Share News

‘పేట’లో పారిశుధ్యం అధ్వానం

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:19 AM

నియోజకవర్గ కేంద్రం పాయకరావుపేటలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. రహదారుల పక్కన చెత్త కుప్పలు పేరుకుపోవడం, డ్రైనేజీలు పూడుకుపోవడంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు విజృంభిస్తున్నాయి.

‘పేట’లో పారిశుధ్యం అధ్వానం
రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త

ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త కుప్పలు

పూడుకుపోయిన డ్రైనేజీలు

పట్టించుకోని అధికారులు

పాయకరావుపేట, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ కేంద్రం పాయకరావుపేటలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. రహదారుల పక్కన చెత్త కుప్పలు పేరుకుపోవడం, డ్రైనేజీలు పూడుకుపోవడంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు విజృంభిస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుమారు 30 వేల జనాభా ఉన్న పాయకరావుపేట మేజరు పంచాయతీలో రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. పట్టణంలో తాండవ వంతెన నుంచి మంగవరంరోడ్డు వరకు ఇరువైపులా ఉన్న నివాస ప్రాంతాలతో పాటు పట్టణంలో బృందావనం, గారావారిబీడు, ప్రశాంతినగర్‌, షీలానగర్‌, సాయినగర్‌, రాజుగారిబీడు తదితర ప్రాంతాల్లోని డ్రైనేజీలను రోజుల తరబడి శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు నిలిచిపోయింది. దీంతో దుర్వాసనతో పాటు దోమలు వృద్ధి చెంది స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే పారిశుధ్య సిబ్బంది చెత్తను తరలించకపోవడంతో రోడ్డు పక్కన చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. కాగా పట్టణంలో రైలు పట్టాల అవతల ఉన్న లింగాలతోటకాలనీ, ఇందిరాకాలనీ, దుర్గానగర్‌, అంబేడ్కర్‌కాలనీ, దుర్గాకాలనీ, రాజీవ్‌నగర్‌, తదితర ప్రాంతాల్లో పలు చోట్ల డ్రైనేజీలు ఉన్నా సరైన అవుట్‌లెట్లు లేకపోవడంతో ఎక్కడికక్కడ మురికినీరు నిలిచిపోతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పారిశుధ్య పరిస్థితి దారుణంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పట్టణంలో పారిశుధ్య సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Sep 06 , 2026 | 12:19 AM