బగ్మారవలస- టోకూరు రోడ్డుకు మోక్షం
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:39 PM
మండలంలోని టోకూరు పంచాయతీ పరిధిలో గల బగ్మారవలస- టోకూరు రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది.
రహదారి నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం
రవాణా కష్టాలు తీరతాయని పలు గ్రామాల గిరిజనుల ఆనందం
అనంతగిరి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని టోకూరు పంచాయతీ పరిధిలో గల బగ్మారవలస- టోకూరు రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రోడ్డు అధ్వానంగా ఉండడంతో జాకవలస, సిసాముండ, టోకూరు, కపటివలస, షాడ, సింగర్భ, తదితర గ్రామాల గిరిజనులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. బొర్రా మెయిన్ రోడ్డు బగ్మారవలస నుంచి సిసాముండ మీదుగా టోకూరు పంచాయతీ కేంద్రానికి వెళ్లాలంటే వారంతా నరకం చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రహదారి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పంపించినా ఫలితం లేకపోయింది. కూటమి ప్రభుత్వంలో వచ్చిన తరువాత బగ్మారవలస నుంచి టోకూరు వరకు కిలోమీటరు మేర తారురోడ్డు నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరు చేసింది. దీంతో తమకు రవాణా కష్టాలు తీరతాయని సర్పంచ్ కిల్లో మోస్యతో పాటు పలు గ్రామాల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.