Share News

పది వేల మందికి బడి పిలుపు

ABN , Publish Date - May 30 , 2026 | 11:43 PM

జిల్లాలో బడికి దూరంగా ఉన్న పది వేల మంది గిరిజన బాలల్ని విద్యాశాఖాధికారులు పాఠశాలల్లో చేర్పించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే తపనతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌ ప్రతి చిన్నారికి విద్యనందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఐదేళ్లు నిండిన బాలల్ని విధిగా పాఠశాలల్లో చేర్పించాలనే లక్ష్యంతో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో రంగంలోకి దిగిన జిల్లా విద్యాశాఖాధికారులు వేసవి సెలవుల్లో పాఠశాలల వారీగా ఐదేళ్లు నిండి విద్యకు దూరంగా ఉన్న వారిని గుర్తించారు. అనంతరం వారిని సమీపంలోని పాఠశాలల్లో చేర్పించడం వంటి చర్యలు చేపట్టారు. ఇందుకు జిల్లా విద్యాశాఖాధికారి రామకృష్ణారావు, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, ప్రత్యామ్నాయ విద్యా సమన్వయకర్త జె.కుర్మారావు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.

పది వేల మందికి బడి పిలుపు
పాతపాడేరులో చిన్నారుల్ని పాఠశాలలో చేర్పిస్తున్న కలెక్టర్‌ నిషాంతి(ఫైల్‌)

లక్ష్యానికి మించి బాలల్ని చేర్పించిన అధికారులు

ముందస్తుగా బడిఈడు పిల్లల గుర్తింపు

ఆ సమాచారంతో చిన్నారులను పాఠశాలల్లో చేర్పించిన టీచర్లు

రాష్ట్ర స్థాయిలో జిల్లా విద్యాశాఖ ముందంజ

అధికారులు, ఉపాధ్యాయులకు కలెక్టర్‌ నిషాంతి అభినందనలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని 11 మండలాల్లోని 77 స్కూల్‌ కాంప్లెక్స్‌ల పరిధిలోని ఐదేళ్లు నిండిన 8,313 మంది బాలలు బడికి దూరంగా ఉన్నారని జిల్లా విద్యాశాఖాధికారులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బడి పిలుస్తోంది కార్యక్రమానికి ముందస్తుగా సేకరించిన ఈ సమాచారం ఉపయోగపడింది. జిల్లా విద్యాశాఖాధికారులు గుర్తించిన బాలల వివరాలను సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులకు అందించారు. దీంతో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారిని తక్షణమే పాఠశాల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. దీంతో ఒకేసారి విద్యార్థులను గుర్తించి, పాఠశాలల్లో చేర్పించే ప్రక్రియలు పూర్తయ్యాయి. ఉపాధ్యాయులు చేపడుతున్న ప్రవేశాల ప్రక్రియలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌, ప్రత్యేకంగానూ విద్యాశాఖాధికారులు పర్యవేక్షిస్తుండడంతో సకాలంలో గుర్తించిన బాలలందర్నీ పాఠశాలల్లో చేర్పించే ప్రక్రియ పూర్తయిందని జిల్లా విద్యాశాఖ ప్రత్యామ్నాయ విద్యా సమన్వయకర్త కూర్మారావు అన్నారు. విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కారణంగా వాస్తవానికి జిల్లాలోని 8,313 మంది బాలలే బడికి దూరంగా ఉన్నారని భావించినప్పటికీ క్షేత్రస్థాయిలో చర్యలతో ఆ సంఖ్య 10,368కి పెరిగింది. దీంతో లక్ష్యానికి మించి బాలల్ని బడుల్లో చేర్పించిన విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయుల్ని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అభినందించారు.

Updated Date - May 30 , 2026 | 11:43 PM