పడకేసిన పారిశుధ్యం
ABN , Publish Date - Jul 20 , 2026 | 01:03 AM
జిల్లాలో గ్రామ పంచాయతీలకు నిధుల కొరత ఏర్పడింది. గతంలో చేసిన వివిధ రకాల నిర్వహణ పనులకు సంబంధించిన బిల్లులు ఇంతవరకు మంజూరు కాకపోవడం, ఉన్న కొద్దిపాటి నిధులు పారిశుధ్య కార్మికులు, క్లాప్‌మిత్ర వేతనాలకే చాలకపోవడంతో పారిశుధ్య నిర్వహణ పనులకు ఆటంకం ఏర్పడుతున్నది. వర్షాకాలం అయినప్పటికీ ప్రస్తుతం వానలు అంతగా కురవకపోవడంతో పరిస్థితి తీవ్రంగా కనిపించడంలేదు. భారీ వర్షాలు కురిస్తే పారిశుధ్యం లోపించి ప్రజలు వ్యాధులబారిన పడే ప్రమాదం వుంది.
గ్రామాల్లో అధ్వాన పరిస్థితులు
నిధుల కొరతతో సతమతం
పేరుకుపోతున్న చెత్తాచెదారం
పూడిక తీతకు నోచుకోని డ్రైనేజీ కాలువలు
పంచాయతీల్లో కానరాని ప్రత్యేక అధికారులు
ఈగలు, దోమల బెడదతో రోగాలబారిన ప్రజలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో గ్రామ పంచాయతీలకు నిధుల కొరత ఏర్పడింది. గతంలో చేసిన వివిధ రకాల నిర్వహణ పనులకు సంబంధించిన బిల్లులు ఇంతవరకు మంజూరు కాకపోవడం, ఉన్న కొద్దిపాటి నిధులు పారిశుధ్య కార్మికులు, క్లాప్‌మిత్ర వేతనాలకే చాలకపోవడంతో పారిశుధ్య నిర్వహణ పనులకు ఆటంకం ఏర్పడుతున్నది. వర్షాకాలం అయినప్పటికీ ప్రస్తుతం వానలు అంతగా కురవకపోవడంతో పరిస్థితి తీవ్రంగా కనిపించడంలేదు. భారీ వర్షాలు కురిస్తే పారిశుధ్యం లోపించి ప్రజలు వ్యాధులబారిన పడే ప్రమాదం వుంది.
గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీతో ముగియడంతో ప్రభుత్వం వివిధ శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. సర్పంచులు తమ పదవీ కాలం ముగిసే సమయానికి పంచాయతీల్లో రోడ్లు, కాలువలు, ఇతరత్రా పనులకు ఖర్చు చేసి, ఎం.బుక్‌లో నమోదు చేశారు. వాటికి సంబంధించిన బిల్లుల కోసం ఆయా పనులు చేసిన కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో దాదాపు అన్ని పంచాయతీల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. అందుబాటులో ఉన్న కొద్దిపాటి నిధులు పారిశుధ్య కార్మికులు, క్లాప్‌మిత్రల వేతనాలకే చాలడం లేదు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం అందించే 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో జాప్యం జరగడంతో గ్రామాల్లో పారిశుధ్యం పనుల నిర్వహణ, విద్యుత్తు బిల్లుల చెల్లింపు భారంగా మారింది. ఒకవేళ ఆర్థిక సంఘం నిధులు రూ.9 కోట్లు విడుదలైనా, అవి గతంలో చేసిన పనుల బిల్లుల చెల్లింపులకే చాలవని అంటున్నారు.
పడకేసిన ‘ప్రత్యేక పాలన’
గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియడంతో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే వరకు గ్రామాల్లో పాలన కుంటుపడకుండా వుండేందుకు.. ప్రధానంగా పారిశుధ్య పనులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. గ్రామాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తినా ప్రత్యేకాధికారులదే బాధ్యత. కానీ అత్యధిక శాతం మంది తమకు కేటాయించిన పంచాయతీలకు చుట్టంచూపుగా వచ్చిపోతున్నారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో తప్ప ప్రత్యేక అధికారులు మరెన్నడూ కనిపించడంలేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనికితోడు నిధుల కొరత కారణంగా మేజర్ పంచాయతీల్లో మినహా మిగిలిన చాలా పంచాయతీల్లో పారిశుధ్యం పడకేసింది. పారిశుధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడార్‌లకు కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. డీజిల్‌కు డబ్బులు లేకపోవడంతో చెత్త సేకరించే ట్రాక్టర్లు, ఆటోలు వీధుల్లో కనిపించడంలేదు. డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయడంలేదు. అడపాదడపా పడుతున్న వర్షాలతో మురుగు కాలువలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. కొన్నిచోట్ల చెత్త డ్రైనేజీ కాలువల నుంచి చెత్తాచెదారం బయటకు తీసి, రోజుల తరబడి అక్కడే వదిలేస్తున్నారు. వీధుల్లో సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తరలించకుండా గ్రామాలకు శివార్లలో రోడ్డు పక్కన పారబోసి, నిప్పు పెడుతున్నారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు కాలిన పొగ నివాసాలపైకి రావడంతో ఊపిరాడక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
దోమలు, ఈగల బెడద
గ్రామాల్లో చెత్తాచెత్తారం రోజూ తొలగించకపోవడం, డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయపోవడం, బ్లీచింగ్ చల్లకపోవడం, దోమల నివారణ మందును పిచికారీ చేయకపోవడంతో దోమలు, ఈగల బెడద విపరీతంగా పెరిగిపోయింది. ఆహార పదార్థాలపై ఈగలు వాలడంతో వాటిని తిన్న వారు టైఫాయిడ్ జ్వరం బారిన పడుతున్నారు. మరికొందరు వాంతులు, విరేచనాలతో అతిసారకు గురవుతున్నారు. ఇక దోమల కారణంగా మలేరియా, డెంగీ జ్వరాలబారిన పడుతున్నారు. జిల్లా, డివిజనల్, మండల పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని, లేకపోతే సమస్య మరింత తీవ్రతరం అవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.