Share News

సాహో

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:24 AM

ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలు...

సాహో

తీరంలో సాగరవీరుల సాహస విన్యాసాలు

కట్టిపడేసిన నౌకాదళ ప్రదర్శన

ఆకట్టుకున్న సిటీ పరేడ్‌

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

బీచ్‌రోడ్డుకు భారీగా తరలివచ్చిన జనం

లక్షన్నర మందికిపైగా హాజరయ్యారని అంచనా

విశాఖపట్నం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి):

ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలు...రివ్వున దూసుకొచ్చిన హెలికాప్టర్లు...వాటి నుంచి తాడు సాయంతో సంద్రంలోకి దిగిన నేవీ కమెండోలు...నడి సంద్రంలో పేలిన ఆయిల్‌ రిగ్‌...ఉవ్వెత్తున ఎగసిపడిన మంటలు...తీరంలో యుద్ధ ట్యాంకర్ల గర్జనలు...ఇవీ ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూలో భాగంగా నేవీ సిబ్బంది చేసిన సాహస ప్రదర్శనలు. గురువారం సాయంత్రం ఆర్‌కే బీచ్‌లో నేవీ విన్యాసాలు, అనంతరం నిర్వహించిన సిటీ పరేడ్‌ను వీక్షించేందుకు భారీసంఖ్యలో జనం తరలివచ్చారు.

అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌-2026లో భాగంగా ఆర్కే బీచ్‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. పరేడ్‌ తిలకించేందుకు నగరవాసులతో పాటు ఇతర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన సందర్శకులతో సాగరతీరం కిక్కిరిసింది. పరేడ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరవగా, నేవీ ఉన్నతాధికారులు భాగస్వాములయ్యారు. నేవీకి చెందిన అత్యాధునిక హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో కమెండోలు చేసిన ప్రదర్శనలు అబ్బురపరిచాయి. మిగ్‌ 29కే, హాక్స్‌, డార్నియర్‌ యుద్ధవిమానాలు, చేతక్‌, సీకింగ్‌ హెలికాప్టర్ల విన్యాసాలు అదరహో అనిపించాయి. నేవీ కమెండోల పోరాటం, ఆయిల్‌ రిగ్‌ను ధ్వంసం చేసిన తీరు సందర్శకులను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాయి. మిగ్‌ 29కే, పీ 8 ఐ విమానాలు బాంబులను కురిపిస్తూ దూసుకువెళ్లాయి. అనంతరం జరిగిన సిటీ పరేడ్‌ ఆకట్టుకుంది. ఫ్లీట్‌ రివ్యూలో భాగస్థులైన వివిధ దేశాల నౌకాదళ సిబ్బంది, బ్యాండు బృందాలతోపాటు భారత నేవీ, ఎన్‌సీసీ విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గంటకుపైగా సాగిన పరేడ్‌ సందర్శకులను కట్టిపడేసింది. అనంతరం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. పరేడ్‌ ముగింపులో భాగంగా నిర్వహించిన లేజర్‌ షో, ఫైర్‌వర్క్స్‌తో తీరం సరికొత్త కళను సంతరించుకుంది.

భారీగా తరలివచ్చిన జనం

ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌కు సందర్శకులు పోటెత్తారు. నోవాటెల్‌ హోటల్‌ నుంచి వీఎంఆర్‌డీఏ పార్కు వరకూ ఇసుక తిన్నెలపై నిల్చొని విన్యాసాలను వీక్షించారు. సుమారు లక్షన్నరకుపైగా ప్రజలు హాజరై ఉంటారని నేవీ అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచే బీచ్‌కు చేరుకున్నారు. వీఐపీ, ఇతర పాస్‌లతో వచ్చినప్పటికీ నాలుగు గంటల తరువాత అనుమతించకపోవడంతో అనేకమంది నేవీ, ఇతర విభాగాల అధికారులు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నుంచి కుటుంబసభ్యులతో కలిసి విన్యాసాలు, పరేడ్‌ను వీక్షించాల్సి వచ్చింది.

హోరెత్తిన సంద్రం..

నేవీ విన్యాసాలకు సందర్శకుల నుంచి మంచి స్పందన కనిపించింది. యుద్ధ విమానాలు, చేతక్‌ హెలికాప్టర్లను చూసి ఈలలు, అరుపులతో హోరెత్తించారు. ఆయిల్‌ గ్రిడ్‌ పేల్చివేత, జెట్‌ స్పీడ్‌తో వెళ్లిన మిగ్‌ విమానాలను చూసి కేరింతలు కొట్టారు. సిటీ పరేడ్‌లో భాగంగా నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్‌, లేజర్‌ షో, ఫైర్‌ వర్క్స్‌ను వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు.


బందోబస్తును పర్యవేక్షించిన సీపీ

విశాఖపట్నం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి):

బీచ్‌రోడ్డులో గురువారం జరిగిన ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌కు భారీగా ప్రముఖులు, ప్రజలు తరలిరావడంతో బందోబస్తు ఏర్పాట్లను సీపీ శంఖబ్రతబాగ్చి స్వయంగా పర్యవేక్షించారు. పార్క్‌ హోటల్‌ నుంచి కోస్టల్‌ బ్యాటరీ వరకు నడుచుకుంటూ వెళ్లి హోల్డింగ్‌పాయింట్‌లు, కట్‌ ఆఫ్‌ పాయింట్స్‌, బీచ్‌ ఎన్‌క్లోజర్స్‌ పరిశీలించారు. కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ నుంచి డ్రోన్‌లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా బీచ్‌కు దారితీసే మార్గాలు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ తీరు, వాహనాల రాకపోకలను పరిశీలించారు. సిటీ పరేడ్‌ ప్రశాంతంగా జరిగేలావిధులు నిర్వర్తించిన సిబ్బందిని ఆయన అభినందించారు.

Updated Date - Feb 20 , 2026 | 01:24 AM