Share News

పులుసుమామిడి- లుంగపర్తి రోడ్డుకు మోక్షం

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:03 PM

మండలంలోని పులుసుమామిడి- లుంగపర్తి రహదారికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ రహదారి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఇటీవల రూ.95 లక్షలు మంజూరు చేసింది.

పులుసుమామిడి- లుంగపర్తి రోడ్డుకు మోక్షం
అధ్వానంగా ఉన్న లుంగపర్తి రోడ్డు

పునర్నిర్మాణానికి రూ.95 లక్షలు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం

తీరనున్న పలు గ్రామాల ప్రజల రవాణా కష్టాలు

అనంతగిరి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పులుసుమామిడి- లుంగపర్తి రహదారికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ రహదారి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఇటీవల రూ.95 లక్షలు మంజూరు చేసింది. 1.8 కిలోమీటర్ల మేర ఈ రహదారి పనులు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పులుసుమామిడి నుంచి లుంగపర్తి పంచాయతీ కేంద్రానికి 2013లోని ప్రధానమంత్రి గ్రామ సడక్‌యోజన్‌ పథకంలో అప్పటి ప్రభుత్వం రూ.1.44 కోట్లతో తారురోడ్డు నిర్మించింది. ఈ రోడ్డు మూడేళ్ల వరకు బాగానే ఉంది. ఆ తరువాత కురిసిన భారీ వర్షాలకు రోడ్డు దెబ్బతిన్నది. రెండు కిలో మీటర్ల ప్రయాణానికి పలు గ్రామాల గిరిజనులు నరకయాతన అనుభవిస్తున్నారు. రోడ్డంతా కొట్టుకుపోయి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉండడంతో పలువురు ప్రమాదాలకు గురయ్యారు. లుంగపర్తి పంచాయతీ కేంద్రంలోని పీహెచ్‌సీ, గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ బాలుర పాఠశాల, సచివాలయం సిబ్బంది నిత్యం విధులకు ఈ మార్గం గుండానే వెళుతుంటారు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మరమ్శతులు చేయాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతులు సమర్పించినా ఫలితం లేకపోయింది. గత ఏడాది లుంగపర్తి పంచాయతీ కేంద్రానికి చెందిన గిరిజన యువత శ్రమదానంతో భారీగా ఏర్పడిన గుంతలను మట్టి, రాళ్లతో పూడ్చి కొంతవరకు ప్రయాణానికి మార్గం చూపారు.

రోడ్డు పనులు పూర్తయితే ఎన్నో గ్రామాలకు మేలు

ఈ రహదారి పనులు పూర్తయితే లుంగపర్తి పంచాయతీ పరిధిలోని దిగువపట్టి, దిగువపట్టి, ఎగువపాడు, మల్లేపాడు, చీడివలస, నారింగబంద, దింసలవలస, దోనిగుమ్మి, నేలపాలెం, ఓనుకొండ, వేలగలపాడు, మెట్టవలస గ్రామాలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ గ్రామాల ప్రజలకు రవాణా కష్టాలు తీరతాయి. అలాగే పీహెచ్‌సీ నుంచి అత్యవసర వైద్యసేవల నిమిత్తం మైదాన ప్రాంతాలకు వెళ్లే అంబులెన్స్‌లకు కూడా ఇబ్బందులు తొలగుతాయి. ఈ రహదారి పునర్నిర్మాణానికి నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వానికి ఆయా గ్రామాల గిరిజనులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

Updated Date - Feb 08 , 2026 | 11:03 PM