మార్కెట్లకు సంక్రాంతి కళ
ABN , Publish Date - Jan 10 , 2026 | 10:55 PM
జిల్లా కేంద్రం పాడేరులో సంక్రాంతి సందడి నెలకొంది. జిల్లాలోని అన్ని మండలాల నుంచి గిరిజనులు పాడేరు వచ్చి దుస్తులు, కిరాణా సరుకులు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తున్నారు.
పాడేరులో రద్దీగా వస్త్ర, కిరాణా దుకాణాలు
కిటకిటలాడిన ముంచంగిపుట్టు సంత
పాడేరురూరల్, జనవరి 10(ఆంధ్రజ్యోతి):
జిల్లా కేంద్రం పాడేరులో సంక్రాంతి సందడి నెలకొంది. జిల్లాలోని అన్ని మండలాల నుంచి గిరిజనులు పాడేరు వచ్చి దుస్తులు, కిరాణా సరుకులు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాడేరులోని అన్ని దుకాణాలు రద్దీగా మారాయి. అల్లూరి జిల్లాలో సంక్రాంతి పండుగను నెల రోజులు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పండగకు అవసరమయ్యే వస్తు సామగ్రి, నూతన వస్త్రాలు కొనుగోలుకు పాడేరు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలతో పాటు హుకుంపేట, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలకు చెందిన వారు పట్టణానికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. సెలవులకు స్వగ్రామాలకు వచ్చే పిల్లలను పాడేరుకు తీసుకువచ్చి వస్త్రాలు, పాదరక్షలు, బాలికలకు ఆభరణాలు కొనుగోలు చేస్తుండడంతో పాడేరు పట్టణంలోని షాపులు శనివారం రద్దీగా మారాయి.
ముంచంగిపుట్టు సంతలో..
ముంచంగిపుట్టులో శనివారం జరిగిన వారపు సంత పండగ శోభను సంతరించుకుంది. రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా సంతలో విపరీతమైన రద్దీ కనిపించింది. చుట్టుపక్కల గిరిజన గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలిరావడంతో సంత ప్రాంగణం కిటకిటలాడింది. పండుగకు కావలసిన సరుకులు, కొత్త దుస్తులు, పిండి వంటల సామగ్రి కొనుగోలు చేయడానికి గిరిజనులు ఆసక్తి చూపారు. వ్యాపార లావాదేవీలు జోరుగా సాగడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.