Share News

ఇసుకాసురుల దందా

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:51 AM

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని కొందరు అభాసుబాలు చేస్తున్నారు.

ఇసుకాసురుల దందా

అనుమతులు లేకుండా నదుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు

స్థానిక నేతల సహాయ సహకారాలు

పట్టించుకోని గనుల శాఖ అధికారులు

ప్రభుత్వ ఇసుక డిపోలు నిర్వీర్యం

అమ్మకాలు లేక నిర్వాహకులు డీలా

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని కొందరు అభాసుబాలు చేస్తున్నారు. ఇసుక నిల్వ, అమ్మకాలకు డిపోలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని పర్యవేక్షించాల్సిన గనులు, రెవెన్యూ శాఖల అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇసుక అక్రమార్కులు దర్జాగా వ్యాపారం సాగిస్తున్నారు.

జిల్లాలోని నదుల్లో తగినంత ఇసుక నిల్వలు లేవన్న పర్యావరణ శాఖ నివేదికల ప్రకారం కూటమి ప్రభుత్వం 2024 జూలై 8వ తేదీన జిల్లాలోని అనకాపల్లి, నక్కపల్లి, అచ్యుతాపురం, చోడవరం, సబ్బవరం, మాడుగులలో ఇసుక డిపోలను టెండర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. గత వైసీపీ హయాంలో నర్సీపట్నం మండలం గబ్బాడ ఇసుక డిపోలో అక్రమాలు చోటు చేసుకోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆ డిపోను సీజ్‌ చేశారు. దీంతో నర్సీపట్నం మినహా మిగిలిన చోట్ల ఇసుక డిపోలను తెరచి అటు రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది నుంచి, ఇటు శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదుల నుంచి ఇసుకను తీసుకొచ్చి డిపోల్లో విక్రయాలు చేపట్టారు. ఆరంభంలో రోజూ 20 వేల టన్నుల ఇసుక అమ్ముడుపోయేది. అయితే ఉచిత ఇసుక విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన గనుల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం, మరోవైపు స్థానిక నేతలు తెర వెనుక ఉండి ఇసుక అక్రమార్కులకు సహకారం అందిస్తుండడంతో ఎక్కడికక్కడ నదుల్లో ఇసుక దోపిడీ మొదలైంది. సొంత అవసరాల కోసం సమీపంలోని నదుల్లో నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును అడ్డంపెట్టుకొని, ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వకాలు జరుపుతూ దర్జాగా అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారు. ప్రధానంగా శారదా, వరహా, పెద్దేరు, తాండవ నదుల్లో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక డిపోలు వెలవెలబోతున్నాయి. స్థానికంగా వుండే కూటమి పార్టీలకు చెందిన కొంతమంది నేతలు, ఇసుక అక్రమార్కులకు దన్నుగా నిలుస్తూ, ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఇక బహుళ అంతస్థుల భవనాలు, పరిశ్రమలు నిర్మాణం, ప్రభుత్వ పనులకు పెద్ద మొత్తంలో ఇసుక అవసరమైన వారు నేరుగా రాజమహేంద్రవరం లేదా శ్రీకాకుళం నుంచి ఇసుకను రప్పిస్తున్నారు. దీంతో టెండర్ల ద్వారా ఇసుక డిపోలను దక్కించుకొన్న వ్యాపారులు కొనుగోళ్లు లేక లబోదిబోమంటున్నారు. అనకాపల్లి, చోడవరం, మాడుగుల ఇసుక డిపోల్లో ఆరు నెలల నుంచి ఇసుక కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. నక్కపల్లి, అచ్యుతాపురం డిపోల నుంచి ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుకను తీసుకెళుతున్నారు. గనుల శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి, జిల్లాలోని నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడిచేయాలని, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Feb 24 , 2026 | 01:51 AM