Share News

ఆరోగ్య ప్రదాత సంజీవని

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:42 AM

ప్రజల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పిస్తూ అత్యాధునిక డిజిటల్‌ వైద్య సేవలను మారుమూల ప్రాంతాలకు చేరువ చేసేందుకు సంజీవని ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తున్నది.

ఆరోగ్య ప్రదాత సంజీవని
అరకులోయ మండలం సుంకరమెట్ట పీహెచ్‌సీ

పైలట్‌ ప్రాజెక్టుకు అరకులోయ మండలం సుంకరమెట్ట పీహెచ్‌సీ ఎంపిక

దీని ఫలితాల ఆధారంగా అన్నీ పీహెచ్‌సీల్లో అమలుకు నిర్ణయం

22న ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించే అవకాశం

మారుమూల గిరిజన గ్రామాలకు ఎంతో మేలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ప్రజల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పిస్తూ అత్యాధునిక డిజిటల్‌ వైద్య సేవలను మారుమూల ప్రాంతాలకు చేరువ చేసేందుకు సంజీవని ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగా కుప్పం ప్రాంతంలో సంజీవని(సాంకేతిక ఆధార ప్రజారోగ్య సేవా కార్యక్రమం) పైలట్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. అలాగే అల్లూరి జిల్లాలోని అరకులోయ మండలం సుంకరమెట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంజీవని పైలట్‌ ప్రాజెక్టుకు ఎంపిక చేసి, పీహెచ్‌సీ పరిధిలోని ప్రజల ఆరోగ్య సంబంధ సమాచారాన్ని డిజిటలైజేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల గిరిజనులకు సంజీవని ప్రాజెక్టు ద్వారా ఎంతో మేలు జరుగుతుందని వైద్య, ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు అమలు వలన ప్రతి గిరిజనుడి వైద్య సంబంధిత వివరాలు డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉండడం ద్వారా మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం కలుగుతుంది. అవసరాన్ని బట్టి ఎక్కడి నుంచైనా వైద్య నిపుణులు రోగులకు అవసరమైన సేవలు అందించే వెసులుబాటు ఉంటుంది. ఎటువంటి ప్రైవేటు, కార్పొరేట్‌ వైద్య సేవలు అందుబాటులో లేని గిరిజన ప్రాంతానికి పూర్తిగా సాంకేతికత ఆధారంగా వైద్య సేవలు అందించే సంజీవని ప్రాజెక్టు ఒక వరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అరకులోయ మండలం సుంకరమెట్ట పీహెచ్‌సీలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నందున ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రారంభోత్సవం చేయించాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 22న అరకులోయ మండలంలోనే సంజీవని ప్రాజెక్టును ప్రారంభిస్తారని అధికారులు అంటున్నారు. అయితే సీఎం పర్యటన పక్కాగా ఇంకా ఖరారు కాలేదు.

సంజీవని ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలు

- ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తారు.

- కృత్రిమ మేధ(ఏఐ) సహాయంతో ఆరోగ్య విశ్లేషణ చేస్తారు.

- మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల ద్వారా పల్లెల్లో వైద్య సేవలు అందిస్తారు.

- ప్రతి కుటుంబ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు.

- ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తారు.

- ప్రతి వ్యక్తికి సంబంధించి డిజిటల్‌ హెల్త్‌ రికార్డును రూపొందిస్తారు.

- రోగులు ఎక్కడ వైద్య సేవలు పొందినా వారికి సంబంధించిన రిపోర్టులు, ఇతర సమాచారాన్ని తక్షణమే ఎక్కడికక్కడ పొందే అవకాశం కలుగుతుంది.

- మారుమూల గిరిజన రోగులకు సంబంధించి నిపుణులైన వైద్యులతో టెలీమెడిసన్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, వైద్య నిపుణులను వీడియో ద్వారా సంప్రతించే అవకాశం కల్పిస్తారు.

- రోగుల స్థితిగతుల ఆధారంగా అవసరమైతే ఉన్నత ఆస్పత్రులకు తరలిస్తారు.

Updated Date - Aug 06 , 2026 | 12:42 AM