ఇసుక దోపిడీ
ABN , Publish Date - May 11 , 2026 | 12:42 AM
కోటవురట్ల, ఎస్.రాయవరం మండలాల సరిహద్దులోని ఇందేశమ్మ ఘాట్ వద్ద వరహా నదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రెండు మండలాలకు సరిహద్దులో ఉండడంతో అధికారులు ఎవరికి వారు తమ పరిధి కాదంటూ పట్టించుకోవడం లేదు.
ఇందేశమ్మ వాక వద్ద వరహా నదిలో తవ్వకాలు
ట్రాక్టర్లతో చుట్టుపక్కల ప్రాంతాలకు రవాణా
రెండు మండలాల సరిహద్దు కావడంతో పట్టించుకోని అధికారులు
నర్సీపట్నం, మే 10 (ఆంధ్రజ్యోతి): కోటవురట్ల, ఎస్.రాయవరం మండలాల సరిహద్దులోని ఇందేశమ్మ ఘాట్ వద్ద వరహా నదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రెండు మండలాలకు సరిహద్దులో ఉండడంతో అధికారులు ఎవరికి వారు తమ పరిధి కాదంటూ పట్టించుకోవడం లేదు. దీంతో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. వర్షా కాలంలో వరద ప్రవాహానికి నది మధ్యలో పెద్ద మొత్తంలో ఇసుక మేటలు వేసింది. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం నామమాత్రంగా వుండడంతో ఇసుక అక్రమ వ్యాపారులు ఇసుక మేటల వరకు ట్రాక్టర్లు వెళ్లేలా రహదారి వేశారు. ఇక్కడ నాణ్యమైన ఇసుక వుండడంతో ఎక్కువ ధర లభిస్తున్నది. రాత్రిపూట ఎక్స్‌కవేటర్‌తో ఇసుకను ట్రాక్టర్లలోకి లోడింగ్ చేసి, నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. మరోవైపు టైరు బండ్ల యజమానుల నదిలో ఇసుక తవ్వి, తీరానికి చేర్చి కుప్పలుగా పోస్తున్నారు. దళారులు వీరి నుంచి ఇసుక కొనుగోలు చేసి ట్రాక్టర్ల ద్వారా తరలించి అమ్ముకుంటున్నారు. మరికొంతమంది టైరు బండ్ల యజమానులు చుట్టుపక్కల గ్రామాలకు ఇసుక సరఫరా చేస్తున్నారు. బండితో ఇసుక రూ.1,000కి విక్రయిస్తున్నారు.