సందడిగా సంక్రాంతి
ABN , Publish Date - Jan 16 , 2026 | 10:52 PM
జిల్లాలో గురువారం సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. హిందువులు పెద్ద పండుగగా భావించే సంక్రాంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పెద్దలకు బట్టలు పెట్టడడం, వ్యవసాయ పరికరాలు, పశు సంపదకు పూజలు నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో వ్యవసాయ పరికరాలు,
పశు సంపదకు పూజలు
వెలవెలబోయిన పాడేరు
మూసివేసిన దుకాణాలు
పాడేరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. హిందువులు పెద్ద పండుగగా భావించే సంక్రాంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పెద్దలకు బట్టలు పెట్టడడం, వ్యవసాయ పరికరాలు, పశు సంపదకు పూజలు నిర్వహించారు. ఒక్కో ప్రాంతంలో తమ ఆచారాలకు అనుగుణంగా ఇళ్లల్లో, గ్రామ చావడిల్లోలనూ పూజలు చేశారు. ముఖ్యంగా పల్లెల్లోనూ సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. జిల్లా కేంద్రం పాడేరులో మాజీఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకులోయ ఎంపీ డాక్టర్ జి.తనూజరాణి, జనపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య, తదితరులు ఇళ్లలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలో గోపూజోత్సవం వైభవంగా జరిపారు.
వెలవెలబోయిన జిల్లా కేంద్రం
జిల్లా కేంద్రం పాడేరు గురు, శుక్రవారాలు వెలవెలబోయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనం గ్రామాలకు తరలివెళ్లడడంతో పాటు వర్తకులు సైతం తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో దుకాణాలు మూసేసి, జనం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రతి శుక్రవారం పాడేరు వారపు సంత, పీజీఆర్‌ఎస్ కార్యక్రమంతో కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయాలు సైతం జనంతో రద్దీగా ఉండేవి. కానీ ఈ శుక్రవారం పండుగ సెలవులతో కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయాలు బోసిపోయాయి.