Share News

మళ్లీ అదే తీరు

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:37 AM

మండలంలోని విశాఖ ఫార్మా సిటీలో పలు కంపెనీల యాజమాన్యాలు వ్యర్థాల నిర్వహణలో నిబంధనలను పదేపదే తుంగలో తొక్కుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో రసాయన వ్యర్థజలాలను శుద్ధి చేయకుండా ఇష్టారాజ్యంగా బయటకు విడుదల చేస్తున్నారు. తాజాగా పరవాడ నుంచి భరణికం వెళ్లే ప్రధాన రహదారిలో మల్లోడిగెడ్డ వాగు మొత్తం ఫార్మా వ్యర్థాలతో నిండిపోయి నీరంతా నల్లగా తయారైంది. వాగు పొడవునా నీటిపై పెద్ద ఎత్తున నల్లటి తెడ్డు తేలింది. తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండడంతో రాకపోకలు సాగిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.

మళ్లీ అదే తీరు
నాలుగు రోజుల క్రితం ఫార్మా వ్యర్థ జలాలను విడిచిపెట్టడంతో ఇలా..

ఫార్మా వ్యర్థాలు శుద్ధి చేయకుండా బయటకు విడుదల

డ్రైనేజీల ద్వారా గెడ్డల్లోకి చేరిక

నల్లగా మారి దుర్వాసన వస్తున్న నీరు

నిబంధనలను తుంగలో తొక్కుతున్న ఫార్మా కంపెనీ యాజమాన్యాలు

పట్టనట్టు వ్యవహరిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి

పరవాడ, మే 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని విశాఖ ఫార్మా సిటీలో పలు కంపెనీల యాజమాన్యాలు వ్యర్థాల నిర్వహణలో నిబంధనలను పదేపదే తుంగలో తొక్కుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో రసాయన వ్యర్థజలాలను శుద్ధి చేయకుండా ఇష్టారాజ్యంగా బయటకు విడుదల చేస్తున్నారు. తాజాగా పరవాడ నుంచి భరణికం వెళ్లే ప్రధాన రహదారిలో మల్లోడిగెడ్డ వాగు మొత్తం ఫార్మా వ్యర్థాలతో నిండిపోయి నీరంతా నల్లగా తయారైంది. వాగు పొడవునా నీటిపై పెద్ద ఎత్తున నల్లటి తెడ్డు తేలింది. తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండడంతో రాకపోకలు సాగిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.

విశాఖ ఫార్మాసిటీలోని కంపెనీలు ఉత్పత్తుల తయారీ క్రమంలో వెలువడే రసాయన వ్యర్థజలాలను శుద్ధి చేయాలి. ఇందుకోసం రాంకీ ఆధ్వర్యంలో ఇక్కడ కామన్‌ ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (సీఈటీపీ) వుంది. వ్యర్థాలను శుద్ధి చేసినందుకు టన్నుకు నిర్ణీత మొత్తం ఫీజు చెల్లించాలి. అయితే పలు కంపెనీల యాజమాన్యాలు ఈ ఖర్చును భారంగా పరిగణించి, రసాయన వ్యర్థజలాలను డ్రైనేజీల ద్వారా సమీపంలోని గెడ్డలు, వాగుల్లోకి విడిచిపెడుతున్నాయి. ఈ తరహా చర్యలు ఎక్కువగా వర్షాకాలంలో చేస్తుంటారు. శుద్ధి చేయని కాలుష్య వ్యర్థాలు వర్షం నీటితో కలిసిపోవడంతో ప్రభావం అంతగా కనిపించదు. ఇవి తొలుత గెడ్డల్లోకి, వాటి నుంచి సాగు నీటి చెరువుల్లోకి చేరుతున్నాయి. ఇప్పటికే పరవాడ పెద్ద చెరువు పూర్తిగా కలుషితమైంది. ఇందులో నీటిని పశువులు, జీవాలు తాగడం లేదు. ఈ నీటిని పొలాలకు పెట్టుకుంటే నేల పాడై, పంటల సాగుకు పనికిరాకుండా పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మండు వేసవిలో సైతం కాలుష్య వ్యర్థాలను నిర్భయంగా బయటకు విడుదల చేస్తున్నారు. వారం క్రితం వరకు మల్లోడిగెడ్డలో చుక్క నీరు లేదు. పూర్తిగా ఎండిపోయింది. అయితే ఇటీవల వర్షం కురిసినప్పుడు కొన్ని ఫార్మా కంపెనీలు ఇదే అదనుగా భావించి రసాయన వ్యర్థ జలాలను డ్రైనేజీల ద్వారా గెడ్డలోకి విడిచిపెట్టాయి. ఇవి దిగువున వున్న మల్లోడిగెడ్డ వాగులోకి చేరాయి. తీవ్ర దుర్గంధం వస్తుండడంతో ఇటుగా రాకపోకలు సాగిస్తున్న వారు ఇబ్బంది పడుతున్నారు. గతంలో రాంకీ యాజమాన్యం వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా విడిచిపెట్టిందన్న కారణంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో రాంకీ యాజమాన్యం వాగులోని ఉన్న నీరును మోటార్లతో తోడించి సీఈటీపీకి తరలించారు. తాజాగా ఫార్మా వ్యర్థ జాలాలను బయటకు విడిచిపెట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఫార్మా యాజమాన్యాలు తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని వాపోతున్నారు. వ్యర్థాల సమస్యను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తీవ్రంగా పరిగణించి, కఠన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఫార్మా యాజమాన్యాలు తరచూ కాలుష్య వ్యర్థాలను బయటకు విడిచిపెడుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మల్లోడిగెడ్డ వాగులోకి ఫార్మా వ్యర్థ జలాలను విడిచిపెట్టిన పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jun 01 , 2026 | 12:37 AM