,334లు వెచ్చిస్తుండగా, ఇందులో శ్రామికుల వేతనాలకు రూ.1,78,992లు, మెటీరియల్ రూపంలో రూ.3,20,342లు ఖర్చు చేయనున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ నెల 21న అనంత అరణ్య పేరుతో మొక్కలు నాటేందుకు ముహూర్తం ఖరారు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయించేందుకు జిల్లాకు చెందిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల ఓఎస్‌డీగా పనిచేస్తున్న మూర్తిని నోడల్ అధికారిగా నియమించారు. ప్రభుత్వ ఆశయానికి తగినట్టుగా ఈ 161 రకాల మొక్కలు పెరిగి పెద్దవైతే అడవిని తలపించేలా నిత్యం పచ్చదనం, స్వచ్ఛమైన గాలితో విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.