Share News

సాయిరెడ్డి కుమార్తె అక్రమ నిర్మాణం వ్యవహారం అధికారులకు నోటీసులు

ABN , Publish Date - Mar 07 , 2026 | 01:02 AM

భీమిలి బీచ్‌లోని కోస్తా నియంత్రణ మండలి-1 పరిధిలో అనుమతులు లేకుండా శాశ్వత కాంక్రీట్‌ గోడ నిర్మించిన వ్యవహారంలో ప్రభుత్వం సంబంధిత అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేసింది.

సాయిరెడ్డి కుమార్తె అక్రమ నిర్మాణం వ్యవహారం అధికారులకు నోటీసులు

విశాఖపట్నం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి):

భీమిలి బీచ్‌లోని కోస్తా నియంత్రణ మండలి-1 పరిధిలో అనుమతులు లేకుండా శాశ్వత కాంక్రీట్‌ గోడ నిర్మించిన వ్యవహారంలో ప్రభుత్వం సంబంధిత అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అవ్యాన్‌ రియల్టర్స్‌ పేరుతో పునాదులు, రక్షణ గోడ నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే. దానిపై జనసేన నాయకుడు పీతల మూర్తియాదవ్‌ హైకోర్టులో కేసు వేయగా విచారణ చేసి, వాటిని వారి ఖర్చుతో తొలగించాల్సిందిగా ఆదేశించిన సంగతి విదితమే. అక్రమంగా నిర్మాణాలు చేపడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదో రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ అప్పటి భీమిలి జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మి, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్లు శైలజావల్లి, డి.శ్రీనివాసరావు, వార్డు రెగ్యులర్‌ సెక్రటరీ శైలజాకుమారిలకు ప్రభుత్వం శుక్రవారం నోటీసులు జారీచేసింది. రాజకీయ ఒత్తిళ్లు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావలసిందని, అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించింది.


భీమిలిలో ‘మైరా బే వ్యూ రిసార్ట్స్‌’

రూ.256 కోట్ల పెట్టుబడి

విశాఖపట్నం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని భీమిలి మండలం కొత్తవలసలో ‘మైరా బే వ్యూ రిసార్ట్స్‌ కంపెనీ’ భారీ కన్వెన్షన్‌ సెంటర్‌, లగ్జరీ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ సెంటర్‌, రిసార్ట్స్‌ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టును 15 ఎకరాల్లో చేపడుతోంది. దీనికి అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం సంస్థ దరఖాస్తు చేసుకుంది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.256 కోట్లు. ఈ సంస్థ ఇప్పటికే రాయ్‌పూర్‌, కన్హాలలో రిసార్ట్స్‌ నిర్వహిస్తోంది. విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాను ఎంపిక చేసుకుంది.

ఇంటర్‌ పరీక్షలకు 98.14 శాతం హాజరు

మద్దిలపాలెం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 98.14 శాతం హాజరు నమోదైంది. 85 కేంద్రాల్లో జరిగిన పరీక్షల్లో 8,906 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 169 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం సైన్స్‌ విద్యార్థులకు జువాలజీ, ఆర్ట్స్‌ విద్యార్థులకు ఎకానమిక్స్‌ పరీక్ష నిర్వహించారు. ఉదయం డ్రాలో వచ్చిన సెట్‌-1 ప్రశ్నపత్రాన్ని విద్యార్థులకు అందించినట్టు ఆర్‌ఐవో బి.మురళీధర్‌ తెలిపారు.

Updated Date - Mar 07 , 2026 | 01:02 AM