Share News

జోరుగా పిప్పళ్ల విక్రయాలు

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:40 PM

ప్రస్తుతం మన్యంలోని పలు గ్రామాల్లో, వారపు సంతల్లో పిప్పళ్ల విక్రయాలు జోరందుకున్నాయి. అలాగే కొనుగోలు ధర సైతం ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందంగా ఉన్నారు.

జోరుగా పిప్పళ్ల విక్రయాలు
పిప్పళ్లను బస్తాల్లో వేసి లారీలో లోడ్‌ చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

ప్రతి వారపు సంతలో 500 నుంచి 2,000 బస్తాల వరకు అమ్మకాలు

కిలో రూ.350 చొప్పున వర్తకులకు విక్రయిస్తున్న గిరిజన రైతులు

గత మూడేళ్లుగా ధరలు నిలకడగా ఉండడంతో రైతన్న ఆనందం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ప్రస్తుతం మన్యంలోని పలు గ్రామాల్లో, వారపు సంతల్లో పిప్పళ్ల విక్రయాలు జోరందుకున్నాయి. అలాగే కొనుగోలు ధర సైతం ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందంగా ఉన్నారు.

పాడేరు మండలం గుత్తులపుట్టులోని గురువారం వారపు సంతకు సుమారు 500 బస్తాల పిప్పళ్లను గిరిజన రైతులు వర్తకులకు విక్రయించారు. ప్రస్తుతం పిప్పళ్ల సీజన్‌ కావడంతో శనివారం హుకుంపేటలో, సోమవారం పెదబయలులో, మంగళవారం జి.మాడుగుల, గురువారం పాడేరు మండలం గుత్తులపుట్టు వారపు సంతల్లో పిప్పళ్ల కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఔషధ గుణాలున్న పిప్పళ్లను ఏజెన్సీ వ్యాప్తంగా 15 వేల ఎకరాల్లో గిరిజనులు సాగు చేస్తున్నారని ఒక అంచనా. ప్రతి ఏడాది డిసెంబరు ఆఖరి వారం నుంచి పిప్పళ్ల క్రయవిక్రయాలు మొదలై మార్చి నెలాఖరుకు వరకు కొనసాగుతాయి. వడ్డాది మాడుగులకు చెందిన వర్తకులు గిరిజన రైతులు, గిరిజన చిరు వర్తకుల నుంచి వాటిని కొనుగోలు చేస్తారు. పలు రకాల మందుల తయారీకి వినియోగిస్తుండడంతో వీటికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లతో మంచి గిరాకీ ఉంది.

గత మూడేళ్లుగా ఆశాజనకంగా ధరలు

ప్రస్తుతం పిప్పళ్ల ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. 2021 వరకు పిప్పళ్లు కొనుగోలు ధరలు పతనం కాగా, 2022 నుంచి ధరలు కాస్త బాగున్నాయని, అలాగే 2023 సంవత్సరం నుంచి ధరలు పతనం కాకుండా స్థిరంగా కొనసాగుతుండడంతో మార్కెట్‌ బాగుందని వర్తకులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కిలో రూ.350 చొప్పున వారపు సంతల్లో వర్తకులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ, జాతీయ మార్కెట్‌లలో ధరలకు అనుగుణంగానే స్థానిక సంతల్లో ఆ ధరలను నిర్ణయిస్తారని వర్తకులు తెలిపారు. అయితే సుమారుగా 15 వేల ఎకరాల్లో సాగవుతున్న పిప్పళ్ల పంటకు ప్రభుత్వం నుంచి కనీస సహాయ సహకారాలు అందడం లేదని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వి.మాడుగులకు చెందిన వర్తకులు మాత్రమే వాటినిగిరిజన రైతుల వద్ద కొనుగోలు చేసి, జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:40 PM