సేవలపై సంతృప్తి
ABN , Publish Date - Jan 13 , 2026 | 01:55 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కార్యాలయాల ద్వారా అందిస్తున్న సేవలపై జిల్లా ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు.
రాష్ట్రంలో నాలుగో స్థానంలో విశాఖపట్నం జిల్లా
ప్రభుత్వ పథకాలు, శాఖల పనితీరుపై వివిధ వర్గాలు, లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు
నాణ్యమైన విద్యుత్ సరఫరాలో విశాఖ టాప్
పిల్లలకు పౌష్టికాహారం, సచివాలయాల నిర్వహణలోను అగ్రస్థానం
పరిశ్రమల ఏర్పాటులో నంబర్‌వన్
రిజిస్ట్రేషన్ల సేవల్లో రెండో స్థానం
రేషన్ సరుకుల పంపిణీలోనూ...
గిరిజన, మైనారిటీ సంక్షేమంలో అట్టడుగున
విశాఖపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కార్యాలయాల ద్వారా అందిస్తున్న సేవలపై జిల్లా ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. ఈ విషయంలో విశాఖపట్నం జిల్లా రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. వివిధ పథకాలు, శాఖల పనితీరుపై ప్రభుత్వం వివిధ వర్గాలు, లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా జిల్లాల వారీగా మార్కులు, వాటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది. వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం అమరావతి నుంచి వర్చువల్‌గా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ముందు నిలిచిన జిల్లాల అధికారులు అభినందించి, వారిని ఆదర్శంగా తీసుకొని, మిగిలిన జిల్లాల అధికారులు కూడా ప్రజలు సంతృప్తి చెందేలా సేవలు అందించాలని సూచించారు. మొత్తం 26 జిల్లాల్లో మెరుగైన పనితీరు ప్రదర్శించిన ఐదు జిల్లాలను టాప్-5లో, సక్రమంగా పనిచేయని జిల్లాలను కింది నుంచి ఐదు స్థానాల్లో ప్రదర్శించారు.
- విశాఖపట్నం జిల్లా అనేక అంశాల్లో టాప్-5లో నిలిచింది. ముఖ్యంగా నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయం లేకుండా సరఫరా చేయడంలోను, ఓల్టేజీ సమస్య లేకుండా చూడడంలోను, సమస్యల పరిష్కారానికి సిబ్బందిని అందుబాటులో ఉంచడంలోను 70.3 శాతం సంతృప్తితో మొదటి స్థానంలో నిలిచింది.
- గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండడం, ప్రవర్తన వంటి అంశాల్లో 76.3 మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.
- మూడు నుంచి ఆరేళ్ల వయసు కలిగిన పిల్లలకు పౌష్టికాహారం అందించడం, అంగన్‌వాడీ కేంద్రాలను సకాలంలో తెరవడం, వారికి ఆటలు ఆడించడం వంటి అంశాల్లో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. అదే విధంగా గర్భిణులకు గుడ్లు, పాలు ఇవ్వడం వంటి అంశాల్లో టాప్-5 స్థానంలో నిలిచింది.
- రిజిస్ట్రేషన్ల శాఖ ఆన్‌లైన్ సేవలు అందించడం, స్లాట్ బుకింగ్, సిబ్బంది ప్రవర్తన వంటి అంశాలపై ప్రజాభిప్రాయం సేకరించగా విశాఖ జిల్లా 71.2 శాతం సంతృప్తితో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది.
- ప్రజలకు పెన్షన్లు సకాలంలో, అవినీతి లేకుండా, సిబ్బంది సత్ప్రవర్తనతో పంపిణీ చేయడంలో విశాఖ జిల్లా 91.9 శాతం సంతృప్తితో మూడో స్థానంలో నిలిచింది.
- ప్రతి నెలా రేషన్ సరకులను క్రమం తప్పకుండా ఇవ్వడం, నాణ్యమైన నిత్యవసరాలను ఇవ్వడంలో 80.3 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.
- మహిళలను వేధిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడం వంటి అంశంలో విశాఖపట్నానికి 68.2 మార్కులతో 5వ స్థానం లభించింది.
- రైతులకు విత్తనాలు పంపిణీ చేయడంలో 70.7 మార్కులతో నాలుగో స్థానంలో నిలిచింది.
- వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన విభాగంలోను 62.6 మార్కులతో రెండో స్థానంలో నిలిచింది.
- స్కూల్ ఎడ్యుకేషన్‌లో టీచర్లు సకాలంలో రావడం, పాఠాలన్నీ బోధించడం, భవనాల నిర్మాణం, విద్యార్థులకు అన్నీ అర్థమవుతున్నాయా? లేదా? అనే అంశాల్లో 84.2 మార్కులతో ఐదో స్థానంలో నిలిచింది. అదేవిధంగా కాలేజ్ ఎడ్యుకేషన్‌లో 77.4 మార్కులతో మూడో స్థానంలో ఉంది.
అయితే గిరిజన, మైనారిటీ సంక్షేమం విషయంలో అట్టడుగునున్న ఐదు జిల్లాల్లో ఒకటిగా చేరింది.
రాష్ట్ర స్థాయిలో...
రాష్ట్ర స్థాయి సమీక్షలో పరిశ్రమల ఏర్పాటులో 99 మార్కులతో విశాఖ జిల్లా మొదటి స్థానంలోను, సర్వీస్ సెక్టార్‌లో 77 మార్కులతో 21వ స్థానంలో, పనితీరు విషయంలో 18వ స్థానంలో, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిలో 17వ స్థానంలో నిలిచింది.
4వ స్థానంలో సింహాచలం దేవస్థానం
- భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించడం, ఆలయ పరిసరాల్లో అవసరమైన వసతుల కల్పన, రుచి, శుచితో కూడిన ప్రసాదం అందించడంలో సింహాచలం దేవస్థానం 70 శాతం మార్కులతో నాలుగో స్థానంలో నిలిచింది.
స్టీల్‌ప్లాంటును నిలబెట్టడమే లక్ష్యం: సీఎం
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ఆంధ్రుల సెంటిమెంట్ అని, దానిని కచ్చితంగా లాభాల బాటలోకి తీసుకువెళ్లి నిలబెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన సోమవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు విశాఖ జిల్లా గురించి మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు కేంద్రం ద్వారా రూ.12 వేల కోట్లు ఇప్పించి కాపాడుకున్నామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని త్వరలోనే జాతికి అంకితం చేస్తామన్నారు. గోదావరి పుష్కరాలు వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. గూగుల్ త్వరలోనే విశాఖలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేస్తుందన్నారు.