Share News

జూన్‌ నుంచి సంజీవని

ABN , Publish Date - May 04 , 2026 | 12:58 AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన, అత్యాధునిక వైద్య సేవలను అందించడంతోపాటు వ్యాధి వివరాలను డిజిట లైజ్‌ చేసే సరికొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

జూన్‌ నుంచి సంజీవని

  • జిల్లాలోని తొమ్మిది పీహెచ్‌సీలు, 66 యూపీహెచ్‌సీల్లో అమలుకు రంగం సిద్ధం

  • మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయం

  • రోగి పూర్తి ఆరోగ్య సమాచారం డిజటలైజేషన్‌

  • అభా ఐడీ ద్వారా ఎక్కడైనా తెలుసుకునే వీలు

  • రాష్ట్ర ప్రభుత్వం, టాటా డిజిటల్‌ నెర్వ్‌సెంటర్‌ (డింక్‌) సంయుక్త నిర్వహణ

విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి):

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన, అత్యాధునిక వైద్య సేవలను అందించడంతోపాటు వ్యాధి వివరాలను డిజిట లైజ్‌ చేసే సరికొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం, టాటా సంస్థ సంయుక్తంగా టాటా డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌ (డింక్‌) ద్వారా ఈ సేవలను అందించే సంజీవని ప్రొగ్రామ్‌ను అమలుచేయనుంది. తొలుత సీఎం చంద్రబాబునాయుడు సొంత నియోజకవ ర్గమైన కుప్పంలో దీనిని అమలుచేయగా, మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో జూన్‌ నుంచి రాష్ట్రమంతటా అమల్లో భాగంగా జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 66 అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ను ఎంపిక చేశారు. మెరుగైన సేవలందించేందుకు డీపీఎంవో, డీపీవో, ముగ్గురు మెడికల్‌ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చినట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు తెలిపారు.

ఆరోగ్య కేంద్రానికి రోగి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు వైద్య సేవలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఈ ప్రొగ్రామ్‌లో భాగంగా డిజిటలైజ్‌ చేస్తారు. ఇందు కోసం ప్రతి కేంద్రంలో పేషెంట్‌ కేర్‌ కో-ఆర్డినేటర్‌ (పీసీసీ) ను నియమించనున్నారు. ఇప్పటికే విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల్లో పనిచేస్తున్న మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను పీసీసీలుగా నియమించనున్నారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌లో స్టాఫ్‌ నర్సుల్లో ఒకరిని పీసీసీలుగా నియమిస్తారు. నియోజక వర్గస్థాయిలో ఆయా కేంద్రాలను పర్యవేక్షించేందుకు అనుగుణంగా పేషెంట్‌ కేర్‌ మేనేజర్‌ను నియమించ నున్నారు. వీరు ఆయా ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగి వివరాలను ఆన్‌లైన్‌ చేయడం, ఇంటికి వెళ్లిన తరువాత ఫాలోఅప్‌ బాధ్యతను తీసుకుంటారు. ఆస్పత్రికి వచ్చిన రోగికి అభా ఐడీ క్రియేట్‌ చేయడం, వివరాలను హెల్త్‌ ఎక్స్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయడం, రోగి సమస్యను బట్టి క్లినికల్‌, నాన్‌ క్లినికల్‌గా వర్గికరించి వైద్య సేవలు అందిం చడం, ఆస్పత్రిలో వైద్యుడు అందుబాటులో లేకుంటే వర్చువల్‌గా రాష్ట్రస్థాయిలో ఉన్న డింక్‌ సెంటర్‌ వైద్యుడితో మాట్లాడించడం, ఆరోగ్య శిబిరాలు, అపాయింట్‌మెంట్‌ వివరాలను రోగులకు అందిస్తారు.

డిజిటల్‌ విధానంలో సేవలు..

నూతన విధానంలో కాగిత రహితంగా సేవలుంటాయి. ఆన్‌లైన్‌లో రోగి వివరాలను నమోదు చేయడం వల్ల ఎక్కడికి వెళ్లినా అభా ఐడీ ఎంటర్‌ చేయగానే రోగికి సంబంధించిన పూర్తి సమాచారం లభిస్తుంది. మెడికల్‌ ఆఫీసర్‌ వద్దకు వెళ్లిన తరువాత ఆ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. అనంతరం అవసరమైతే పరీక్షలు చేయించి ఫలితాలను సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. డాక్టర్‌ సూచించిన మందులను అందించిన తరువాత ఆ వివరాలను డిజిటలైజ్‌ చేస్తారు. రోగి ఆస్పత్రి నుంచి వెళ్లే ముందు మరోసారి పీసీసీని కలిస్తే డాక్యుమెంట్లును స్కాన్‌చేసి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. రిఫరల్‌ ఉంటే వివరాలను రోగికి చెబుతారు.

వచ్చే నెల నుంచి అమలు

సంజీవని ప్రొగ్రామ్‌ను వచ్చే నెల నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి వెళే వరకు రోగులకు సహకరించేందుకు కో-ఆర్డినేటర్లు ఉంటారు. ప్రతి సమాచారాన్ని పీసీసీ కో-ఆర్డినేటర్లు డిజిటలైజ్‌ చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో రోగి ఎక్కడకు వెళ్లినా గత ఆరోగ్య సమాచారం తెలుస్తుంది. అభా ఐడీ ఎంటర్‌ చేయగానే వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఇది మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు దోహదపడుతుంది.

