హాస్టళ్లలో మరుగు సమస్య
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:26 AM
జిల్లాలో వెనుకబడిన తరగతులు (బీసీ), సాంఘిక సంక్షేమ (ఎస్సీ) శాఖల వసతిగృహాల్లో మరుగుదొడ్ల మరమ్మతులు, కొత్తవాటి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమై వారం అయినప్పటికీ పలు వసతిగృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వసతిగృహాల్లోమౌలిక వసతులు కల్పించేందుకు నిధులు కేటాయించినప్పటికీ పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బీసీ, ఎస్సీ వసతిగృహాల్లో మందకొడిగా మరుగుదొడ్ల నిర్మాణం
వేసవి సెలవులకు ముందే రూ.3.39 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
ఇంతవరకు సగం కూడా పూర్తికాని వైనం
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో వెనుకబడిన తరగతులు (బీసీ), సాంఘిక సంక్షేమ (ఎస్సీ) శాఖల వసతిగృహాల్లో మరుగుదొడ్ల మరమ్మతులు, కొత్తవాటి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమై వారం అయినప్పటికీ పలు వసతిగృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వసతిగృహాల్లోమౌలిక వసతులు కల్పించేందుకు నిధులు కేటాయించినప్పటికీ పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 68 బీసీ, ఎస్సీ వసతిగృహాల్లో పారిశుధ్య సమస్యలను పరిష్కరించేందుకు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3.39 కోట్లు మంజూరు చేసింది. గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య విభాగం ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచేనాటికి వసతిగృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో వేసవి సెలవులకు ముందే పనులు ప్రారంభించారు. కానీ తీవ్ర జాప్యం కారణంగా కనీసం సగం పనులు కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంది. ఎస్సీ వసతిగృహాల్లో 47 పనులకుగాను ఏడు మాత్రమే పూర్తయ్యాయి. ఎనిమిది వసతిగృహాల్లో అసలు పనులే మొదలుపెట్టలేదు. గొలుగొండ, రావికమతం మండలం కొత్తకోట, నాతవరం మండలం నాతవరం, చెమ్మచింత, సబ్బవరం, చోడవరంలోని వసతిగృహాల్లో పనులు కొనసాగుతున్నాయి. బీసీ వసతిగృహాల్లో కొన్నిచోట్ల పనులు సగానికిపైగా పూర్తికాగా, మరికొన్నిచోట్ల చివరి దశలో ఉన్నాయి. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, నిర్మాణ సామగ్రి సరఫరాలో జాప్యం, చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాలతో పనులు ఆలస్యమవుతున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వసతిగృహాల్లో కొత్త మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాకపోవడం, ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లు చాలకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పూట కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్ల వద్ద క్యూ కట్టాల్సి వస్తున్నదని విద్యార్థులు వాపోతున్నారు. ముఖ్యంగా బాలికల వసతిగృహాల్లో ఈ సమస్య మరింత అధికంగా వుంది. వేళకు కాలకృత్యాలు తీర్చుకోకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం వుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వసతిగృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తికాకపోవడంపై ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ జె.అనిల్‌కుమార్‌ను వివరణ కోరగా.. పనుల్లో కొంతమేర జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, ఇప్పుడిప్పుడే వేగం పుంజుకున్నాయని తెలిపారు. ఈ నెలాఖరులోగా పనులన్నీ పూర్తిచేసి మరుగుదొడ్లను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.