లంబసింగిలో కుంకుమపువ్వు సాగు
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:30 PM
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో గిరిజన రైతులతో కుంకుమపువ్వు సాగు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
పీపీపీ విధానంలో ఆదివాసీ రైతులు పండించేందుకు కేబినెట్ తీర్మానం
ప్రణాళిక సిద్ధం చేస్తున్న వ్యవసాయ అధికారులు
మూడేళ్ల క్రితం ఆర్‌ఏఆర్‌ఎస్‌లో పరిశోధనలు
ఆశాజనకంగా ప్రయోగాత్మక సాగు
గిరిజన ప్రాంతానికి అనువైన రకాలు, సాగు విధానంపై శాస్త్రవేత్తలు అధ్యయనం
చింతపల్లి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో గిరిజన రైతులతో కుంకుమపువ్వు సాగు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మూడేళ్ల క్రితం స్థానిక ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తొలిసారిగా కుంకుమపువ్వుపై ప్రయోగాత్మక సాగు చేపట్టారు. విభిన్న వాతావరణ పరిస్థితుల్లో చేపట్టిన ప్రయోగాత్మక సాగు ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు శీతల ప్రాంతంగా పేరొందిన లంబసింగిలో ఉత్తర భారత దేశానికి పరిమితమైన కుంకుమపువ్వు పంటను ఆదివాసీ రైతులకు పీపీపీ విధానంలో పరిచయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఉత్తర భారతదేశాన్ని పోలిన విభిన్న వాతావరణం కలిగి వుంటుంది. ఆంధ్రకశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగిలో శీతాకాలంలో ఒకటి, రెండు, సున్న, మైనస్ డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. లంబసింగికి సమానమైౖన వాతావరణం చింతపల్లిలోనూ ఉండడంతో స్థానిక ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో 2022లో విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎల్.ప్రశాంతి సహాయ సహకారాలతో నాటి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్(ఏడీఆర్) డాక్టర్ ఎం.సురేశ్ కుమార్ పర్యవేక్షణలో శాస్త్రవేత్తలు కుంకుమపువ్వు ప్రయోగాత్మక సాగు ప్రారంభించారు. మదనపల్లిలో పర్పుల్ స్ర్పింగ్స్ సంస్థ ప్రతినిధులు ల్యాబ్‌లో కృత్రిమ వాతావరణంలో కుంకుమపువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించారు. ఈ మేరకు పరిశోధన స్థానంలో పర్పుల్ స్ర్పింగ్స్ సంస్థ ప్రతినిధుల సాంకేతిక సహకారంతో 2023 వరకు కుంకుమపువ్వుపై పరిశోధనలు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించారు.
కశ్మీర్ నుంచి విత్తనాల దిగుమతి
ప్రయోగాత్మక సాగు చేపట్టేందుకు కుంకుమపువ్వు విత్తనాలను కశ్మీర్ నుంచి దిగుమతి చేసుకున్నారు. రెండు వందల కిలోల విత్తనం(దుంపలు) రూ.1.4 లక్షలకు కొనుగోలు చేశారు. కశ్మీర్‌లోని ఓ అభ్యుదయ రైతు ఉత్పత్తి చేసిన నాణ్యమైన విత్తనాన్ని దిగుమతి చేసుకున్నారు.
మూడు వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు
పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మూడు వాతావరణ పరిస్థితుల్లో కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు. కుంకుమపువ్వు మొక్కలను గ్లాస్ హౌస్, షేడ్‌నెట్, ఓపెన్ ఫీల్డ్‌లో నాట్లు వేశారు. మూడు వాతావరణ పరిస్థితుల్లోనూ మూడు విడతలుగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో నాట్లు వేశారు. షేడ్‌నెట్, గ్లాస్ హౌస్‌లో నాటుకున్న మొక్కల నుంచి పువ్వుల దిగుబడులు అధికంగా వచ్చాయి. ఈ పూల నుంచి ఏ-గ్రేడ్ కుంకుమపువ్వు దిగుబడి వచ్చిందని, కశ్మీర్‌కి పరిమితమైన కుంకుమపువ్వు అల్లూరి సీతారామరాజు జిల్లా వాతావరణం సాగుకు అనుకూలమని ప్రాథమికంగా నిర్ధారించామని నాటి ఏడీఆర్ డాక్టర్ ఎం.సురేశ్ కుమార్ తెలిపారు.
రెట్టింపు ఆదాయం సమకూర్చే పంట
కుంకుమపువ్వు రెట్టింపు ఆదాయం సమకూర్చే పంటగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గిరిజన రైతులు గంజాయి పంటపై ఏ స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారో అదే తరహాలో కుంకుమపువ్వును సాగు చేసుకుంటే రెట్టింపు లాభాలు అర్జించవచ్చునని శాస్త్రవేత్తల ప్రయోగాత్మక సాగు నివేదికలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలో సాగు చేసిన కుంకుమపువ్వు నుంచి ఎకరాకు 2-2.5 కిలోల దిగుబడి వస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. కిలో కుంకుమపువ్వు మార్కెట్‌లో రూ.3.5-5 లక్షల ధర లభిస్తున్నందున, ఒక రైతు కుటుంబం కేవలం 20 సెంట్ల స్థలంలో షేడ్‌నెట్ వేసుకుని కుంకుమపువ్వు సాగు చేపడితే మూడు నెలల్లో రూ.1.2 లక్షలు ఆదాయం పొందవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వమే లంబసింగిలో కుంకుమపువ్వు సాగు చేపట్టేందుకు ముందుకు రావడంతో గిరిజన రైతులకు సాగుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం అందించనుంది. ప్రస్తుతం లంబసింగిలో కుంకుమపువ్వు సాగుకు అవసరమైన ప్రణాళికలను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు.