కలెక్టరేట్ వద్ద స్కీం వర్కర్ల ఆందోళన
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:06 AM
తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లు శుక్రవారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, యాప్‌ల భారాన్ని తగ్గించాలన్న నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం మార్మోగింది. అంతకుముందు సీఐటీయూ పిలుపు మేరకు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వీవోఏలు, పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ఉదయం తొమ్మిది గంటల నుంచే కలెక్టరేట్‌కు చేరుకోవడం ప్రారంభించారు.
కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని నినాదాలు
లేబర్ కోడ్‌లు, స్మార్ట్ కిచెన్లు రద్దు చేయాలని డిమాండ్
బారికేడ్లు నెట్టివేస్తూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయేందుకు యత్నం
మహిళా కానిస్టేబుళ్లకు గాయాలు
అనకాపల్లి రూరల్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లు శుక్రవారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, యాప్‌ల భారాన్ని తగ్గించాలన్న నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం మార్మోగింది. అంతకుముందు సీఐటీయూ పిలుపు మేరకు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వీవోఏలు, పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ఉదయం తొమ్మిది గంటల నుంచే కలెక్టరేట్‌కు చేరుకోవడం ప్రారంభించారు. అనంతరం ఆందోళనకారులను ఉద్దేశించి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.నరసింగరావు మాట్లాడుతూ, స్కీం వర్కర్ల కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, మధ్యాహ్న భోజన పథకం కోసం ప్రతిపాదించిన స్మార్ట్ కిచెన్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు కదిలారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో బారికేడ్లు కొంతమంది మహిళా పోలీసుల కాళ్లపై పడడంతో వారు కిందపడిపోయి గాయపడ్డారు. వీరిని అనకాపల్లి పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్ చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. స్కీం వర్కర్ల ఆందోళన ఉధృతంగా మారుతుండడంతో డీఎస్పీ (ఎస్‌బీ) జీఆర్‌ఆర్ మోహన్‌రావు విషయాన్ని డీఆర్వో వై.సత్యనారాయణరావుకు తెలియపరిచారు. వెంటనే ఆయన (డీఆర్వో) వచ్చి స్కీం వర్కర్ల డిమాండ్‌లను ఆలకించారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇవ్వడంతో వారు ఆందోలన విరమించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు కోటేశ్వరరావు, రుత్తల శంకరరావు, శ్రీనివాసరావు, గంటా శ్రీరామ్, అంగన్‌వాడీ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగశేషు, ఆశా వర్కర్ల ప్రధాన కార్యదర్శి యు.సత్యవతి, వీఓఏల రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్.రూపాదేవి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి.వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.