Share News

సందిగ్ధంలో ఇసుక డిపోలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:15 AM

ప్రభుత్వ అనుమతిలో నగరంలో మూడు చోట్ల ఏర్పాటు చేసిన ఇసుకడిపోల నిర్వహణ భారంగా మారుతోందని నిర్వాహకులు వాపోతున్నారు.

సందిగ్ధంలో ఇసుక డిపోలు

భారంగా మారుతున్న నిర్వహణ

రీచ్‌ల నుంచి నేరుగా చేరవేస్తున్న ప్రైవేటు ఆపరేటర్లు

డిపోల కంటే తక్కువ ధరకే అందుతున్న ఇసుక

నష్టాలు వస్తున్నాయంటున్న లీజుదారులు

విశాఖపట్నం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ అనుమతిలో నగరంలో మూడు చోట్ల ఏర్పాటు చేసిన ఇసుకడిపోల నిర్వహణ భారంగా మారుతోందని నిర్వాహకులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వాటి మనుగడపై సందిగ్ధత నెలకొంది. నగరంలో నిర్మాణాలకు అవసరమైన ఇసుక తక్కువ ధరకు అందించాలన్న ఉద్దేశంతో నెలకొల్పిన డిపోల్లో అమ్మకాలు వెలవెలబోతున్నాయి. నిర్వహణ భారంగా మారడంతో ఏంచేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రీచ్‌లలో నామమాత్రంగా (జీఎస్టీ చార్జీలు తీసుకుని) పంపిణీ ప్రారంభించింది. గత ప్రభుత్వంలో నగరంలో టన్ను ఇసుక రూ.1,500 నుంచి రూ. 1,800 ధర పలికేది. ఆ ధరలు బాగా తగ్గించి ఇసుక సామాన్యులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు సరఫరాకు వీలుగా గాజువాక, ముడసర్లోవ, భీమిలిలో ప్రైవేటు వ్యక్తులకు డిపోల ఏర్పాటు బాధ్యత అప్పగించింది. నగరానికి ఆనుకుని పెద్ద నదులు లేకపోవడంతో ఇక్కడ నిర్మాణదారుల అవసరాలకు అనుగుణంగా ఈ డిపోలు ఏర్పాటుచేశారు. ఇందుకోసం స్థలాలను లీజుకు తీసుకున్నారు. గోదావరి నుంచి గాజువాక డిపో, నాగావళి, వంశధార నుంచి ముడసర్లోవ, భీమిలి డిపోలకు ఇసుక సరఫరా జరుగుతోంది. గాజువాకలో టన్ను రూ.1,000, ముడసర్లోవలో రూ.730, భీమిలిలో రూ.700గా ధర నిర్ణయించారు.

రీచ్‌ల నుంచే నేరుగా....

డిపోల నుంచి సంబంధిత నిర్మాణదారుల ఇంటికి చేరేసరికి గాజువాక ప్రాంతంలోటస్ను రూ.1300, నగరంలో రూ.1000 ఖర్చవుతోంది. అయితే రీచ్‌ల వద్ద ఇసుక రవాణాకు ఆంక్షలు లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు నగరానికి తీసుకువచ్చి నేరుగా సరఫరా చేస్తున్నారు. డిపోల్లో కన్నా వీరి వద్ద తక్కువ ధరకు ఇసుక లభిస్తుండడంతో నిర్మాణదారులు డిపోల జోలికి వెళ్లడంలేదు. అయితే గోదావరి ఇసుక వినియోగించే వారు మాత్రం గాజువాక డిపో నుంచి కొనుగోలుచేస్తున్నారు. ముడసర్లోవ, భీమిలిలో అంతంత మాత్రంగానే ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు డిపోలు కొనసాగించడంపై అధికారులు సమాచాలోచనలు చేస్తున్నారు. లక్షలు వెచ్చించి ఏర్పాటుచేసిన డిపోలతో ఇప్పటికే నష్టాలు చవిచూశారు. టన్ను, అరటన్ను ఇసుక నగరంలో ఎక్కడపడితే అక్కడ లభిస్తుండడంతో డిపోల్లో రేట్లు తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. గాజువాకలో టన్ను రూ.600, మిగిలిన రెండు డిపోల్లో రూ.500గా నిర్ణయిస్తే వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని నదుల నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతిలేదు. కేవలం సొంత అవసరాలకు మాత్రం ఎడ్లబళ్లు/ ట్రాక్టర్లపై ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చు. ఈ ముసుగులో అక్రమ తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. దీంతో కొందరు వ్యాపారులు ఉమ్మడి జిల్లాల నుంచి ఇసుక తీసుకువస్తున్నారని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో డిపోల నిర్వహణపై ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

Updated Date - Feb 16 , 2026 | 01:15 AM