Share News

నమో నారసింహా

ABN , Publish Date - Apr 21 , 2026 | 01:29 AM

సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహుని చందనోత్సవం సోమవారం వైభవంగా జరిగింది.

నమో నారసింహా

నిజరూపంలో అప్పన్న దర్శనం

మురిసిన భక్త జనం

ఘనంగా చందనోత్సవం

తెల్లవారుజామున 3.20 గంటల నుంచి సామాన్య భక్తులకు దర్శనం

క్యూలైన్లలో భక్తులకు నిరంతరం తాగునీరు, మజ్జిగ సరఫరా

సుమారు 1.2 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని దేవస్థానం అధికారుల అంచనా

సింహాచలం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహుని చందనోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. అప్పన్న నిజరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఉత్సవంలో భాగంగా వేకువజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి ప్రభాతారాధనలు నిర్వహించారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ స్థానాచార్యులు టీపీ రాజగోపాల్‌ పర్యవేక్షణలో ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు కళావాహన చేసి అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ వెండి బొరిగెలతో ఏడాది పొడవునా స్వామి పైపూతగా ఉండే చందనాన్ని తొలగించారు. నీరాజనాలిచ్చిన తరువాత సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు, కుటుంబ సభ్యులకు తొలి దర్శనాన్ని కల్పించారు. తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరపున హోం మంత్రి వంగలపూడి అనిత స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతినిధులు అప్పన్నకు పట్టువస్త్రాలిచ్చారు.

సామాన్య భక్తులకు ఉదయం 3.20 గంటల నుంచి దర్శనాన్ని అధికారులు కల్పించారు. మంత్రులు, జిల్లా కలెక్టర్‌ ప్రకటించిన విధంగా రూ.1,500 తీసుకున్న భక్తులకు ఉదయం 5.40 గంటల వరకు అంతరాలయ దర్శనం కల్పించారు. భక్తులు వేడి వాతావరణం కారణంగా కాస్త ఇబ్బంది పడినప్పటికీ దానికి ఉపశమనంగా క్యూలో ఉన్నవారికి అధికారులు నిరంతరం తాగునీరు, మజ్జిగ, గ్లూకోజ్‌, పిల్లలకు పాలు, బిస్కెట్లు వలంటీర్ల ద్వారా పంపిణీ చేయించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ స్వయంగా ఉచిత క్యూలలో భక్తుల పరిస్థితులను గమనించడంతో పాటు ఆలయ ప్రధానద్వారం నీలాద్రిగుమ్మం వద్ద నిలుచుని రద్దీ క్రమబద్ధీకరణకు శ్రమించారు. జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, దేవస్థానం ఈఓ వెంకటరావులు వాకీటాకీల సహాయంతో భక్తుల రద్దీ నియంత్రణకు ఇతర సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పనిచేశారు. దర్శనం అనంతరం దక్షిణ రాజగోపురం నుంచి అన్నప్రసాద భవన మార్గంలో వచ్చిన భక్తులకు దేవస్థానం ఉచితంగా లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేయగా, కొన్ని స్వచ్ఛంద సంస్థలు పానకం, మజ్జిగ అందజేశాయి. ఈ ఏడాది అప్పన్న నిజరూప దర్శనం సంతృప్తికరంగా అయినట్టు పలువురు భక్తులు ఆనందం వ్యక్తంచేశారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయం, ముందస్తు ప్రణాళికలతో విస్తృత ఏర్పాట్లు చేయడంతో చందనోత్సవం విజయవంతమైంది. దేవస్థానం అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం అప్పన్న నిజరూపాన్ని సుమారు లక్ష మంది దర్శించుకున్నారు. భక్తులకు దేవస్థానం అన్న ప్రసాద విభాగం అధికారులు సిబ్బంది అన్న ప్రసాదాన్ని వండి వడ్డించారు.

సమన్వయంతో విజయవంతం

...అయితే ఈసారీ అడ్డగోలు దర్శనాలు

టికెట్లు లేకుండానే ప్రొటోకాల్‌ దర్శనాలు

దగ్గరుండి సరిచేసిన కలెక్టర్‌, సీపీ, కమిషనర్లు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి):

