Share News

మంజూరైన ఇళ్లు సకాలంలో పూర్తి

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:19 AM

ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన పథకంలో 2019-2024 మధ్య మంజూరైన ఇళ్లను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను హౌసింగ్‌ ఈఈ శ్రీనివాస్‌ ఆదేశించారు.

మంజూరైన ఇళ్లు సకాలంలో పూర్తి
పూడిమడకలో లబ్ధిదారులతో మాట్లాడుతున్న శ్రీనివాస్‌

అచ్యుతాపురం, ఫిబ్రవరి 24 (ఆంద్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన పథకంలో 2019-2024 మధ్య మంజూరైన ఇళ్లను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను హౌసింగ్‌ ఈఈ శ్రీనివాస్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన అచ్యుతాపురం మండలం పూడిమడక, రాంబిల్లి మండలం రాజ్‌ కోడూరు లేఅవుట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక్కో గృహ నిర్మాణానికి రూ.1.8 లక్షలు మంజూరు చేసిందని, నిధులు చాలక నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు. దీనిని గమనించిన కూటమి ప్రభుత్వం ఎస్‌సీ, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనంగా మంజూరు చేసిందన్నారు. అచ్యుతాపురం మండలంలో మొత్తం 1,306 గృహాలు మంజూరు కాగా, అందులో 746 మాత్రమే పూర్తయాయని, 560 గృహాలు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయని చెప్పారు. జిల్లాలో అతిపెద్ద మత్స్యకార్ల గ్రామమైన పూడిమడకలో రెండు లేఅవుట్ల ద్వారా 191 గృహాలు మంజూరు కాగా, 96 గృహ నిర్మాణాలు పూర్తికాగా, 95 వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. కాగా రాంబిల్లి మండలంలో మొత్తం 1,116 గృహాలు మంజూరు చేయగా, 750 పూర్తికాగా 366 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. కేవలం రాజ్‌ కోడూరులో 71 ఇళ్లు మంజూరు కాగా, 53 పూర్తయాయని, 18 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. గృహ నిర్మాణాలను వీలైనంత త్వరలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పూడిమడక లేఅవుట్‌లో మంచినీటి సమస్య ఉందని లబ్ధిదారులు చెప్పడంతో వెంటనే పరిష్కరించాలని ఎంపీడీవో చిన్నారావును కోరారు. ఆయన వెంట డీఈఈ కె.ఉమాశంకర్‌, ఏఈలు బి.మమత, డీఏ రాజు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు సీహెచ్‌ శ్రీనివాస్‌, ప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:19 AM