అధికారుల ప్రతిపాదనలకు ససేమిరా
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:21 AM
జీకే వీధి మండలం సీలేరులో నిర్మించనున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం హామీపై పార్వతీనగర్, బూసుకొండ, శాండికోరిలో సోమవారం నిర్వహించిన గ్రామసభలు అర్ధంతరంగా ముగిశాయి.
తొలుత మెగా కంపెనీలో ఉద్యోగం, ప్రాజెక్టు పూర్తయిన తరువాత జెన్‌కోలో అవకాశం ఇస్తామన్న అధికారులు
అంగీకరించని నిర్వాసితులు
నేరుగా జెన్‌కోలోనే ఇవ్వాలని డిమాండ్
లేనిపక్షంలో ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డుకుంటామని హెచ్చరిక
మూడు గ్రామాల్లో అర్ధంతరంగా ముగిసిన గ్రామసభలు
కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళతామని తహశీల్దార్ హామీ
సీలేరు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): జీకే వీధి మండలం సీలేరులో నిర్మించనున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం హామీపై పార్వతీనగర్, బూసుకొండ, శాండికోరిలో సోమవారం నిర్వహించిన గ్రామసభలు అర్ధంతరంగా ముగిశాయి. అధికారుల ప్రతిపాదనలకు నిర్వాసితులు అంగీకరించకపోవడంతో గ్రామసభలు సజావుగా సాగలేదు.
స్థానిక జెన్‌కో అధికారుల బృందం జీకే వీధి తహశీల్దార్ అన్నాజీరావుతో కలిసి ముందుగా పార్వతీనగర్‌లో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జెన్‌కో అధికారులు మాట్లాడుతూ నిర్వాసితుల కుటుంబంలో ఎవరికైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో వారి పేరు, విద్యార్హత వివరాలను ఒక అంగీకార పత్రంపై సంతకం చేసి ఇవ్వాలని కోరారు. ఈ ఉద్యోగం తొలుత మెగా కంపెనీ నిర్మాణ పనుల్లో కల్పిస్తామని, ప్రాజెక్టు పనులు పూర్తయిన తరువాత కాంట్రాక్టు ప్రాతిపదికన మాత్రమే ఉద్యోగం కల్పిస్తామని వారు తెలిపారు. దీనిని నిర్వాసితులు వ్యతిరేకించారు. ఉద్యోగ అవకాశం నేరుగా జెన్‌కోలోనే కల్పించాలని, లేనిపక్షంలో ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డుకుంటామని చెప్పి గ్రామసభను బహిష్కరించారు. అనంతరం బూసుకొండ గ్రామానికి వెళ్లిన అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తరువాతే పనులను ప్రారంభించాలని గ్రామసభను వ్యతిరేకించారు. అక్కడ నుంచి శాండికోరి గ్రామానికి అధికారులు వెళ్లగా అదే పరిస్థితి ఎదురైంది. గతంలో ఇంటికో ఉద్యోగం జెన్‌కోలో ఇస్తామని చెప్పి ఇప్పుడు మెగా కంపెనీలో చేరాలని చెప్పడం ఏమిటని, ఎటువంటి ఉద్యోగం ఇవ్వకుండా అంగీకార పత్రంపై సంతకాలు ఎందుకు పెట్టాలని తహశీల్దార్‌ను నిర్వాసితులు నిలదీశారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఇచ్చిన హామీలను పక్కాగా నెరవేర్చిన తరువాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని చెప్పి మూడు గ్రామాల నిర్వాసితులు గ్రామసభలను వ్యతిరేకించారు. నిర్వాసితులు సమన్వయం పాటించాలని, డిమాండ్లను శాంతియుతంగా అధికారులతో చర్చించాలని సీలేరు ఎస్‌ఐ ఎండీ యాసిన్ వారికి సూచించారు. అనంతరం తహశీల్దార్ అన్నాజీరావు మాట్లాడుతూ ఈ సమస్యను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. నిర్వాసితులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, ఏపీ జెన్‌కోలో ఉద్యోగ నియామకాలు చేపట్టేలా కృషి చేస్తామని చెప్పారు. ఆయన వెంట సీలేరు పంప్డ్ స్టోరేజీ ఎస్‌ఈ జాకీర్ హుస్సేన్, ఏడీఈ అప్పలనాయుడు, తదితరులు ఉన్నారు.