Share News

సంక్రాంతి రద్దీ

ABN , Publish Date - Jan 12 , 2026 | 01:07 AM

సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌లకు ప్రయాణికులు పోటెత్తారు.

సంక్రాంతి రద్దీ

ప్రయాణికులతో కిక్కిరిసిన రైళ్లు, బస్సులు

వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన జనం

విశాఖ నుంచి స్వగ్రామాలకు పయనం

ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ

జనరల్‌ కోచ్‌లను తలపించిన రిజర్వేషన్‌ బోగీలు

రైళ్లలో రద్దీ నియంత్రణకు అధికారుల పటిష్ట చర్యలు

రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. సంక్రాంతి సందర్భంగా వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలిరావడంతో ఆదివారం రైల్వేస్టేషన్‌, ద్వారకా కాంప్లెక్స్‌ జాతరను తలపించాయి. ఆర్టీసీ 322 ప్రత్యేక బస్సులు నడపగా, రైళ్లలోని రిజర్వేషన్‌ బోగీలు కూడా జనరల్‌ కోచ్‌లను తలపించాయి.


రైళ్లు కిటకిట

రత్నాచల్‌కు కొనసాగిన తాకిడి

విశాఖపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిశాయి. ఆదివారం విశాఖ రైల్వే స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫామ్‌లు కిటకిటలాడాయి. విజయవాడ, సికింద్రాబాద్‌, చెన్నై, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాల నుంచి విశాఖకు చేరిన ప్రయాణికులతోపాటు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో స్టేషన్‌లో జాతరను తలపించింది. రిజర్వేషన్‌ బెర్తులు, సీట్లు పొందినవారితోపాటు జనరల్‌ టికెట్లతో ప్రయాణించేందుకు బయలుదేరిన వారితో కోచ్‌లు కిక్కిరిసిపోయాయి. ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌, వందేభారత్‌ రైళ్లతోపాటు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, పాసింజర్‌ రైళ్లు రద్దీగా మారాయి.

రత్నాచల్‌కు భారీ తాకిడి

విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు (12717) ఆదివారం కూడా రద్దీ కొనసాగింది. అన్నవరం,సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, నూజివీడు, విజయవాడ వెళ్లాల్సిన ప్రయాణికులు ఈ రైలును ఆశ్రయించారు.

క్యూ పద్ధతిలో కోచ్‌లోకి

రద్దీని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తమైన జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు చేరిన వెంటనే ప్రయాణికుల కోచ్‌ల్లో ఎగబాకకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు. జనరల్‌ కోచ్‌ల వద్ద ప్రయాణికులను క్యూలో నిలబెట్టారు. విజయవాడ నుంచి వచ్చిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌కు చేరిన తర్వాత ప్రయాణికుంతా దిగిన తర్వాత క్యూలో ఉన్న వారికి బోగీల్లో ప్రవేశం కల్పించారు. దీంతో రైలు బయలుదేరే సమయానికి సుమారు రెండు గంటల ముందు స్టేషన్‌కు చేరుకున్నవారికి సీట్లు లభించాయి. జనరల్‌ కోచ్‌లకు సంబంధించి ఆర్పీఎఫ్‌, జీఆర్పీ సిబ్బంది పొరపాటుపడి రెండు కోచ్‌ల వద్ద క్యూ పద్ధతి పాటించకపోవడంతో కొందరు పరుగులు తీసి ప్రవేశించే సమయంలో తోపులాట జరిగింది.

జనరల్‌ కోచ్‌లను తలపించేలా...

ఇరత ప్రాంతాల నుంచి విశాఖకు చేరిన ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లతోపాటు విశాఖ నుంచి బయలుదేరిన గోదావరి, మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌, ఎల్‌టీటీ, జన్మభూమి, సింహాద్రి, మచిలీపట్నం, విశాఖ, కోణార్క్‌, ఫలక్‌నూమా రైళ్లలోని రిజర్వేషన్‌ కోచ్‌లు జనరల్‌ బోగీలను తలపించాయి. విశాఖ మీదుగా హౌరా, గువహటి వెళ్లే రైళ్లలో జనవర్‌ కోచ్‌లు మరింత రద్దీగా మారాయి.

బెర్తులన్నీ ఫుల్‌

పండుగ ప్రయాణికులతో ఆదివారం గోదావరి ఎక్స్‌ప్రెస్‌, విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గరీబ్‌రథ్‌, కోణార్క్‌, ఫలక్‌నూమా, ఎల్‌టీటీ, కోరమాండల్‌, మెయిల్‌, టాటా-ఎర్నాకులం, బొకారో వంటి ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి.

