మార్కెట్‌లో సంక్రాంతి సందడి
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:53 AM
అనకాపల్లి పట్టణానికి సంక్రాంతి శోభ సంతరించుకుంది. పండగకు అవసరమైన కిరాణా సరుకులు, ఇతర వస్తువులు, కొత్త దుస్తులు కొనుగోలు చేయడానికి స్థానికలతోపాటు చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు మంగళవారం పట్టణానికి వచ్చారు. దీంతో ప్రధాన రహదారులు జనం, వాహనాలతో రద్దీగా మారాయి.
కొనుగోలుదారులతో రద్దీగా అనకాపల్లి, నర్సీపట్నం రహదారులు
వస్త్ర దుకాణాలు, కిరాణా షాపులు కిటకిట
ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్య
అనకాపల్లి టౌన్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి పట్టణానికి సంక్రాంతి శోభ సంతరించుకుంది. పండగకు అవసరమైన కిరాణా సరుకులు, ఇతర వస్తువులు, కొత్త దుస్తులు కొనుగోలు చేయడానికి స్థానికలతోపాటు చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు మంగళవారం పట్టణానికి వచ్చారు. దీంతో ప్రధాన రహదారులు జనం, వాహనాలతో రద్దీగా మారాయి. తెలుగువారికి సంక్రాంతి పండుగ అత్యంత ప్రధానమైనది. దీంతో కొత్త బట్టలు ధరించడం ఆనవాయితీ. అలాగే కాలధర్మంచెందిన కుటుంబ పెద్దలకు దేవుని గదిలో పూజ చేసి కొత్త వస్త్రాలు సమర్పిస్తారు. దీంతో కుటుంబ సభ్యులందరికీ కొత్త దుస్తులు కొనుగోలు చేసేందుకు రెండు, మూడు రోజుల నుంచే పట్టణానికి వస్తున్నారు. వస్త్ర దుకాణాలతోపాటు కిరాణా కొట్లు, చెప్పుల దుకాణాల వద్ద ఎక్కువ రద్దీ నెలకొంది. కొన్ని ప్రముఖ వస్త్ర దుకాణాల్లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు పెట్టడంతో ఆయా షాపులకు కొనుగోలుదారులు ఎగబడ్డారు. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి దుకాణాలు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. గత ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో తులం బంగారం సుమారు రూ.90 వేలు వుంది. ఈ ఏడాది ఏకంగా రూ.1.7 లక్షలకు పెరిగింది. బంగారం, వెండి ధరలు ఏడాది కాలంలో దాదాపు రెట్టింపు కావడంతో కొనుగోలు చేయడానికి ప్రజలు ముందుకు రావడంలేదని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
నర్సీపట్నంలో...
నర్సీపట్నం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):సంక్రాంతి పండుగ షాపింగ్ కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలిరావడంతో నర్సీపట్నంలో ప్రధాన రహదారులు, షాపులు కిటకిటలాడుతున్నాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరైన సంక్రాంతి పండుగను సంపన్నులు, పేదలు అన్న తేడా లేకుండా అందరూ తమకు ఉన్నంతలో ఘనంగా చేసుకుంటారు. పండగ మూడు రోజులూ ఇంటిల్లపాదీ సంతోషంగా గడుపుతారు. కొత్త దుస్తులు, పిండివంటలకు అవసరమైన కిరాణా సామగ్రి కొనుగోలు కోసం ప్రజలు తరలిరావడంతో రోడ్లపై ట్రాఫిక్ పెరిగింది. వస్త్ర, ఫ్యాన్సీ, కిరాణా దుకాణాల్లో రద్దీ అధికంగా కనిపించింది. అబీద్ సెంటర్, బంగార్రాజు కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, పెదబొడ్డేపల్లి మదుం వరకు ట్రాఫిక్ పెరిగింది. తహసీల్దార్ కార్యాలయం నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ఫుట్‌పాత్‌పై వస్త్ర దుకాణాలు వెలశాయి. సబ్ కలెక్టర్ కార్యాలయం దాటిన తర్వాత శ్రీకన్య కూడలి వరకు రోడ్డు ఇరుకుగా వుండడం వల్ల ట్రాఫిక్ సమస్య అధికమైంది. షాపింగ్ పూర్తయిన తరువాత ఇళ్లకు వెళ్లే వారితో ఆర్టీసీ బస్టాండ్ రద్దీగా మారింది.