ప్రాణాలు కాపాడిన స్టేఫ్టీ అలారం
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:28 AM
జాతీయ రహదారిపై ఎలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద గురువారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సేఫ్టీ అలారమే ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు బస్సులోని సేఫ్టీ అలారం సైరన్ మోగడంతో డ్రైవర్‌తోపాటు పలువురు ప్రయాణికులు అప్రమత్తయ్యారు.
బస్సును వెంటనే పక్కకు తీసి, ప్రయాణికులను అప్రమత్తం చేసిన డ్రైవర్
ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై అధికారుల విశ్లేషణ
ఎలమంచిలి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై ఎలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద గురువారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సేఫ్టీ అలారమే ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు బస్సులోని సేఫ్టీ అలారం సైరన్ మోగడంతో డ్రైవర్‌తోపాటు పలువురు ప్రయాణికులు అప్రమత్తయ్యారు. అప్పుడు సమయం 10.30 గంటలు కావడంతో ఎక్కువ మంది ఇంకా నిద్రకు ఉపక్రమించలేదు. డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి, ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. క్యాబిన్ డోర్‌తోపాటు, ఎంట్రీ డోర్‌ను పూర్తిగా తెరిచి, ప్రయాణికులు శరవేగంగా బస్సులో నుంచి కిందకు దిగేలా కృషి చేశారు. దీంతో ఒక్కరికి కూడా గాయాలు కాలేదు. అయితే లగేజీ చాలా వరకు కాలిపోయింది. కాగా ప్రమాదంలో కాలిపోయిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సును అనకాపల్లి ఆర్టీవో రామ్మోహనరావు, ఎంవీఐ మూర్తి, ఎలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఉపేంద్ర వేర్వేరుగా పరిశీలించారు. ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై క్షుణ్ణంగా పరిశీలించారు. బస్సు డ్రైవర్, సిబ్బందితో మాట్లాడారు. వారు చెప్పిన వివరాల ప్రకారం ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉండవచ్చని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే సేఫ్టీ అలారం సైరన్ మోగడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళుతున్న ఈ బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు వున్నారని, ఎవరికీ కనీసం చిన్నపాటి గాయం కూడా కాకుండా సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు.