Share News

పడిపోయిన ఫ్లాట్ల అమ్మకాలు

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:43 AM

ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇటీవల ఇళ్ల అమ్మకాలు బాగా పడిపోయాయని ఓ సర్వేలో తేలింది.

పడిపోయిన ఫ్లాట్ల అమ్మకాలు

2024తో పోల్చితే 2025లో నగరంలో 34 శాతం మేర క్షీణత

ఓ సంస్థ సర్వేలో వెల్లడి

ధరలు అధికంగా ఉండడమే కారణం?

సిటీలో చదరపు అడుగు రూ.8 వేలుపైనే...

శివర్లలో రూ.5 వేలు

ఐటీ కంపెనీల రాకతో డిమాండ్‌ పెరుగుతుందని నిర్మాణదారుల ఆశాభావం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇటీవల ఇళ్ల అమ్మకాలు బాగా పడిపోయాయని ఓ సర్వేలో తేలింది. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి చెందిన ప్రాప్‌ఈక్విటీ అనే సంస్థ ఇటీవల ఒక నివేదికను వెల్లడించింది. దాని ప్రకారం 2024 కంటే 2025లో ఫ్లాట్ల (యూనిట్ల) అమ్మకాలు తగ్గిపోయాయని పేర్కొంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో 25 శాతం తగ్గిపోగా, సూరత్‌లో 15 శాతం, నాగపూర్‌లో 18 శాతం, కొచ్చిలో 17 శాతం పడిపోయాయి. అదే విశాఖపట్నం దగ్గరకు వచ్చేసరికి అత్యధికంగా 34 శాతం అమ్మకాలు పడిపోయాయని పేర్కొంది.

కారణాలు అనేకం

విశాఖపట్నంలో ఫ్లాట్ల విక్రయాలు తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని భవన నిర్మాణ వర్గాలు చెబుతున్నాయి. సిటీలో భూముల ధరలు బాగా పెరిగిపోయాయి. కనీస ధర చ.గజం రూ.లక్ష, అదే ప్రధాన ప్రాంతాల్లో అయితే రూ.1.5 లక్షలు ఉంది. ఇక నిర్మాణ ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా వర్కర్ల వేతనాలు కూడా అధికంగా ఉన్నాయి. చ.అ. నిర్మాణానికి కనీసం రూ.2 వేలు పడుతోందని, అదే లగ్జరీ నిర్మాణం అయితే రూ.4 వేల వరకూ అవుతోందని నిర్మాణదారులు చెబుతున్నారు. భూమి ధర, నిర్మాణ వ్యయం, వడ్డీలు, లాభం అన్నీ కలుపుకొంటే సిటీలో చ.అ. కనీసం రూ.8 వేలకు అమ్మితే తప్ప గిట్టుబాటు కావడం లేదని క్రెడాయ్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. సిటీలో మధ్య తరగతి ప్రజలు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ కొనాలంటే వేయి చ.అ. విస్తీర్ణానికి అన్నీ కలుపుకొని కోటి రూపాయల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. ఉద్యోగ వర్గాలు ఎవరూ అంత పెద్ద మొత్తం పెట్టే స్థితిలో లేరు. బ్యాంకు రుణం కూడా అందులో సగమే లభిస్తోంది. అందుకని బిల్డర్లు సిటీలో ఎగువ మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లు నిర్మిస్తున్నారని, వాటి విక్రయాలు నెమ్మదించాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నగర శివారు ప్రాంతమైన మధురవాడ, పీఎం పాలెం, కొమ్మాదిల్లో సైతం చ.అ. 5 వేలకు విక్రయిస్తున్నారు. అక్కడ రూ.50 లక్షలకు డబుల్‌ బెడ్‌రూమ్‌, రూ.70 లక్షలకు త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ దొరుకుతున్నాయి. అయితే అంత దూరం రోజూ ట్రాఫిక్‌లో తిరగలేక చాలామంది అటువైపు మొగ్గు చూపడం లేదు. తప్పనిసరిగా ఏదో ఒకటి ఇప్పుడే సమకూర్చుకోవాలని ఆలోచన ఉన్నవారు తప్ప, ఇతరులు వాటిపై పెట్టుబడులు పెట్టడం లేదు. అందుకే అమ్మకాలు తగ్గాయని నరెడ్కో ప్రతినిధి మరొకరు వివరించారు. చాలా ప్రాజెక్టులు పూర్తిచేయడం లేదని, డిమాండ్‌ వచ్చాక చూద్దామని ఆపేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఇప్పుడు స్పీడ్‌ పెరుగుతుంది

అయితే ఇటీవల గూగుల్‌, కాగ్నిజెంట్‌ వంటి సంస్థలతో పాటు టీసీఎస్‌తో పాటు మరిన్ని విశాఖపట్నం వచ్చినందున ఐటీలో ఉన్నవారు ఎంక్వయిరీలు చేస్తున్నారని, త్వరలో డిమాండ్‌ పెరుగుతుందని ఆశిస్తున్నామని అప్రెడా ప్రతినిధి ఒకరు ఆశాభావం వ్యక్తంచేశారు.

Updated Date - Feb 24 , 2026 | 01:43 AM