Share News

స్కానింగ్‌ సెంటర్ల స్కామ్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 01:17 AM

నిరుపేద గర్భిణులకు యాంటినేటల్‌ స్కానింగ్‌ను ఉచితంగా నిర్వహించాలన్న నిబంధనను నగర పరిధిలోని ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.

స్కానింగ్‌ సెంటర్ల స్కామ్‌

యాంటినేటల్‌ స్కానింగ్‌ ఐదు శాతం మందికి ఉచితంగా చేయాలని ప్రభుత్వ నిబంధన

దానిని పాటిస్తున్నట్టు అధికారులకు నిర్వాహకుల కాకిలెక్కలు

చూసీచూడనట్టు పోతున్న ఆరోగ్య శాఖ

ప్రజల్లో కొరవడిన అవగాహన

విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):

నిరుపేద గర్భిణులకు యాంటినేటల్‌ స్కానింగ్‌ను ఉచితంగా నిర్వహించాలన్న నిబంధనను నగర పరిధిలోని ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కానీ, కాగితాలపై మాత్రం లెక్కలు చూపించేస్తున్నారు. అధికారులు లోతుగా విచారిస్తే గానీ...అసలు బాగోతం బయటపడుతుంది.

గర్భం దాల్చిన తరువాత వివిధ రకాల పరీక్షలు, కొన్నిసార్లు స్కానింగ్‌ చేయించాల్సి ఉంటుంది. అందులో కీలకమైనది యాంటినేటల్‌ స్కానింగ్‌. స్కానింగ్‌ సెంటర్స్‌ ఐదు శాతం ఉచితంగా నిర్వహించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. అంటే, ఆయా కేంద్రాలు నిర్వహించే ప్రతి వంద స్కానింగ్స్‌లో ఐదింటిని నిరుపేదలకు ఉచితంగా చేయాలి. అయితే, అతికొద్దిచోట్ల మాత్రమే ఉచితంగా నిర్వహిస్తున్నారు. అనేకచోట్ల ఈ నిబంధనను పట్టించుకోవడం లేదు.

జిల్లాలో 370కుపైగా స్కానింగ్‌ సెంటర్లు ఉన్నాయి. ఒక్కొక్క కేంద్రంలో నెలకు 200 నుంచి వెయ్యికిపైగా యాంటినేటల్‌ స్కానింగ్స్‌ నిర్వహిస్తున్నారు. గడిచిన ఏడాది సుమారు 28 వేలు చేశారు. అందులో ఐదు శాతం అంటే సుమారు 1,400 ఉచితంగా నిర్వహించాల్సి ఉంది. ఉచితంగా పరీక్షలు చేయకుండానే జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు మాత్రం లెక్కలు చూపించేస్తున్నారు. గడిచిన ఏడాది 1,501 మందికి ఉచితంగా స్కానింగ్‌ చేసినట్టు స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకుల నుంచి డేటా అందింది. అంటే, ఐదు శాతం కంటే ఎక్కువ మందికి నిర్వహించినట్టు చూపించారు.

బీపీఎల్‌ కార్డుదారులై ఉండాలి

ఉచిత స్కానింగ్‌ దారిద్య్రరేఖకు దిగువున ఉన్న కుటంబాలకు చెందినవారికి మాత్రమే చేస్తారు. గర్భిణులు ఎన్‌టీఆర్‌ వైద్య సేవ కార్డును తీసుకుని ఆయా కేంద్రాలకు వెళ్లి ప్రభుత్వ నిబంధన ప్రకారం ఉచితంగా చేయాల్సిన కోటాలో స్కానింగ్‌ చేయాలని కోరాల్సి ఉంటుంది. ఆరోగ్య శాఖ అధికారులను సంప్రతించినా వారు స్కానింగ్‌ చేయించే ఏర్పాటు చేస్తారు. అయితే, ఈ ఉచిత స్కానింగ్‌ ఉందన్న విషయమే చాలామందికి తెలియదు. దీనిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు కృషి చేయాలి.

Updated Date - Feb 13 , 2026 | 01:17 AM