మూడో విడత పల్లె పోరుకు షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:10 AM
జిల్లాలోని ఎనిమిది మండలాల్లో 214 గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు పదవులకు మూడో దశలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను విడుదల చేస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లోని చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లోని వి.మాడుగుల, గొలుగొండ, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఎనిమిది మండలాల్లో 214 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు
రేపటి నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ
27వ తేదీన అభ్యర్థుల తుది జాబితా విడుదల
డిసెంబరు 2న పోలింగ్, ఓట్ల లెక్కింపు
జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్
అనకాపల్లి, నవంబరు 19 (ఆంధ్రజోతి): జిల్లాలోని ఎనిమిది మండలాల్లో 214 గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు పదవులకు మూడో దశలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను విడుదల చేస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లోని చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లోని వి.మాడుగుల, గొలుగొండ, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మూడో విడత షెడ్యూల్‌కు సంబంధించి ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం... ఎనిమిది మండలాల్లోని 214 గ్రామపంచాయతీ సర్పంచ్ పదవులకు, 2,046 వార్డు పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 3,55,619 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రోపూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎంపిక చేసిన కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన, 25వ తేదీన తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్లు, 26న అప్పీళ్ల పరిష్కారం చేస్తారు. 27వ తేదీ సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు వుంది. అనంతరం ఏకగ్రీవం అయిన స్థానాలతోపాటు పోటీలో వున్న అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటిస్తారు. డిసెంబరు 2వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యులంతా ఏకగ్రీవం అయిన పంచాయతీల్లో ఈ నెల 27వ తేదీన (నామినేషన్ల ఉపసంహరణ అనంతరం) ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. సర్పంచ్, వార్డు పదవలుకు ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు పూర్త, ఫలితాలను ప్రకటించిన తరువాత ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. కాగా అనివార్య కారణాల వల్ల రెండో తేదీన పోలింగ్ జరగకపోయినా, వాయిదా పడినా.. ఆయా పంచాయతీల్లో మూడో తేదీన పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం తరువాత ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
రెండో దశకు ఊపందుకున్న నామినేషన్లు
(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్)
జిల్లాలో రెండో దశలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో రెండో రోజైన గురువారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ జోరందుకుంది. పాయకరావుపేట, ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల్లో 213 పంచాయతీ సర్పంచ్ పదవులు, 2,072 వార్డు పదవులకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మండలాల వారీగా పరిశీలిస్తే.. అచ్యుతాపురంలో సర్పంచ్ స్థానాలకు 59 మంది, వార్డులకు 267 మంది, రాంబిల్లి మండలంలో సర్పంచ్ స్థానాలకు 46, వార్డులకు 179 మంది, ఎలమంచిలి మండలంలో సర్పంచులకు 31 మంది, వార్డులకు 140 మంది నామినేషన్లు వేశారు. ఎస్.రాయవరం మండలంలో సర్పంచులకు 45 మంది, వార్డులకు 199 మంది, పాయకరావుపేట మండలంలో సర్పంచులకు 36, వార్డులకు 249, నక్కపల్లి మండలంలో సర్పంచులకు 48 మంది, వార్డులకు 284 మంది, కోటవురట్ల మండలంలో సర్పంచులకు 30 మంది, వార్డులకు 159 మంది, మునగపాక మండలంలో సర్పంచులకు 37, వార్డులకు 210 మంది నామినేషన్లు వేశారు.
జి.జగన్నాథపురం పంచాయతీ ఏకగ్రీవం
చోడవరం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జి.జగన్నాథపురం పంచాయతీ కూటమికి ఏకగ్రీవం కానున్నది. టీడీపీ నేత కొల్లి గంగాధర్ భార్య కొల్లి రమాదేవి పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇంకా అన్ని వార్డులు కూడా ఏకగ్రీవం కానున్నాయి. ఆయా పదవులకు ఒక్కొక్కరే పోటీలో వుండడంతో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం అయినట్టు అధికారులు ఈ నెల 21వ తేదీనఅధికారికంగా ప్రకటించనున్నారు. గత ఎన్నికల్లో కూడా ఈ పంచాయతీ ఏకగ్రీవం అయింది.
తొలి దశ నామినేషన్ల పరిశీలన పూర్తి
215 సర్పంచ్ స్థానాలకు 1,204,
2,140 వార్డులకు 6,515 నామినేషన్లు చెల్లుబాటు
అనకాపల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ బుధవారం అర్ధరాత్రి పూర్తయ్యింది. దీంతో సక్రమంగా వున్న నామినేషన్ల వివరాలను అధికారులు గురువారం విడుదల చేశారు. ఎనిమిది మండలాల్లో 215 సర్పంచ్ స్థానాలకు 1,204 మంది, 2,140 వార్డు స్థానాలకు 6,515 మంది నామినేషన్లు సక్రమంగా వున్నట్టు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత పోటీలో వున్న అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తారు. మండలాల వారీగా పరిశీలిస్తే...
అనకాపల్లి మండలంలో 30 సర్పంచ్ స్థానాలకు 216 మంది, 316 వార్డులకు 951 మంది, బుచ్చెయ్యపేటలో 35 సర్పంచ్ స్థానాలకు 176 మంది, 320 వార్డులకు 923 మంది, కశింకోటలో 27 సర్పంచ్ స్థానాలకు 148 మంది, 272 వార్డులకు 829 మంది, చోడవరంలో 32 సర్పంచ్ స్థానాలకు 176 మంది, 320 వార్డులకు 999 మంది, రావికమతం మండలంలో 28 సర్పంచ్ స్థానాలకు 116 మంది, 276 వార్డులకు 780 మంది, రోలుగుంటలో 24 సర్పంచ్ స్థానాలకు 114 మంది, 228 వార్డులకు 794 మంది, పరవాడలో 15 సర్పంచ్ స్థానాలకు 97 మంది, 164 వార్డులకు 503 మంది, సబ్బవరంలో 24 సర్పంచ్ స్థానాలకు 161 మంది, 244 వార్డులకు 736 మంది అభ్యర్థుల నామినేషన్లు సవ్యంగా వున్నట్టు అధికారులు వెల్లడించారు.