- డాక్టర్‌ పి.జగదీశ్వరరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి


టెన్త్‌లో 3,034 మంది ఫెయిల్‌

తెలుగులో అత్యధికంగా 1,844 మంది

ద్వితీయ భాషలో 30 మంది

సప్లిమెంటరీకి ప్రత్యేక తరగతులు

విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 3,034 మంది పరీక్ష తప్పారు. మొత్తం 28,928 మంది పరీక్షలకు హాజరుకాగా 25,894 మంది (89.51శాతం) ఉత్తీర్ణులయ్యారు. విచిత్రంగా ప్రథమభాషలో అత్యధికంగా 1,844 మంది పరీక్ష తప్పారు. సెకండ్‌ లాంగ్వేజ్‌లో కేవలం 30 మందే ఫెయిలయ్యారు. సైన్స్‌లో 1,671 మంది, గణితంలో 943 మంది, సోషల్‌ స్టడీస్‌లో 935 మంది, థర్డ్‌ లాంగ్వేజ్‌లో 943 మంది పరీక్ష తప్పారు. ఈ విద్యార్థులకు ఈనెల నాలుగోతేదీ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఫెయిలైన విద్యార్థులకు ఈనెల 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ప్రతి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు తరగతులు బోధించాలని విద్యాశాఖ ఆదేశించింది. తక్కువ మంది విద్యార్థులున్న చోట రెండు పాఠశాలలకు కలిపి ఒకచోట తరగతులు నిర్వహించనున్నారు. ఎక్కువమంది విద్యార్థులు పరీక్ష తప్పిన చంద్రంపాలెం, తోటగరువు, గాజువాక తదితర పాఠశాలల్లోనే తరగతులు జరుగుతాయి. వీరికి రెసిడెన్షియల్‌గా తరగతులు నిర్వహించాలని భావించినా, గ్యాస్‌ సిలిండర్ల కొరత అడ్డంకిగా మారింది. అంతేకాక ఆయా పాఠశాలల్లో టీచర్లంతా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వారికి వేసవిలో జీతాలు ఇవ్వరు. దీంతో విధులు దూరంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఉన్నత పాఠశాలల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

మాతృభాషలోనే డింకీ

జిల్లాలో మాతృభాష తెలుగును ఎక్కువమంది తీసుకుంటారు. కొంతమంది మాత్రమే హిందీ/ఒరియా/ఉర్దూ భాషలో చదువుతారు. జిల్లాలో ప్రథమభాష పరీక్ష తప్పిన విద్యార్థులు ఎక్కువమంది తెలుగు మాట్లాడేవారే. వీరంతా పరీక్ష తప్పడానికి పలు కారణాలున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ సారి ప్రశ్నపత్రంలో బిట్‌పేపరు లేదు. దానికి బదులు ఒక మార్కుకు వాక్య రూపంలో జవాబులు రాయాల్సి వచ్చింది. బిట్‌పేపరు అయితే ఆప్షన్స్‌ నాలుగింటిలో ఏదో ఒకటి ఎంపికచేసినా కొందరు ఉత్తీర్ణులయ్యేవారని గుర్తుచేస్తున్నారు. వాక్య రూపంలో జవాబులు రాయలేకపోవడంతో తప్పారని చెబుతున్నారు. చాలా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుచేసినా ఇంగ్లీష్‌పై పట్టు రావడం లేదు. సరికదా మాతృభాషపైనా అవగాహన కొరవడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


వసతిగృహాలకు మెరుగైన ర్యాంకులు

ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో బీసీ సంక్షేమశాఖ టాప్‌

ఐదో స్థానంలో సాంఘిక సంక్షేమశాఖ

విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వసతిగృహాలను మెరుగుపర్చే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలు మెరుగైన స్థానాలను దక్కించుకున్నాయి. జిల్లాలో బీసీ, సాంఘిక సంక్షేమశాఖకు చెందిన 52 వసతిగృహాలున్నాయి. ఆయా హాస్టల్స్‌లోని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ ద్వారా కీలకమైన అంశాలకు సంబంధించిన అభిప్రాయాలను ప్రతినెలా సేకరిస్తోంది. ఇందులో ప్రధానంగా హాస్టల్స్‌లో మెనూ ప్రకారం భోజనం పెడుతు న్నారా.? నాణ్యతగా ఉంటోందా.? వార్డెన్‌ అందుబాటులో, తాగునీరు అందుబాటులో ఉన్నాయా, టాయిలెట్‌ సదుపా యాలు ఉన్నాయా.? అన్న విషయాలపై అభిప్రాయాలను తీసుకుంటోంది. గత మూడు నెలలుగా ఈ సర్వే నిర్వహిస్తోంది. సర్వే ప్రారంభం నుంచి జిల్లా సంక్షేమశాఖ లు మెరుగైన ర్యాంకులో నిలచాయి. ఏప్రిల్‌లో నిర్వహించి న సర్వేలో బీసీ సంక్షేమశాఖ 86 శాతం పాయింట్లతో రాష్ట్రస్థాయిలో టాప్‌లో నిలిచింది. 80.3 శాతంతో సాంఘిక సంక్షేమశాఖ ఐదో స్థానంలో ఉంది.

లోపాలను సవరించుకుంటూ..

సర్వేలో తల్లిదండ్రుల అభిప్రాయాలను క్రోడీకరించి జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం వస్తోం ది. ఆయా అంశాలపై దృష్టి సారించి సవరించుకుంటూ ముందుకు వెళ్లేలా దిశా, నిర్దేశం చేస్తోంది. ఈ క్రమంలో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం, వార్డెన్లు అందుబాటులో ఉండడంతో సర్వేలో అనుకూల ఫలితాలు వస్తున్నాయి.

Updated Date - May 04 , 2026 | 12:58 AM