గోస్తనిలో ఇసుక దోపిడీ
ABN , Publish Date - Aug 11 , 2026 | 01:19 AM
గోస్తని నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం నదిలో పెద్దగా నీరు లేదు. దీంతో పద్మనాభం మండలం కృష్ణాపురం, మద్ది, పొట్నూరు, తదితర పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో వైసీపీ నేతలు దగ్గరుండి తవ్వకాలు నిర్వహిస్తున్నారు. వారికి కూటమి నాయకులు సహకరిస్తున్నారు.
పద్మనాభం మండలం కృష్ణాపురం,
మద్ది, పొట్నూరు పంచాయతీల పరిధిలో
యథేచ్ఛగా తవ్వకాలు
సమీప ప్రాంతాల్లో నిల్వ
సొంత అవసరాల పేరిట భారీ వ్యాపారం
ట్రాక్టర్ ఇసుక రూ.2,500కు విక్రయం
వైసీపీ నేతల దందాకు కూటమి నేతలు అండదండలు
రెవెన్యూ, గనులు, పోలీసులు ప్రేక్షక పాత్ర
విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి):
గోస్తని నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం నదిలో పెద్దగా నీరు లేదు. దీంతో పద్మనాభం మండలం కృష్ణాపురం, మద్ది, పొట్నూరు, తదితర పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో వైసీపీ నేతలు దగ్గరుండి తవ్వకాలు నిర్వహిస్తున్నారు. వారికి కూటమి నాయకులు సహకరిస్తున్నారు.
రాష్ట్ర స్థాయిలో థర్డ్ ఆర్డర్ రీచ్‌లు (పెద్ద నదులు) ఉన్న జాబితాలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా లేదు. అంటే ప్రభుత్వ అనుమతితో రీచ్‌లు ఏర్పాటుచేసుకుని యంత్రాలతో తవ్వుకునేందుకు అనుమతి లేదు. అయితే సొంత అవసరాల నిమిత్తం యంత్రాలు లేకుండా తవ్వుకుని ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా పరిమితంగా రవాణా చేసుకునే వెసులుబాటు ఉంది. అందుకు ఇంటి ప్లాన్ సమర్పించి పంచాయతీ నుంచి అనుమతి తీసుకోవాలి. అంతే తప్ప యంత్రాలతో తవ్వి అమ్మకాలు చేయకూడదు. అయితే కృష్ణాపురం, మద్ది, పొట్నూరు పంచాయతీల పరిధిలో నదిలో యంత్రాలతో ఇసుక తవ్వి సమీపంలోని తోటలు, పొలాల్లో నిల్వ చేస్తున్నారు. అక్కడ నుంచి పద్మనాభం, ఆనందపురం మండలాల్లో నిర్మాణదారులకు ట్రాక్టర్ రూ.2,500 వంతున విక్రయిస్తున్నారు. వైసీపీకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి (కృష్ణాపురం), మండల స్థాయి నేత (మద్ది), పొట్నూరుకు చెందిన కొందరు కూటమి నేతలు కలిసి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేతల అక్రమాలకు పద్మనాభం మండలంలో కూటమి నేత ఒకరు వత్తాసు పలుకుతున్నట్టు చెబుతున్నారు. నదిలో ఇసుక తవ్వకాల వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాటి వల్ల తమ పొలాలకు నీరు రావడం లేదని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై కొందరు కోర్టులో కేసులు వేసినా రెవెన్యూ, గనుల, పోలీస్ శాఖ అధికారుల నుంచి స్పందన లేదనే వాదన ఉంది. ఇసుక తవ్వకందారుల నుంచి ఆయా శాఖలకు చెందిన పలువురికి ప్రతి నెలా మామూళ్లు అందుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అనుమతి లేకుండా పొలాలు, తోటల్లో నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేయాలని కోరుతున్నారు.