అధికారులు ముందుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం సమన్వయంతో పనిచేసి చందనోత్సవాన్ని విజయవంతం చేశారు. క్యూలైన్లలో ఉన్నవారందరికీ నిజరూప దర్శనం చేయించారు. అయితే ఈసారి కూడా అడ్డగోలుగా దర్శనాలను అడ్డుకోలేకపోయారు. టికెట్లు లేకుండా అత్యధికులు ప్రొటోకాల్‌ క్యూలైన్‌లో దూరిపోయారు. దీనికి దేవదాయ, పోలీసు సిబ్బందే సహకరించారు. రూ.1,500, రూ.1,000, రూ.300 టికెట్లతో పాటు ఉచిత దర్శనాలకు కూడా క్యూలైన్లు ఏర్పాటుచేసి, ప్రొటోకాల్‌ దర్శనాలకు మాత్రం క్యూలైన్‌ పెట్టలేదు. వచ్చిన ప్రజా ప్రతినిధులు, అధికారులను రాజగోపురం మెట్లమార్గం గుండా పైకి పంపించారు. అంతరాలయంలోకి వెళ్లే ప్రజా ప్రతినిధి ఆరుగురితో మాత్రమే రావాలని నిబంధన పెట్టినా, అది ఎక్కడా అమలు కాలేదు. వారి వెనుక ఎంతమంది వస్తున్నారో గమనించి, అడ్డుకునే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. దాంతో అనధికార వ్యక్తులు పదుల సంఖ్యలో వారితో పాటు ప్రొటోకాల్‌ దర్శనాలు చేసుకున్నారు. ఆలయం లోపల వీవీఐపీలకు ఆశీర్వచనం చేసే ప్రాంతం నుంచి టికెట్లు లేని వారిని దేవదాయ సిబ్బంది పెద్ద సంఖ్యలో ప్రొటోకాల్‌ క్యూలైన్లలోకి పంపించారు. అదేవిధంగా అంతరాలయం దర్శనం చేసుకున్నవారు బయటకు వచ్చి కప్పస్తంభం పక్క నుంచి బయటకు వెళ్లాల్సి ఉంది. కానీ చాలా మంది ఎడమ వైపునకు వచ్చి మళ్లీ క్యూలైన్‌లో దూరిపోయి మరోసారి దర్శనానికి అంతరాలయంలోకి వెళ్లిపోయారు. ఇలాంటి వారిని అక్కడ విధుల్లో ఉన్న ఒక పోలీస్‌ అధికారి, దేవదాయ శాఖ సిబ్బంది ప్రోత్సహించారు. ఈ విషయం పోలీస్‌ కమిషనర్‌కు దృష్టికి వెళ్లడంతో ఆ సీఐని అక్కడి నుంచి బయటకు పంపించేశారు. ప్రొటోకాల్‌ క్యూలైన్లు సరిగ్గా నడవకపోవడం గుర్తించిన కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి ఆలయం లోపలే ఉండి అడ్డదారిలో వస్తున్న వారిని నిలువరించి సజావుగా సాగేలా చేశారు. దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ ప్రొటోకాల్‌ మార్గం మెట్ల దగ్గరున్న గేటుకు అడ్డంగా నిల్చొని వచ్చేవారి టికెట్లను తనిఖీ చేసి లోపలకు పంపించారు. చాలా మంది టికెట్లు లేకుండా రావడం గమనించి దిగువ స్థాయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆలయ ఈఓ జె.వెంకటరావు, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి అంతరాలయంలో విధులు నిర్వహించారు.

రాత్రి 11 గంటల సమయానికి

1,30,129 మందికి దర్శనం

8 గంటకు సగటున 6 వేల మందికి...

విశాఖపట్నం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): దివ్యక్షేత్రం సింహాచలంలో వరాహ లక్ష్మీనృసింహుని నిజరూపం దర్శనం సోమవారం కన్నుల పండువంగా సాగింది. ఉదయం మూడు గంటలకు ప్రారంభమైన ఈ ఉత్సవం రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగింది. గంటకు సగటున 6,200మంది చొప్పున రాత్రి 11 గంటల సమయానికి 1,30,129 మంది స్వామిని దర్శించుకున్నారు. భక్తులను కొండ దిగువ నుంచి పైకి తీసుకువెళ్లడానికి ఆర్టీసీ అధికారులు 90 బస్సులను ఏర్పాటుచేశారు. అయితే సాయంత్రం ఆరు గంటల సమయంలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో చాలామంది మెట్ల మార్గంలో నడుచుకుంటూ పైకి వెళ్లారు.

స్వామిని ఏ మార్గంలో ఎంతమంది దర్శించుకున్నారంటే...

-----------------------------------------------------------------------------------

మార్గం ఉదయం 7-8 అప్పటివరకూ రాత్రి 7-8 అప్పటికి

గంటల మధ్య దర్శనం చేసుకున్నవారు గంటల మధ్య మొత్తం

--------------------------------------------------------------------------------------------------

ఉచిత క్యూలైన్‌ 1,525 12,250 2,187 67,073

రూ.300 1,363 8,849 1,190 19,616

రూ.1,000 1,947 6,858 1,184 15,509

రూ.1,500 562 1,182 189 4,012

---------------------------------------------------------------------------------------

మొత్తం 5,398 29,769 4,750 1,06,204

---------------------------------------------------------------------------------------

Updated Date - Apr 21 , 2026 | 01:29 AM