విశాఖ, విజయవాడ మధ్య జనసాధారణ్‌ ప్రత్యేక రైలు

ప్రయాణికుల వినతి మేరకు విశాఖ, విజయవాడ మధ్య జనసాధారణ్‌ (అన్ని జనరల్‌ కోచ్‌లతో) ప్రత్యేక రైలును ప్రవేశపెట్టామని రైల్వే అధికారులు తెలిపారు. 08567 నంబరు గల ప్రత్యేక జనసాధారణ్‌ రైలు ఈనెల 12, 13, 14, 16, 17, 18న ఉదయం 10 గంటలకు విశాఖలో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08568 నంబరు గల ప్రత్యేక రైలు ఈనెల 12, 13, 14, 16, 17, 18న సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలో బయలుదేరి అర్ధరాత్రి 12.35 గంటలకు విశాఖ చేరుతుంది.


322 ఆర్టీసీ స్పెషల్స్‌

పోటెత్తిన సంక్రాంతి ప్రయాణికులు

రద్దీగా మారిన ద్వారకా బస్‌స్టేషన్‌

వివిధ ప్రాంతాలకు 1.5 లక్షల మంది తరలింపు

స్టీల్‌సిటీ, సింహాచలం, మద్దిలపాలెం డిపోల నుంచి సంక్రాంతి ప్రత్యేక బస్సులు

ద్వారకాబస్‌స్టేషన్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌లకు ప్రయాణికులు పోటెత్తారు. కేవలం ఆదివారం ఒక్కరోజే సుమారు 1.5 లక్షల మందిని వారి వారి ప్రాంతాలకు చేర్చారు. ద్వారకాబస్‌స్టేషన్‌, మద్దిలపాలెం కాంప్లెక్సుల నుంచి 322 ప్రత్యేక బస్సులు నడిపారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న ప్రయాణికుల తాకిడి ఆర్టీసికి ఉదయ నుంచి ప్రారంభమయింది. ద్వారకాకాంప్లెక్సులోని అన్ని ప్లాట్‌ఫామ్స్‌ కిటకిటలాడాయి. నాన్‌స్టాప్‌ టికెట్‌ కౌంటర్ల ఎదుట బారులు తీరారు. గొలుసుకట్టుగా బస్సులు ఏర్పాటు చేసినా రద్దీ కొనసాగుతూనే ఉంది. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన అధికారులు సింహాచలం, మద్దిలపాలెం, స్టీల్‌సిటీ డిపోలనుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. దీంతో మధ్యాహ్నానికి ద్వారకాకాంప్లెక్సుకు ప్రయాణికుల తాకిడి కొంచెం తగ్గింది. ద్వారకాబస్‌స్టేషన్‌, మద్దిలపాలెంలో రాత్రి 9 గంటల వరకూ రద్దీ కొనసాగుతూను ఉంది.

హైదరాబాద్‌కు 8, విజయవాడకు 28, కాకినాడకు 10, రాజమండ్రికి 12, భీమవరానికి 4, రాజోలుకు 6, జోన్‌ పరిధిలోని శ్రీకాకుళానికి 60, సోంపేట, మందస, ఇచ్ఛాపురం, పాతపట్నం, టెక్కలి ప్రాంతాలకు 80 ప్రత్యేక సర్వీసులు నడిపారు. విజయనగరానికి 20, రాజాం 15, బొబ్బిలి 20, సాలూరు 25, పార్వతీపురం 22 ప్రత్యేక బస్సులు నడిచాయి. ద్వారకా కాంప్లెక్స్‌లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు రవాణా చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గ బస్సులు అందుబాటులో లేకపోవడంతో సిటీ బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నడిపారు. దీంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దొంగల హల్‌చల్‌

విశాఖపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి ప్రయాణికులతో తీవ్ర రద్దీ నెలకొన్న నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. బస్సు ఎక్కేందుకు ఒకరినొకరు నెట్టుకుండడంతో మహిళల మెడలోని ఆభరణాలను తస్కరిస్తున్నారు. ఆదివారం శ్రీకాకుళం వెళ్లేందుకు కళావతి అనే మహిళ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించగా, ఆమె మెడలోని రెండున్నర తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. మరో మహిళ మెడలోని ఆరు తులాల బంగారు ఆభరణాలను తస్కరించారంటూ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది.

Updated Date - Jan 12 , 2026 | 01:07 AM