ఇసుక, గ్రావెల్ దందా
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:57 AM
మండలంలోని సముద్ర తీర గ్రామాల్లో ఇసుక, ఇండస్ట్రియల్ కారిడార్ భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. రాత్రిపూట యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ, డంపర్ లారీలు, ట్రాక్టర్లద్వారా రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి, భవన నిర్మాణాల్లో పునాదులు నింపడానికి రవాణా చేస్తున్నారు.
సముద్ర తీరంలో, కారిడార్ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు
మత్స్యకార గ్రామాలకు పొంచిఉన్న ముప్పు
పట్టించుకోని అటవీ శాఖ, ఏపీఐఐసీ అధికారులు
నక్కపల్లి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సముద్ర తీర గ్రామాల్లో ఇసుక, ఇండస్ట్రియల్ కారిడార్ భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. రాత్రిపూట యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ, డంపర్ లారీలు, ట్రాక్టర్లద్వారా రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి, భవన నిర్మాణాల్లో పునాదులు నింపడానికి రవాణా చేస్తున్నారు.
నక్కపల్లి మండలంలో డీఎల్‌పురం, బంగారమ్మపేట, పెదతీనార్ల, అమలాపురం, తదితర గ్రామాలు సముద్ర తీరంలో వున్నాయి. వాస్తవంగా సముద్రం ఇసుక భవన నిర్మాణాలు, ఇతర కట్టడానికి పనికిరాదు. అయితే రియల్ ఎస్టేట్ వెంచర్లలో లోతట్టు ప్రదేశాలను ఎత్తు చేయడానికి, భవన నిర్మాణాల్లో పునాదులు నింపడానికి సముద్రం ఇసుకను వినియోగిస్తున్నారు. దీంతో సముద్రం ఇసుకకు గిరాకీ ఏర్పడడంతో పలువురు దీనిని తమకు అనుకూలంగా మార్చుకొని వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. రాత్రిపూట ఎక్స్‌కవేటర్లతో ఇసుకను తవ్వి, టిప్పర్ లారీలు, ట్రాక్టర్లలోకి లోడింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి నక్కపల్లితోపాటు పాయకరావుపేట మండలంలోని పలు గ్రామాలకు రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక దూరాన్నిబట్టి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. సముద్ర తీర ప్రాంతం అటవీ శాఖ పరిధిలో వుండడం, సిబ్బంది చుట్టం చూపుగా కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం, రెవెన్యూ అధికారులు తమ పరిధి కాదని పట్టించుకోకపోవడంతో సముద్ర తీర ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర తుఫాన్లు వచ్చినప్పుడు ఉప్పెన సంభవిస్తే సముద్రం నీరు గ్రామాలను ముంచెత్తుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కారిడార్ భూముల్లో గ్రావెల్ తవ్వకాలు
మండలంలోని డీఎల్‌పురం, వేంపాడు, రాజయ్యపేట, చందనాడ, బుచ్చిరాజుపేట, అమలాపురం తదితర గ్రామాల పరిధిలో విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ కోసం గతంలో ప్రభుత్వం భూములను సేకరించింది. వీటిల్లో కొండపోరంబోకు భూములు వున్నాయి. ఇక్కడ నాణ్యమైన గ్రావెల్ వుండడంతో అక్రమార్కులు పగలు, రాత్రి అన్న తేడా లేకుండా గ్రావెల్ తవ్వుకుపోతున్నారు. ఈ భూములన్నీ ఏపీఐఐసీ ఆధీనంలో వుండడం, ఇక్కడ సిబ్బంది అంతంతమాత్రంగానే ఉండడంతో కారిడార్ భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకోలేకపోతున్నారు. ఆర్‌అండ్‌బీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి రాత్రి వేళల్లో పలువాహనాల్లో గ్రావెల్‌ను తరలిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.