Share News

నమో నరసింహ

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:56 AM

సింహగిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. అధికారుల అంచనాలకు మించి వచ్చారు.

నమో నరసింహ

సింహగిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తజనం

అంచనాలకు మించి రాక...

తెల్లవారుజాము నుంచే ప్రారంభం

ఈసారి యువత, మహిళలు అధికం

మధ్యాహ్నం రెండు గంటలకు స్వామి వారి పుష్పరథాన్ని ప్రారంభించిన ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు

విశాఖపట్నం, జూలై 28 (ఆంధ్రజ్యోతి):

సింహగిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. అధికారుల అంచనాలకు మించి వచ్చారు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే తొలిపావంచాకు వచ్చి, స్వామికి నమస్కరించి ప్రదక్షిణ ప్రారంభించారు. మధ్యాహ్నం రెండు గంటలకు అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు పుష్పరథం యాత్ర ప్రారంభించే సరికే భక్తుల సంఖ్య 70 వేలను దాటేసింది. ఆ తరువాత గంట గంటకు పెరుగుతూ రాత్రి ఏడు గంటల సమయానికి 3.37 లక్షలకు చేరుకుంది.

గిరి ప్రదక్షిణకు ఈసారి ఉత్తరాంధ్రతో పాటు పొరుగు జిల్లాలు, పొరుగు రాషా్ట్రల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. రహదారులన్నీ ‘నారాయణ’ నామ స్మరణతో మారుమోగాయి. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని తొలి పావంచా వద్ద రద్దీని నియంత్రించడానికి నగరంలో పలు ప్రాంతాల్లో స్వామి నమూనా విగ్రహాలు ఏర్పాటుచేయడం కలిసివచ్చింది. భక్తులు పైనాపిల్‌ కాలనీ, సీతమ్మధార తదితర ప్రాంతాల్లో ఆ విగ్రహాల వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ ప్రారంభించారు. ఉదయం పది గంటల వరకూ విడతల వారీగా వర్షం పడినా భక్తులు వెనక్కి తగ్గలేదు. మధ్యాహ్నం రెండు గంటల తరువాత జాతీయ రహదారిపై నడిచే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. సాయంత్రం ఐదు గంటలకు రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఏడు గంటలకు హనుమంతవాక, ఎంవీపీ కాలనీ, మద్దిలపాలెం, సత్యం జంక్షన్‌లు జామ్‌ అయిపోయాయి.

హరినామ స్మరణతోనే ప్రదక్షిణ

ఈసారి యువత పెద్దసంఖ్యలో ముఖ్యంగా అమ్మాయిలు గిరి ప్రదక్షిణలో పాల్గొని భక్తిని చాటారు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి హరి నామస్మరణ చేస్తూనే పాదయాత్ర కొనసాగించారు. దారిలో తోటివారికి సాయం చేస్తూ, వారిని కూడా తమతో పాటు తొలిపావంచా వరకు తీసుకువెళ్లారు. కాళ్లు నొప్పులు పెడుతున్నాయని, ఇక నడవలేమని చతికిలపడిన వారికి దగ్గర్లోని సత్యసాయి సేవా సంస్థల శిబిరం వద్దకు తీసుకువెళ్లి కాళ్లకు ఆయిల్‌ రాసి, మర్దనా చేయించారు. పదుల సంఖ్యలో సేవకులు కాళ్లను ఒడిలో పెట్టుకొని మర్దనాలు చేశారు. జీవీఎంసీ, వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసిన శిబిరాల్లోను నొప్పి నివారణకు స్ర్పేలు జల్లారు.

అల్పాహారం కేంద్రాల వద్ద తోపులాటలు

నగరంలో అనేక స్వచ్ఛంద సంస్థలు భక్తులకు పులిహోర, పొంగళి, ఉప్మా, పాయసం, మజ్జిగ, బిస్కెట్లు, గారెలు...ఇలా అనేక రకాల ఆహార పదార్థాలు అందించాయి. అయితే కొన్నిచోట్ల తోపులాటలు జరిగాయి.

ఆరుగురికి అనారోగ్యం

ఈ యాత్రలో అధికారుల వద్ద ఆరు అనారోగ్య ఘటనలు నమోదయ్యాయి. ఒకరికి బీపీ పెరిగి పడిపోగా, మరొకరు కళ్లు తిరిగి కూర్చుండిపోయారు. ఒక అమ్మాయి కడుపునొప్పితో మెలికలు తిరిగిపోయింది. మరొకరు నడస్తూ పడిపోవడంతో ఎడమ కాలికి దెబ్బ తగిలింది. మరొకరు కళ్లు తిరిగి పడిపోగా తలకు గాయమైంది. వీరందరికీ తక్షణమే వైద్యసాయం చేసి కోలుకునేలా చేశారు.

రద్దీలోను చెయిన్‌ స్నాచింగ్‌

జేబుదొంగలు, చెయిన్‌ స్నాచర్లు ఇదే అదనుగా భావించి చేతులకు పనిచెప్పారు. సింహాచలం ఆర్చి వద్ద సాయంత్రం 6.15 గంటలకు ఒక మహిళ మెడలో బంగారు గొలుసు తెంపుకొని పారిపోయారు. తొలి పావంచా వద్ద ఒకరి మొబైల్‌ను ఎవరో తస్కరించారు.

గంట గంటకూ పెరిగిన భక్తులు

రాత్రి 12 గంటల సమయానికి 4,55,962 మంది..

విశాఖపట్నం, జూలై 28 (ఆంధ్రజ్యోతి):

గిరి ప్రదక్షిణలో ఈసారి ఊహించని విధంగా భక్తుల సంఖ్య పెరిగిపోయింది. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన భక్తుల రాక...రాత్రి 12 గంటల వరకూ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. గతంలో ఎక్కువ మంది ఇసుకతోట వద్ద జాతీయ రహదారి దాటి హెచ్‌బీ కాలనీ మీదుగా సీతమ్మధార మార్గంలో వెళ్లేవారు. కానీ ఈసారి చాలామంది జాతీయ రహదారిపై మద్దిలపాలెం, అక్కయ్యపాలెం మీదుగా ఎన్‌ఏడీ వైపు వెళ్లారు.

ఇలా పెరిగిన భక్తులు

తొలిపావంచా వద్ద మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు పుష్పరథం బయలుదేరడానికి ముందే 42 వేల మంది అక్కడికి చేరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఆ తరువాత 3 గంటలకు వారి సంఖ్య 71 వేలకు చేరింది. అలా రాత్రి 10 గంటలకు 4.41 లక్షలకు చేరింది.

మధ్యాహ్నం 2 గంటలకు - 42,000

3 గంటలకు - 71,000

సాయంత్రం 4 గంటలకు 1,35,000

5 గంటలకు 2,10,000

6 గంటలకు 2,80,000

రాత్రి 7 గంటలకు 3,37,688

9 గంటలకు 4,28,943

10 గంటలకు 4,41,841

12 గంటలకు 4,55,962

Updated Date - Jul 29 , 2026 | 12:56 AM