బడి పిలుస్తోంది
ABN , Publish Date - Apr 18 , 2026 | 01:01 AM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విద్యా శాఖ శుక్రవారం నుంచి ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై విద్యా శాఖ దృష్టి
బడి ఈడు కలిగిన పిల్లల తల్లిదండ్రులను కలవనున్నఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు
23వ తేదీ వరకు కార్యక్రమం
విశాఖపట్నం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విద్యా శాఖ శుక్రవారం నుంచి ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయలు, ఉపాధ్యాయులంతా తమ పరిధిలో బడి ఈడు కలిగిన పిల్లల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి విద్యా శాఖ వారం రోజుల ప్రణాళికను రూపొందించింది. ప్రధానంగా ఒకటో తరగతిలో ప్రవేశాలపై దృష్టిసారించాలని సూచించింది. అలాగే ప్రభుత్వ బడుల్లో ఐదో తరగతి చదువుకుంటున్న విద్యార్థులు ఆరో తరగతి ప్రభుత్వ యూపీ/ఉన్నత పాఠశాలల్లో చేరేలా తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యత హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు అప్పగించారు.
జిల్లాలోని 568 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రస్తుత విద్యా సంవత్సరం 72 వేల మంది చదువుతున్నారు. అయితే కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పదిలోపు ఉండగా, మరికొన్ని పాఠశాలల్లో 20లోపు ఉంది. వచ్చే విద్యా సంవత్సరానికి 10లోపు, 20లోపు విద్యార్థులుండే పాఠశాలల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీచర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థులను పెంచుకోకపోతే పాఠశాలల మనుగడకు ప్రమాదం వాటిల్లుతుంది. గత ప్రభుత్వంలో విద్యా సంస్కరణల పేరిట ప్రభుత్వ పాఠశాలలు ప్రధానంగా ప్రాథమిక పాఠశాలలను పలు రకాలుగా విభజనచేయడంతో వేలాది మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మోడల్ ప్రాథమిక పాఠశాలల పేరిట మరో ప్రయోగం చేసినా కొన్నిచోట్ల ఆశించిన ఫలితాలు కనిపించలేదు. ప్రాథమిక పాఠశాల వ్యవస్థపై తల్లిదండ్రులు నమ్మకం కోల్పోవడంతో ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. దీంతో గడచిన మూడు, నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతూ వస్తుండడంతో విద్యా శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించింది. టీచర్లు గ్రామాల్లో పిల్లలుండే ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను నచ్చజెప్పి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చూడాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పాఠశాల విద్యా శాఖ ఆర్‌జేడీ విజయభాస్కర్ పేర్కొన్నారు. ఈనెల 23వ తేదీ వరకు పాఠశాలల పరిధిలో ఇళ్లకు వెళ్లడం, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించడం వంటి చేపడతామన్నారు. పిల్లల చేరికలను ఖరారుచేసి అదేరోజు అడ్మిషన్ రిజిస్టర్‌లో నమోదు చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల పరిధిలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
ఫొటో :చంద్రంపాలెం అని ఉంటుంది
తరగతులకు రావడం లేదు,
పాఠాలు చెప్పడం లేదు
చంద్రంపాలెం పాఠశాలలో కొంతమంది ఉపాధ్యాయులపై విద్యా శాఖకు ఫిర్యాదులు
పద్ధతి మార్చుకోవాలంటూ డిప్యూటీ డీఈవో హెచ్చరిక
విశాఖపట్నం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో అత్యధిక విద్యార్థులున్న చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో కొంతమంది ఉపాధ్యాయులు సక్రమంగా తరగతులకు వెళ్లడం లేదని, పాఠాలు బోధించడం లేదని, లెసన్ ప్లాన్లు రాయడం లేదని, ఉపాధ్యాయులకు, హెచ్‌ఎంకు మధ్య సఖ్యత లేదని అందిన ఫిర్యాదులపై విద్యా శాఖ దృష్టిసారించింది. దీనిలో భాగంగా శుక్రవారం ఉప విద్యాశాఖాధికారి సోమేశ్వరరావు చంద్రంపాలెం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో సుమారు 3,500 మంది విద్యార్థులు, 130 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుడిగా ఎం.