సేమ్ సీన్
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:50 AM
విధులను పక్కనపెట్టి ఈ-చలాన్‌ల వసూల పేరుతో గుంపుగా ఒకచోట చేరి వాహనాలను ఆపితే శాఖాపరమైన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి హెచ్చరించినా ట్రాఫిక్ పోలీసుల తీరు మారలేదు.
మారని ట్రాఫిక్ పోలీసుల తీరు
కూడళ్ల వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వదిలేసి చలాన్‌లు కట్టించే పనిలో నిమగ్నం
గుంపుగా రోడ్డుకడ్డంగా నిలబడి వాహనాలు నిలిపివేత
పోలీసుల తీరుపై వాహనచోదకుల అసహనం
విశాఖపట్నం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి):
విధులను పక్కనపెట్టి ఈ-చలాన్‌ల వసూల పేరుతో గుంపుగా ఒకచోట చేరి వాహనాలను ఆపితే శాఖాపరమైన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి హెచ్చరించినా ట్రాఫిక్ పోలీసుల తీరు మారలేదు. సోమవారం ఒక్కరోజే నగర పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ట్రాఫిక్ పోలీసులు కూడళ్ల వద్ద విధి నిర్వహణలో ఉంటే వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తారు. కానీ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నగరంలో ట్రాఫిక్ పోలీసులు కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించే బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నారు. ట్రాఫిక్ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ తమ స్టేషన్ పరిధిలో ఏదో ఒక చోటకు వెళ్లి సమీపంలోని కూడళ్ల వద్ద పనిచేసే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, హోంగార్డులను పిలుస్తున్నారు. ఐదు నుంచి ఆరుగురు గుంపుగా చేరి రోడ్డుమధ్యలో నిలబడి వాహనాలను ఆపుతున్నారు. హెల్మెట్ పెట్టుకుని ఫ్యామిలీతో వెళుతున్న వారిని సైతం వదలడం లేదు. ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న విన్యాసాలపై ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం కథనం ప్రచురించింది. కూడళ్ల వద్ద ట్రాఫిక్ విధులను వదిలేసి రోడ్లపైకి వెళ్లి చలాన్‌లు జారీ/వసూలు పేరుతో హడావిడి చేయకూడదని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని సీపీ వెర్షన్‌ను కూడా ప్రచురించింది. ఆయన హెచ్చరికతో పోలీసుల తీరు మారుతుందని నగరవాసులు ఆశించారు. కానీ మంగళవారం ట్రాఫిక్ పోలీసులు పాత ధోరణిని కొనసాగించడంతో అందరూ విస్మయానికి గురయ్యారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాల్సిన ట్రాఫిక్ సిబ్బంది ఆరుగురు అక్కడ విధులను వదిలేసి ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకు స్వర్ణభారతి స్టేడియానికి వంద మీటర్ల దూరంలో నిలబడి చలాన్‌లను కట్టించడం, తనిఖీ చేయడం కనిపించింది. జగదాంబ జంక్షన్, అక్కయ్యపాలెం జంక్షన్‌లో కూడా పోలీసులు అదేమాదిరిగా వ్యవహరించారు. దీనిపై ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్ వద్ద ప్రస్తావించగా, చలాన్‌లు జారీచేయడం, వసూలుచేయడం చేయకపోతే ఎలాగంటూ?...తమ సిబ్బంది తీరును సమర్థించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రాఫిక్ పోలీసుల తీరుతో నగరవాసులు మాత్రం ఇబ్బందిపడుతున్నారు.