షెడ్డులోనే బడి
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:18 PM
మండలంలోని గొందిపాకలు పంచాయతీ తాడిపాలెం గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల షెడ్డు లోనే కొనసాగుతుండడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.
25 ఏళ్లుగా శాశ్వత భవనం లేని తాడిపాలెం ప్రాథమిక పాఠశాల
విద్యార్థులకు తప్పని అవస్థలు
కలగా మిగిలిన స్కూల్ భవన నిర్మాణం
చింతపల్లి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొందిపాకలు పంచాయతీ తాడిపాలెం గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల షెడ్డు లోనే కొనసాగుతుండడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం పాఠశాల భవనం నిర్మిస్తామని హడావిడి చేసింది. నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించడంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. అయితే బిల్లులు రాకపోవడంతో పునాదుల దశలోనే నిలిచిపోయాయి. దీంతో పాఠశాల భవనం నిర్మిస్తారని ఆశించిన విద్యార్థులకు నిరాశే మిగిలింది.
మండలంలోని గొందిపాకలు పంచాయతీ తాడిపాలెం గ్రామంలో 65 గిరిజన కుటుంబాలు నివాసముంటున్నాయి. గ్రామంలో 25 ఏళ్ల క్రితం గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు 22 మంది విద్యార్థినీ, విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలకు శాశ్వత భవనం అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు పదేళ్ల క్రితం పాకను నిర్మించారు. ఈ పాకలోనే విద్యార్థులు విద్యాభ్యాసం చేసేవారు. పాఠశాల నిర్వహణకు అనువైన భవనాలు గ్రామంలో లేవు. దీంతో పాకలోనే ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించే వారు. ఈ పాక పూర్తిగా శిథిలమైపోవడంతో నాలుగేళ్ల కిందట స్థానిక గిరిజనులు శ్రమదానంతో మరమ్మతులు చేశారు. పైకప్పుగా సిమెంటు రేకులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది కూడా శిథిలావస్థకు చేరుకుంది. వర్షాలు కురుస్తుండడంతో పూర్తిగా కారిపోతోంది. ఈ సమయంలో ఉపాధ్యాయుడు విద్యార్థులను గ్రామంలోని ఇళ్ల వరండాల్లో కూర్చోబెట్టి విద్యాబోధన చేస్తున్నారు.
పునాదులకే పరిమితమైన నూతన భవనం
గ్రామంలో శాశ్వత పాఠశాల భవనం నిర్మించేందుకు ఐదేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో పాఠశాలకు శాశ్వత భవనం అందుబాటులోకి వస్తుందని స్థానిక గిరిజనులు ఆశపడ్డారు. అయితే నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్ పునాదుల వరకు నిర్మించారు. ఈ పనులకు సంబంధించిన బిల్లులు విడుదల కాకపోవడంతో అర్థంతరంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఈ నిర్మాణం పునాదులతో దర్శనమిస్తున్నది. ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించి ఈ పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.