ప్రహరీగోడ లేక.. స్కూలు మూత
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:29 AM
గ్రామస్థాయి ప్రజాప్రతినిధి అనాలోచిత చర్యల వల్ల మూడేళ్ల నుంచి ఫౌండేషన్ స్కూలు మూతపడింది. ఇక్కడి తరగతులను మోడల్ ప్రైమరీ పాఠశాలలోకి తరలించగా, వసతి కొరత ఏర్పడింది. ఫౌండేషన్ స్కూలు భవనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
చెరువులో అభివృద్ధి పనులు చేస్తుండగా కూలిన గోడ
మోడల్ స్కూలులోకి ఫౌండేషన్ స్కూలు తరలింపు
సుదూరంలో ఉండడంతో పిల్లలను మాన్పించిన తల్లిదండ్రులు
మునగపాక, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): గ్రామస్థాయి ప్రజాప్రతినిధి అనాలోచిత చర్యల వల్ల మూడేళ్ల నుంచి ఫౌండేషన్ స్కూలు మూతపడింది. ఇక్కడి తరగతులను మోడల్ ప్రైమరీ పాఠశాలలోకి తరలించగా, వసతి కొరత ఏర్పడింది. ఫౌండేషన్ స్కూలు భవనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
మునగపాక సంతబయల ప్రాంతంలో ఫౌండేషన్ స్కూల్ వుంది. దీని పక్కనే చెరువు ఉంది. సుమారు మూడు సంవత్సరాల క్రితం చెరువులో అభివృద్ధి పనుల పేరుతో అప్పటి సర్పంచ్ దిమ్మల అప్పారావు చెరువులో మట్టి తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో ఫౌండేషన్ స్కూలు ప్రహరీ గోడ చెరువులోకి కూలిపోయింది. ఇందుకు కారకులైన సర్పంచ్.. ప్రహరీగోడ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టలేదు. పాఠశాల ఆవరణను ఆనుకొని చెరువు వుండడం, ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థుల రక్షణ దృష్ట్యా మండల విద్యా శాఖ అధికారులు ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులతోపాటు భవిత స్కూల్ విద్యార్థులను మోడల్ ప్రైమరీ స్కూల్‌కు తరలించారు. వీరికి రెండు గదులను కేటాయించడంతో మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు వసతి కొరత ఏర్పడింది. కాగా మోడల్ స్కూల్ సుదూరంలో వుండడంతో ఫౌండేషన్ స్కూల్‌లో చదివే పిల్లల్లో పలువురిని తల్లిదండ్రులు మాన్పించేశారు. దీంతో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. కాగా ఫౌండేషన్ స్కూలు ప్రహరీగోడ నిర్మాణంపై ఎంఈవో వేణుగోపాలరావును వివరణ కోరగా, ప్రహరీగోడ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఇటీవల మునగపాక వచ్చిన సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ పరిశీలించారని చెప్పారు.