అధ్వాన రోడ్డుకు మోక్షం
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:14 PM
జిల్లా కేంద్రం పాడేరు నుంచి పెదబయలు మీదుగా జోలాపుట్టు వెళ్లే రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ముఖ్యంగా పెదబయలు మండల కేంద్రానికి అటు, ఇటూ ఐదు కిలోమీటర్ల మేర అధ్వాన రోడ్డుతో పడుతున్న కష్టాలకు ఎనిమిదేళ్ల తర్వాత విముక్తి లభించింది.
రూ.9.6 కోట్లతో పెదబయలుకు
అటూ,ఇటూ ఐదు కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి
ఎనిమిదేళ్లు ప్రయాణికులు, డ్రైవర్లు నరకయాతన
కూటమి సర్కార్ చర్యలతో తీరనున్న కష్టాలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పాడేరు నుంచి ప్రయాణం ప్రారంభిస్తే పెదబయలు మండలంలో గంపరాయి, తురకలవలస, చుట్టుమెట్ట, అరడకోట, అడుగులపుట్టు, బంగారుమెట్ట, పన్నెడ, పెదబయలు, చట్రాయిపుట్టు, తమరాడ, ముంచంగిపుట్టు మండలంలో బంగారుమెట్ట, కిలగాడ, వనబసింగి, చోటముకిపుట్టు ప్రాంతాల్లో రోడ్డు గతుకులమయమైంది. ఇదంతా ఒక ఎత్తయితే... పెదబయలు మండల కేంద్రానికి అటూ, ఇటు కలిపి ఐదు కిలోమీటర్ల రోడ్డును గత ఎనిమిదేళ్లుగా కనీస మరమ్మతులు చేయకుండా వదిలేశారు.
పాడేరు నుంచి ముంచంగిపుట్టు మండల కేంద్రం వరకు ఉన్న 54 కిలోమీటర్ల రోడ్డును ఎనిమిదేళ్ల క్రితమే రోడ్ల, భవనాల శాఖ రూ.45 కోట్లతో నిర్మించింది. కాని పెదబయలు మండల కేంద్రానికి పాడేరు వైపునకు మూడు కిలోమీటర్లు, ముంచంగిపుట్టు వైపు మరో రెండు కిలోమీటర్ల రోడ్డును మాత్రం నిర్మించలేదు. దీంతో ఈ ఐదు కిలోమీటర్ల రోడ్డు గత ఎనిమిదేళ్లుగా గతుకులు, రోడ్డంచుల కోతతో అధ్వానంగానే ఉంది. చివరకు పెదబయలులోని రోడ్డు సైతం మెరుగుపడలేదు. గత ఐదేళ్లు వైసీపీ అఽధికారంలో ఉండగా ఈ రోడ్డును మెరుగుపర్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది.
డ్రైవర్లు, ప్రయాణికులకు నిత్యం నరకం
పాడేరు నుంచి పెదబయలు మీదుగా ముంచంగిపుట్టు, జోలాపుట్టుకు రాకపోకలు సాగిస్తున్న డ్రైవర్లు, ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు. రోడ్డుకు అక్కడక్కడ గతుకులతోపాటు పెదబయలుకు అటూ..ఇటూ ఐదు కిలోమీటర్ల రోడ్డు గతుకులతో పాటు రోడ్డు అంచులు సైతం బాగా కోతకు గురయ్యాయి. దీంతో ఈ రోడ్డుపై వన్‌వే మార్గంలో వాహనాలు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఇన్నాళ్లు కొనసాగింది. పొరపాటున నాలుగు చక్రాల వాహనాలు ఎదురెదురుగా వస్తే అంతే సంగతులు.. ఇక ద్విచక్ర వాహనానికి ఏదైనా భారీ వాహనం ఎదురు పడితే ఇక అవస్థలు పడాల్సిందే. వర్షాలు కురిస్తే ఈసమస్య మరింత ఘోరంగా ఉంటుంది. రోడ్డు గతుకుల్లో, రోడ్డంచుల్లోని గంతల్లో వర్షం నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు నరకం చూస్తున్నామని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.
రూ.9.6 కోట్లతో ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం
గత ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పాడేరు-జోలాపుట్టు మెయిన్‌రోడ్డులోని పెదబయలు మండల పరిధిలోకి వచ్చే ఐదు కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం రూ.9.6 కోట్లు మంజూరు చేసింది. దీంతో గత రెండు వారాలుగా ఆ రోడ్డులో గుంతలు పూడ్చడం, వెడల్పు చేయడం వంటి పనులు జరుగుతున్నాయి. పనులను వేగవంతం చేసి మరో రెండు నెలల్లో రోడ్డు అభివృద్ధి పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ రోడ్డు పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని ప్రయాణికులు, వాహనాల డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.