Share News

రాళ్లగెడ్డ-లోతుగెడ్డ రహదారికి మోక్షం

ABN , Publish Date - Sep 08 , 2026 | 11:34 PM

మండలంలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు బలపం కోరుకొండ ప్రాంతానికి వెళ్లే రాళ్లగెడ్డ-లోతుగెడ్డ రహదారికి మోక్షం కలగనున్నది. ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం రహదారి నిర్మాణానికి రూ.7.65 కోట్ల సాస్కీ నిధులను మంజూరు చేసింది. కాంట్రాక్టర్‌, పీఆర్‌ ఇంజనీరింగ్‌ అధికారులు మరో వారం రోజుల్లో పనులు ప్రారంభించనున్నారు. ఈ రహదారిపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ప్రాంతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాళ్లగెడ్డ-లోతుగెడ్డ రహదారికి మోక్షం
కోటగున్నలు సమీపంలో ఏర్పడిన గొయ్యిలు

ఐదేళ్లుగా కన్నెతి చూడని వైసీపీ ప్రభుత్వం

అడుగడుగున భారీ గోతులు

నిర్మాణాలకు రూ.7.65కోట్ల నిధులు

విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

ఆరు నెలల్లో పూర్తికానున్న పనులు

చింతపల్లి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాళ్లగెడ్డ-లోతుగెడ్డ రహదారి ఆంరఽధా-ఒడిశా రాష్ట్రాలను కలిపే ప్రధాన రహదారి. మండలంలోని బలపం, కుడుముసారి, తమ్మంగుల పంచాయతీలకు చెందిన 89 గ్రామాల ఆదివాసీలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్‌ పరిధిలో మూడు పంచాయతీ ప్రజలు కూడా ఈ రహదారిపై రాకపోకలు చేస్తుంటారు. ఈ రోడ్డును పదేళ్ల క్రితం నిర్మించారు. ఐదేళ్ల క్రితం చిన్నపాటి గోతులు ఏర్పడ్డాయి. సకాలంలో వైసీపీ ప్రభుత్వ పాలకులు, అధికారులు గోతులను పూడ్చకపోవడంతో అత్యంత దయనీయ స్థితికి చేరుకున్నది. లోతుగెడ్డ బ్రిడ్జి నుంచి రాళ్లగెడ్డకు వరకు అడుగడుగున భారీ గోతులు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల రహదారి ఆనవాళ్లు కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సు, సర్వీసు జీపులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు అతికష్టంపై రాకపోకలు సాగిస్తున్నాయి.

ఐదేళ్లుగా పట్టించుకోని వైసీపీ పాలకులు

రాళ్లగెడ్డ-లోతుగెడ్డ రహదారిని మరమ్మతులు చేసేందుకు ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ పాలకులు, అధికారులు కనీసం పట్టించుకోలేదు. బలపంలో గడపగడపకు కార్యక్రమానికి హాజరైన నాటి ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, వైసీపీ నేతలు దృష్టికి స్థానిక ప్రజలు రహదారి సమస్యను తీసుకు వెళ్లారు. రహదారి మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ పదవి కాలం ముగిసిపోయిందేతప్ప సమస్య పరిష్కారం కాలేదు. కొంత మంది ఉద్యోగులు నాటి ఎస్టీ కమిషన్‌ సభ్యుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ కుంభ రవిబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ సమస్యను సాధ్యమైనంత వేగంగా పరిష్కారానికి కృషి చేస్తానని ఇచ్చిన హామీ నీటిమూట అయ్యింది.

కూటమి ప్రభుత్వం చొరవతో మార్గం సుగమనం

కూటమి ప్రభుత్వం 2024న అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి అభ్యర్థన మేరకు డీపీఆర్‌ సిద్ధం చేయాలని పంచాయతీరాజ్‌ ప్రాజెక్టు అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 2025లో సమగ్ర డీపీఆర్‌ని ప్రభుత్వానికి ఇంజనీరింగ్‌ అధికారులు సమర్పించారు. 2026 ఆగస్టులో రహదారి నిర్మాణాలకు ప్రభుత్వం రూ.7.65 కోట్లను మంజూరు చేసింది. రహదారుల నిర్మాణాలకు పీఆర్‌ ప్రాజెక్టు ఇంజనీర్లు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి వారం రోజుల క్రితం పనులు ప్రారంభించేందుకు భూమి పూజ చేశారు. వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని, ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తామని పీఆర్‌ ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు.

Updated Date - Sep 08 , 2026 | 11:34 PM