అంతర్ రాష్ట్ర రహదారికి మోక్షం
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:37 AM
సీలేరు అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారికి మోక్షం కలిగింది. అత్యంత అధ్వానంగా తయారైన ఆర్‌వీనగర్- పాలగెడ్డ రహదారి 43.6 కిలోమీటర్ల మేర నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ.18.65కోట్లు విడుదల చేయడంతో ఆర్ అండ్ బీ అధికారులు పనులు ప్రారంభించారు. నాలుగు రీచ్‌లుగా పనులు చేపడుతున్నారు.
పాలగెడ్డ- ఆర్‌వీనగర్ రహదారి పనులు ప్రారంభం
నాలుగు రీచ్‌లుగా నిర్మాణాలు
రూ.18.65 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
ఐదేళ్లపాటు రహదారి బాగోగులు పట్టించుకోని గత వైసీపీ ప్రభుత్వం
గూడెంకొత్తవీధి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): సీలేరు అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారికి మోక్షం కలిగింది. అత్యంత అధ్వానంగా తయారైన ఆర్‌వీనగర్- పాలగెడ్డ రహదారి 43.6 కిలోమీటర్ల మేర నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ.18.65కోట్లు విడుదల చేయడంతో ఆర్ అండ్ బీ అధికారులు పనులు ప్రారంభించారు. నాలుగు రీచ్‌లుగా పనులు చేపడుతున్నారు. తొలి విడతగా ఆర్‌వీనగర్- లంకపాకలు రీచ్‌లో పనులు ప్రారంభించారు. వర్షాలు ప్రారంభానికి ముందుగానే రహదారి నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆర్‌అండ్‌బీ అధికారులు పనులను వేగవంతం చేశారు.
ఆర్‌వీనగర్ నుంచి పాలగెడ్డ వరకు ఉన్న రహదారిని గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. రహదారిపై ఏర్పడిన గోతులను సైతం పూడ్చలేదు. దీంతో ఈ మార్గంలో పలు చోట్ల భారీ గోతులు ఏర్పడి, రహదారి ఆనవాళ్లు లేకుండాపోయింది. దీంతో గిరిజన సంఘాలు, ఆదివాసీ జేఏసీ నాయకులు 2022 నుంచి 2024 వరకు దశలవారీగా పాదయాత్రలు, ఆందోళనలు, నిరసనలు చేసినప్పటికి గత వైసీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. 2024 సెప్టెంబరు 8వ తేదీన కురిసిన వర్షానికి సీలేరు- ఆర్‌వీనగర్ రహదారి అస్తవ్యస్తమైపోయింది. వరద ప్రవాహానికి రహదారిపైకి కొండచరియలు, వృక్షశకలాలు కొట్టుకువచ్చాయి. పలు చోట్ల రహదారి పూర్తిగా కోతకు గురైంది. కల్వర్టులు కొట్టుకుపోయాయి. సంపంగిగొంది నుంచి సీలేరు వరకు పలు చోట్ల రహదారి శిథిలమైపోవడం వల్ల పది రోజుల పాటు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆర్‌అండ్‌బీ అధికారులు పది రోజులు శ్రమించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు.
ఊపందుకున్న పనులు
కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఆర్‌వీనగర్ నుంచి పాలగెడ్డ వరకు రహదారి నిర్మాణ పనులను ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రారంభించారు. తొలివిడతగా మొదటి రీచ్ ఆర్‌వీనగర్ నుంచి లంకపాకలు వరకు 13.6 కిలోమీటర్ల మేర పనులను ప్రారంభించారు. ఈ రీచ్ పూర్తికాగానే రెండో రీచ్ రెయిన్‌గేజ్ నుంచి ధారాలమ్మ దేవాలయం వరకు ఐదు కిలోమీటర్లు, మూడో రీచ్ ధారాలమ్మ దేవాలయం నుంచి చల్లనిశిల్ప 15 కిలోమీటర్లు, నాల్గవ రీచ్ సీలేరు నుంచి పాలగెడ్డ వరకు 10 కిలోమీటర్ల పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం భారీ గోతులను మెటల్‌తో పూడ్చి వేస్తున్నారు. నెలాఖరు నాటికి తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.