వెంకటరావు కొనసాగుతున్నారు. పాఠశాలల్లో నలుగైదుగురు టీచర్లపై చాలాకాలం నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. సంఘం పేరిట కొందరు తరగతులకు సరిగ్గా వెళ్లడం లేదని, పాఠశాల నిర్వహణలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం తల్లిదండ్రుల కమిటీ సభ్యుల పేరుతో డీఈవోకు, పాఠశాల ఆర్జేడీకి ఫిర్యాదులు వెళ్లాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు కూడా ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని విశాఖలోని ఆర్జేడీని ఆదేశించారు. ఫిర్యాదులపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావును ఆర్జేడీ ఆదేశించారు. ఆయన శుక్రవారం పాఠశాలకు వెళ్లి విచారణ నిర్వహించారు. అందరినీ గట్టిగా మందలించారు. లెసన్ ప్లాన్లు ఎందుకు రాయడం లేదని పలువురు టీచర్లను ప్రశ్నించారు. పద్ధతి మారకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం విచారణ కోసం మరికొందరితో కమిటీ వస్తోందని డిప్యూటీ డీఈవో చెప్పారు. ఈ విషయం ఆర్జేడీ విజయభాస్కర్ వద్ద ప్రస్తావించగా కమిషనర్ ఆదేశాల మేరకు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ డీఈవోను ఆదేశించామన్నారు. డిప్యూటీ డీఈవో విచారణ నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
వసతి గృహాల్లో
సీసీ కెమెరాలు
ప్రభుత్వ ఇనర్ణయం
విద్యార్థుల రక్షణతోపాటు వసతి గృహాలను
నిరంతరం పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుందని భావన
తొలుత జిల్లాలోని 23 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఏర్పాటు
బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులతో సంప్రతింపులు
విశాఖపట్నం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి):
సంక్షేమ వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. జిల్లాలో 23 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. ఆయా హాస్టళ్లలో రెండు వేల మందికిపైగా విద్యార్థులు ఉంటున్నారు. వారి రక్షణతోపాటు వసతి గృహాలను నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావించింది. ఆ ప్రక్రియ ప్రారంభించి వేగంగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బీఎస్‌ఎన్‌ఎల్‌తో అధికారులు సంప్రతింపులు జరిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల హాస్టళ్లలో బయట విద్యార్థులు ఉంటే గుర్తించడంతో పాటు విద్యార్థుల మధ్య గొడవలు, ఇతర సమస్యలను నివారించేందుకు అధికారులకు అవకాశం దక్కుతుంది. అదే సమయంలో మెస్ నిర్వహణ, రోజువారీ మెనూ అమలును జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. జిల్లాలోని 234 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించామని, కొద్దిరోజుల్లో పూర్తిచేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు తెలిపారు. అలాగే, రెండో దశలో బీసీ సంక్షేమ శాఖకు చెందిన 29 హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే అవకాశం ఉంది.
ఇండక్షన్ స్టవ్‌లు
వసతి గృహాలకు ఇండక్షన్ స్టవ్‌లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. యుద్ధం నేపథ్యంలో అనేకచోట్ల గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇండక్షన్ స్టవ్‌లను సమకూరిస్తే ఈ తరహా ఇబ్బందులకు చెక్ చెప్పడంతో గ్యాస్‌కు అయ్యే ఖర్చు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ ఖర్చు తగ్గించుకునేందుకు ఇప్పటికే అనేక వసతి గృహాలకు సోలార్ విద్యుత్ సదుపాయాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 23 సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు నెలకు 150 వరకు గ్యాస్ సిలిండర్లు అవసరమవుతుండగా, బీసీ సంక్షేమ వసతి గృహాలకు 350 నుంచి 400 వరకు అవసరమవుతున్నాయి. నెలకు వేలాది రూపాయలు గ్యాస్‌కు వెచ్చించాల్సి వస్తోంది. ఇండక్షన్ స్టవ్‌లు ఒక్కో హాస్టల్‌కు మంజూరుచేయడం వల్ల ఈ ఖర్చు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కొద్దిరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.