జీవన పోరాటంలో భద్రతా ముఖ్యమే
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:23 AM
మత్స్యకారులు జీవన పోరాటంలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ప్రాణాలను లెక్క చేయడం లేదు. తెగువతో సముద్రంలోకి వెళ్లిపోతున్నారు.
ట్రాన్స్‌పాండర్ వంటి పరికరాలు వినియోగానికి మత్స్యకారులు దూరం
బోటులో ఉన్నా స్విచ్ఛాప్
అవి ఆన్‌లో ఉన్నట్టయితే ప్రమాదం సంభవించిన వెంటనే అధికారులకు సమాచారం అందించేందుకు అవకాశం
చాలా బోట్లలో లైఫ్ జాకెట్లు కూడా ఉండవు
జీవిత బీమాపై యజమానుల నిర్లక్ష్యం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మత్స్యకారులు జీవన పోరాటంలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ప్రాణాలను లెక్క చేయడం లేదు. తెగువతో సముద్రంలోకి వెళ్లిపోతున్నారు. అదే ఒక్కొక్కసారి వారి కుటుంబాలను శోక సముద్రంలో ముంచేస్తోంది.
సముద్రంలో బోట్లపై చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన జీపీఎస్, ట్రాన్స్‌పాండర్ పరికరాలను ఉపయోగించాలి. వాటి వల్ల ఆ బోటు ఎక్కడుందో సమాచారం ఎప్పటికప్పుడు అధికారులకు తెలుస్తుంది. బోటు ఎంత దూరాన ఉన్నా ట్రాన్స్‌పాండర్ సిగ్నల్ పంపుతుంది. దాని ద్వారా వారిని గుర్తించడం సులువు. కానీ మత్స్యకారుల్లో 90 శాతం మంది వాటిని ఉపయోగించడం లేదు. దానికి బదులుగా వీహెచ్‌ఎస్ సెట్లు ఉపయోగిస్తున్నారు. వేటకు వెళ్లేటప్పుడు నాలుగైదు బోట్లు కలిసి వెళతాయి. ఒక బోటు నుంచి మరో బోటులో వారితో మాట్లాడడానికి ఆ సెట్లు ఉపయోగపడతాయి. ట్రాన్స్‌పాండర్ ఆన్‌లో ఉంటే వీహెచ్‌ఎస్ సెట్ సరిగ్గా పనిచేయదని ఆపేస్తుంటారు. దాని వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు బోట్ల ఆచూకీ తెలుసుకోవడం కష్టమవుతోంది. ఇప్పుడు శనివారం గల్లంతైన బోటులో కూడా ట్రాన్స్‌పాండర్ ఆఫ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. దాని వల్ల ఆ బోటు ఎక్కడ మునిగిపోయిందో తెలియడం లేదు.
‘నవమిత్ర’ యాప్‌తో అనుసంధానం
ఇస్రో ‘నవమిత్ర’ యాప్ తయారుచేసి దానిని ట్రాన్స్‌పాండర్లకు అనుసంధానం చేసింది. దాని ద్వారా మత్స్యకారులు మొబైల్ ఫోన్ల నుంచి కూడా వారి సమాచారాన్ని అధికారులకు తెలియజేయవచ్చు. అందులో ఉండే ప్రత్యేక బటన్ నొక్కితే అలారం మోగుతుంది. దాని ద్వారా అధికారులకు అలర్ట్ వెళుతుంది. వెంటనే ఏమి జరిగిందో తెలుసుకొని సహాయక చర్యలు చేపడతారు. మత్స్యకారులు ట్రాన్స్‌పాండర్లను అలంకారప్రాయంగా ఉంచడం వల్ల విపత్తు సమయాల్లో ఇబ్బందులు వస్తున్నాయి.
లైఫ్ జాకెట్లు నిల్..బీమా శూన్యం
సముద్రంలో వేటకు వెళ్లడం అంటే జీవన సమరమే. తిరిగి వచ్చేంత వరకు గ్యారంటీ ఉండదు. కానీ, వారికి అదే జీవనం కావడంతో భయపడరు. ప్రతి బోటులో లైఫ్‌జాకెట్లు ఉండాలి. వాటిని మత్స్యకారులు ధరించాలి. కానీ వాటిని సమకూర్చుకోరు. కొంతమంది ఉన్నా ధరించరు. ఈత వచ్చుననే ధైర్యం వారిని అలా చేస్తోంది. అదేవిధంగా వేటకు వెళ్లే వారికి యజమాని బీమా సౌకర్యం కల్పించాలి. అది కూడా చాలా మంది చేయించడం లేదు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సమస్యలు తీవ్రమవుతున్నాయనేది అధికారుల వాదన. ముఖ్యంగా సముద్రం అలజడిగా ఉందని, వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన సమయంలో కూడా 50 శాతం మంది వేటకు వెళ్లిపోతున్నారు. అదే ప్రమాదాలకు కారణమవుతున్నదనే వాదన కూడా ఉంది.
జాడలేని జాలర్లు
కొనసాగుతున్న గాలింపు చర్యలు
బీచ్ రోడ్డు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు రోజులైనా ఎలాంటి సమాచారం అందకపోవడంతో సోమవారం హార్బర్ వద్ద కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇదిలావుండగా మత్స్యకారుల ఆచూకీని త్వరగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ హార్బర్ గేటు వద్ద మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధితుల కుటుంబాలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.